డీజేపై హైదరాబాద్ సీపీ నిషేధ ఉత్తర్వులు ఏం చెబుతున్నాయంటే...
x

డీజేపై హైదరాబాద్ సీపీ నిషేధ ఉత్తర్వులు ఏం చెబుతున్నాయంటే...

హైదరాబాద్‌లో ఊరేగింపుల్లో డీజే, బాణసంచా కాల్చడంపై పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కొరడా ఝళిపించారు. మతపరమైన ఊరేగింపుల్లో డీజేను వాడవద్దంటూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు


హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో ఏడాది పొడవునా వివిధ మతాల పండుగల సందర్భంగా డీజే సౌండ్ సిస్టమ్, డీజే సౌండ్ మిక్సర్స్, సౌండ్ యాంప్లిఫైర్స్, హై సౌండ్ పరికరాల సాయంతో మోత మోగిస్తున్నారు. దీంతో శబ్ధకాలుష్యం పెచ్చుపెరుగుతోంది. ఇటీవల పలు మతాల వారు పోటీ పడి సౌండ్ సిస్టమ్ బిగ్గరగా పెట్టి ధ్వని కాలుష్యం కలిగిస్తున్నారు. ఈ డీజే సౌండ్ వల్ల ప్రజల శబ్ధ కాలుష్యం బారిన పడుతున్నారు. ధ్వని కాలుష్యం ప్రజలకు హానికరంగా మారింది. పోలీసులు, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారుల అనుమతి లేకుండానే భారీ ఊరేగింపులు నిర్వహిస్తూ డీజేలతో శబ్ధ కాలుష్యం కలిగిస్తున్నారు.నగరంలో డీజేల వల్ల పలు సమస్యలు ఎదురవుతున్నాయి.


ఎన్నెన్నో ఫిర్యాదులు
హైదరాబాద్ నగరంలో శబ్ధ కాలుష్యంపై ప్రజలు డయల్ 100కు ఫిర్యాదులు చేశారు. నివాసప్రాంతాల్లో శబ్ధకాలుష్యం వల్ల పిల్లల చదువులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.వృద్ధులకు శబ్ధకాలుష్యం వల్ల తీవ్ర అవస్థలు పడుతున్నారు.

బాణసంచా పేలుళ్లపై నిషేధం
ఊరేగింపుల సందర్భంగా వేలాదిమంది ప్రజల మధ్య పెద్ద సంఖ్యలో బాణసంచాను కాలుష్తున్నారు. దీనివల్ల ఊరేగింపులు మంటలు అంటుకొని పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారు.గత నెల 19వతేదీన మిలాద్ ఉన్ నబీ పండుగ ఊరేగింపు సందర్భంగా బాణసంచాను కాల్చడం వల్ల ఆ నిప్పు రవ్వలు డీజే సిస్టం జనరేటరుపై పడి మంటలు అంటుకున్నాయి. రూమర్ల ప్రచారం వల్ల మతపరమైన ఉద్రిక్తతలు కూడా ఏర్పడే పరిస్థితి ఏర్పడితే పోలీసులు సకాలంలో రంగంలోకి దిగి అసలు వాస్తవాన్ని చెప్పారు.ఊరేగింపుల్లో మాత్రం బాణసంచా కాల్చవద్దని పోలీసు కమిసనర్ నిషేధ ఉత్తర్వులు జారీ చేశారు.

సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పిందంటే...
దేశంలో అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు శబ్ధ కాలుష్యంపై సంచలన తీర్పు చెప్పింది. చర్స్ ఆఫ్ గాడ్ గాస్పెల్ వర్సెస్ కేకేఆర్ మెజిస్టిక్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కేసులో 2000వ సంవత్సరం ఆగస్టు 30వతేదీన ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. శబ్ధ కాలుష్యం ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందని, నిద్రాభంగం కలిగిస్తుందని పేర్కొంది. శబ్ధ కాలుష్యం వల్ల వినికిడి శక్తి కోల్పోయి బధిరులుగా మారుతున్నారని సుప్రీం వ్యాఖ్యానించింది. శబ్ధ కాలుష్యం వల్ల అధిక రక్తపోటు, డిప్రెషన్, మానసిక ఆందోళన కలిగిస్తుందని సుప్రీం పేర్కొంది. దీంతోపాటు విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతుందని పేర్కొంది. ఇండస్ట్రియల్, రెసిడెన్షియల్, కమర్షియల్, సైలెన్స్ జోన్లుగా విభజించి పగలూ, రాత్రి సమయాల్లో లౌడ్ స్పీకర్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, డీజే సిస్టమ్, ఆంప్లియన్స్ ల వినియోగంపై ఆంక్షలు విధించాలని సుప్రీంకోర్టు సూచించింది.

సుప్రీం ఉత్తర్వులు ఏం చెబుతున్నాయంటే...
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు, డీజే సిస్టమ్ వినియోగించరాదు. ఆసుపత్రులు, విద్యాసంస్థలు, కోర్టులు ఉన్న ప్రాంతాలను సుప్రీంకోర్టు సైలెన్స్ జోన్ గా నిర్ణయించింది. ఈ సైలెన్స్ జోన్లలోని ఆసుపత్రులు, కోర్టులు, విద్యాసంస్థలకు 100 మీటర్ల దూరంలో ఎలాంటి సౌండ్ పెట్టరాదు.

డీజేలను నిషేధించాలని ఏకగ్రీవ నిర్ణయం
హైదరాబాద్ నగరంలో పెచ్చు పెరిగిన శబ్ధకాలుష్యం నేపథ్యంలో గత నెల 26వతేదీన పోలీసు అధికారులు అన్ని మతాల ప్రతినిధులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.ఊరేగింపుల్లో డీజేల వినియోగం, బాణసంచా కాల్చడంపై ఆంక్షలు విధించాలని సమావేశంలో నిర్ణయించారు.డీజేలు,ఊరేగింపుల్లో బాణసంచాను కాల్చవద్దని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు.

హైదరాబాద్ సీపీ ఉత్తర్వులు
హైదరాబాద్ సిటీ పోలీసు యాక్ట్ సెక్షన్ 21,22, భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023 సెక్షన్ 163 ప్రకారం హైదరాబాద్ నగరంలో మతపరమైన ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్, డీజే సౌండ్ మిక్సర్స్ , సౌండ్ యాంప్లిఫైర్స్, హైసౌండ్ వెలువరించే పరికరాలను వాడవద్దని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీలో శబ్ధకాలుష్యం నివారణకు అప్పటి పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్టుమెంటు 172 నంబరుతో జీఓ జారీ చేసింది.

ఏ జోన్ లో ఎంత సౌండ్ లిమిట్ అంటే...
రెసిడెన్షియల్ జోన్ లో పగలు 55 డెసిబుల్స్, రాత్రి సమయంలో 45 డెసిబుల్స్ సౌండ్ పరిమితి విధించారు. సైలెన్స్ జోన్ అయితే పగలు 50 డెసిబుల్స్, రాత్రి వేళ 40 డెసిబుల్స్ సౌండ్ దాటరాదు. కమర్షియల్ ఏరియాల్లో పగలు 65 డెసిబుల్స్, రాత్రి 55 డెసిబుల్స్ సౌండ్ పరిమితి విధించారు. ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో అయితే పగలు 70 డెసిబుల్స్, రాత్రి 70 డెసిబుల్స్ సౌండ్ లిమిట్ గా పెట్టారు.


Read More
Next Story