తెలంగాణ సివిల్ సర్వెంట్ల ఆస్తుల బాగోతాలపై విచారణ ఏది?
x
తెలంగాణ సచివాలయం

తెలంగాణ సివిల్ సర్వెంట్ల ఆస్తుల బాగోతాలపై విచారణ ఏది?

తెలంగాణలో సివిల్ సర్వెంట్ల వార్షిక ఆస్తుల ప్రకటన మొక్కుబడిగా మారింది. ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల్లో ఎక్కువ మంది తమకు ఎలాంటి ఆస్తులు లేవని ప్రకటించడం విశేషం.


తెలంగాణ ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల్లో చాలామందికి స్థిరాస్తులే లేవని ఐపీఆర్ లను డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ)కి సమర్పించారు.ప్రతీ ఏటా వారి స్థిరాస్తుల వివరాలను డీఓపీటీకి సమర్పించాలి.ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు తమ వార్షిక ఆస్తుల వివరాలను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ డీఓపీటీకి సమర్పించాలి.తెలంగాణ రాష్ట్రంలో 2025 జనవరి 1వతేదీ నాటికి 174 మంది ఐఎఎస్ అధికారులు, 128 మంది ఐపీఎస్ అధికారులు పనిచేస్తున్నారు. వారసత్వం ద్వారా పొందిన వాటితో సహా వారి ఆస్తులను కూడా బహిర్గతం చేయాలి.2024వ సంవత్సరానికి గాను ఇప్పటికీ ఆరుగురు తెలంగాణ సివిల్ సర్వెంట్లు ఆస్తుల వివరాలను సమర్పించలేదు. 2024వ సంవత్సరానికి రిటర్న్ లను 2025 జనవరి లోగా సమర్పించాలి.కాని ఆరుగురు అధికారులు వారి ఆస్తుల వివరాలను ఏప్రిల్ నెల వచ్చినా సమర్పించలేదు. డీఓపీటీ రికార్డుల ఆధారంగా తెలంగాణ సివిల్ సర్వెంట్ల స్థిరాస్థులపై ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రత్యేక కథనం.


మాకు ఎలాంటి ఆస్తులే లేవు...
తెలంగాణ సివిల్ సర్వెంట్లలో అందులోనూ మహిళా అధికారులు తమ వార్షిక రిటర్న్ లలో తమకు ఎలాంటి స్థిరాస్తులే లేవని ప్రకటించారు.డీఓపీటీ వార్షిక ఆస్తుల వివరాల పోర్టల్ నుంచి అధికారిక డేటాను పరిశీలించగా శిఖా గోయెల్, స్వాతి లక్రా, అకున్ సబర్వాల్ వంటి సీనియర్ ఐపీఎస్ అధికారులు,ఐఎఎస్ అధికారులు యోగితా రాణా, జయేష్ రంజన్, సంజయ్ జాజులు 2024 వరకు తమకు ఎలాంటి స్థిరాస్తులు లేవని ప్రకటించారు. జయేష్ రంజన్, సంజయ్ జాజులు 2024 వరకు తమకు ఎలాంటి స్థిరాస్తులు లేవని ఆస్తుల వద్ద నిల్ అని ప్రకటించారు. తెలంగాణ పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ తనకు అసలు స్థిరాస్తులే లేవని 2024 ఆస్తుల రిటర్న్ లో ప్రకటించారు.మరో ఐపీఎస్ అధికారి ఎం స్టీఫెన్ రవీంద్ర కూడా తనకు ఎలాంటి ఆస్తి లేదని రిటర్న్ సమర్పించారు.

తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులు
1992 బ్యాచ్ ఐఎఎస్ అధికారి వికాస్ రాజ్ రవాణశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. తనకు జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో లైన్ ట్యాంక్ రోడ్డులో 1200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్ ఉందని ప్రకటించారు. హైదరాబాద్ గుట్టల బేగంపేటలో 3వేల చదరపు అడుగుల్లో ఇల్లు ఉందని, దీంతో పాటు మెదక్ జిల్లా వర్గల్ లో సర్వేనంబరు 842 ,848,850,851,852లో 7.50 ఎకరాల వ్యవసాయ భూమిని తన తండ్రి వద్ద నుంచి వారసత్వంగా వచ్చినట్లు చూపించారు.

వ్యవసాయ భూములు...
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరుగా ఉన్న పొట్రు గౌతం కృష్ణా జిల్లా నూజివీడు మండలం గుల్లపుడి గ్రామంలో 3.2 ఎకరాలు, 2.8 ఎకరాల వ్యవసాయ భూములు, తిరువూరు ఎర్రమాడు గ్రామంలో 6.18 ఎకరాలు, నూజివీడులో 611 గజాల్లో ఇల్లు ఉన్నాయని చూపించారు. తెలంగాణ రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ మహేశ్వరం మండలం కందుకూర్ గ్రామంలో 0.20 గుంటల భూమిని రూ.37.50 లక్షలకు కొనుగోలు చేసినట్లు ప్రకటించారు.

చీఫ్ సెక్రటరీకి ఒక్క ఇల్లే ఉందట...
తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎ శాంతికుమారి తనకు జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లో ఒక్కటే ఇల్లు ఉందని స్థిరాస్తుల రిటర్న్ లో పేర్కొన్నారు.జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ సొసైటీలోని ప్రశాసన్ నగర్ లో 126 ప్లాట్ నంబరులో 501.87 చదరపు గజాల స్థలంలో తనకు నివాసగృహం ఉందని, దీని ప్రస్థుత మార్కెట్ విలువ ప్రకారం రూ.75 లక్షలని శాంతికుమారి తెలిపారు.తాను ఈ ఇంటి స్థలాన్ని 1997వ సంవత్సరంలో కొన్నట్లు చూపించారు.తన భర్త భాస్కర్ సంజయ్ పేరిట రాజేంద్రనగర్ పీరం చెరువు సర్వేనంబరు 167 వద్ద 1244 గజాల స్థలం ఉందని చూపించారు. ఈ స్థలం తన తండ్రి ఎ రాధాకృష్ణ మూర్తి 2001లో తన భర్తకు బహుమతిగా ఇచ్చారని సీఎస్ పేర్కొన్నారు.

మీజూరి దాన కిషోర్ ఆస్తులెన్నో...
తెలంగాణ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న మీజూరి దాన కిషోర్, అతని భార్య జేఆర్ అపర్ణ పేరిట పలు ప్రాంతాల్లో ఆస్తులున్నాయని ప్రకటించారు. తనకు తాత, తండ్రి నుంచి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం కుద్రి గ్రామంలో 10 ఎకరాల వ్యవసాయ క్షేత్రం, సింగిల్ ఫ్లోర్ ఇల్లు వచ్చాయని దానకిషోర్ తెలిపారు.తాను నెల్లూరు జిల్లా కనపర్తిపాడు గ్రామంలో 266.66 చదరపు గజాల భూమిని కొన్నానని చెప్పారు.తన భార్య జేఆర్ అపర్ణ నెల్లూరు జిల్లా తలమంచి గ్రామంలో 11.97 ఎకరాల ఫాం ల్యాండ్,చెముడు గుంటలో 266 గజాల రెండు ప్లాట్లు, భుజాబాబానగర్ గ్రామంలో 266.66 గజాల ఇళ్ల స్థలం, బాబానగర్ లో మరో 266 గజాల ప్లాట్, రంగారెడ్డి జిల్లా కొత్వాలగూడ గ్రామంలో 605 గజాల ఇళ్ల ప్లాట్, పేట్ బషీరాబాద్ లో 1144 అదరపు అడుగుల ఫ్లాట్, మహబూబ్ నగర్ జిల్లా వ్యవసాయ భూమి, కొండాపూర్ లో 2659 చదరపు అడుగుల ట్రాంక్విల్ టవర్స్ లో ఫ్లాట్ ఉన్నాయని దానకిషోర్ ప్రకటించారు.

తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా ఆస్తులు వచ్చాయట...
సీవీ ఆనంద్, అవినాష్ మహంతి కూడా వారసత్వపు ఆస్తులున్నాయని రికార్డుల్లో సూచించారు.ఐపీఎస్ అధికారి డీజీపీ జితేందర్ తనకు తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా ఆస్తులు వచ్చాయని తెలిపారు.చాలా మంది ఐపీఎస్ అధికారుల ఆస్తులు తల్లిదండ్రుల లేదా వారసత్వంగా వచ్చిన ఆస్తుల ద్వారా వచ్చినట్లు రికార్డులు సూచిస్తున్నాయి.

ఆరుగురు అధికారులు ఆస్తుల సమాచారమే ఇవ్వలేదు...
తెలంగాణలో ఆరుగురు సివిల్ సర్వెంట్లు ఇంకా ఆస్తుల సమాచారాన్ని డీఓపీటీకి సమర్పించలేదు. డీఓపీటీ ఆస్తులు రిటర్న్ లు సమర్పించాలని నోటీసులు జారీ చేసినా తెలంగాణలోని పలువురు ఉన్నత స్థాయి ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు 2024కి సంబంధించి తమ వార్షిక ఆస్తుల వివరాలను ఫైల్ చేయ లేదు. చాలా మంది తమకు స్థిరాస్తులు లేవని ప్రకటించారు. ఆరుగురు సివిల్ సర్వెంట్లలో ముగ్గురు ఐఎఎస్,ముగ్గురు ఐపిఎస్ అధికారులు - 2024 సంవత్సరానికి సంబంధించి తమ స్థిరాస్తి రిటర్న్‌లను (ఐపిఆర్‌లు) డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డిఒపిటి)కి సమర్పించలేదు. దీంతో అధికారులందరూ జనవరి 2025లోగా తమ రిటర్న్‌లను దాఖలు చేయాలని గుర్తు చేస్తూ అధికారులకు డీఓపీటీ ఆదేశాలు జారీ చేసింది.

ఆస్తులివ్వని అధికారులు
డీఓపీటీకి వార్షిక ఆస్తుల వివరాలు సమర్పించని ముగ్గురు ఐపీఎస్ అధికారుల్లో ఎం శ్రీనివాసులు (2006 బ్యాచ్), డి. ఉదయ్ కుమార్ రెడ్డి (2019 బ్యాచ్), రుత్విక్ సాయి కొట్టె (2023 బ్యాచ్), ఐఏఎస్ అధికారుల్లో చిట్టెం లక్ష్మి (2013 బ్యాచ్), అశ్విని తానాజీ వాకడే (2020 బ్యాచ్), ఫైజాన్ అహ్మద్ (2021 బ్యాచ్) ఉన్నారు.

సివిల్ సర్వెంట్లపై కేసులు
ఫార్ములా-ఈ కార్‌ రేసు వ్యవహారంలో ఏ 2గా పురపాలక శాఖ మాజీ సెక్రటరీ, ఐఏఎస్‌ అర్వింద్‌కుమార్‌పై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. రహేజా భూముల కుంభకోణంలో ఐఎఎస్ అధికారులు బీపీ ఆచార్య, మూర్తి, రత్నప్రభలపై, ఐపియస్ అధికారి గోపాలకృష్ణపై కేసులు నమోదు చేశారు. తెలంగాణలో రెవెన్యూ, పట్టణాభివృద్ధి,హోం శాఖల్లో పనిచేస్తున్న అధికారులపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. అధికారులపై నమోదైన కేసులు, వివాదాలు, అవినీతి దర్యాప్తులు, కాగ్ ఆడిట్ పరిశీలనలో తేలిన అక్రమాలను సరిచూసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

పారదర్శకత, ప్రజా జవాబుదారీతనం ఏది?
తెలంగాణలో సివిల్ సర్వెంట్ల ఆస్తుల ప్రకటనలో పారదర్శకత, ప్రజల జవాబుదారీతనం లేదని మాజీ ఐఎఫ్ఎస్ అధికారి యం పద్మనాభరెడ్డి వ్యాఖ్యానించారు. స్థిరాస్తులు లేవని క్లెయిమ్ చేసే సీనియర్ అధికారులను, ముఖ్యంగా చాలా కాలంగా పనిచేస్తున్న అధికారుల గురించి చట్టబద్ధమైన ప్రజా పరిశీలన జరపాల్సిన అవసరముందని ఆయన చెప్పారు. ఆస్తులకు సంబంధించి అధికారులు సమర్పించిన వివరాలు ఖచ్చితమైనవా కావా? అనేది డీఓపీటీ పట్టించుకోవడం లేదని, దీనిపై పరిశీలన జరపడం లేదని చెప్పారు. మొక్కుబడిగా ఆస్తులు ప్రకటించడం తప్పితే దీనిపై ఎలాంటి పరిశీలనలు జరపడం లేదన్నారు. ఏ అధికారి మీద అయినా ఏసీబీ, లోకాయుక్త కేసులు నమోదైనప్పుడు మాత్రమే డీఓపీటీ ఆస్తులను పరిశీలిస్తున్నారని పద్మనాభరెడ్డి చెప్పారు.

సివిల్ సర్వెంట్ల ఆస్తులను విచారణ జరపాలి : మాజీ ఐఎఎస్ అధికారి షఫీఖ్ ఉజ్జమాన్
సివిల్ సర్వెంట్ల ఆస్తులపై డీఓపీటీ విచారణ జరపాలని మాజీ ఐఎఎస్ అధికారి షఫీఖ్ ఉజ్జమాన్ చెప్పారు. కొందరు అధికారులు బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టుకుంటున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంతో దీనిపై పరిశీలన జరపాల్సి ఉందన్నారు. అధికారులు డీఓపీటీ వార్షిక ఆస్తుల నివేదికలు, ఐటీ రిటర్న్ లను సరిచూస్తే అసలు వాస్తవాలు వెలుగుచూస్తాయని చెప్పారు.


Read More
Next Story