సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకం ఏది? సీఎంకు ఫోరం లేఖ
తెలంగాణలో గత 18 నెలల నుంచి సమాచార హక్కు చట్టం కమిషన్ ఖాళీగా ఉంది. సీఎం జోక్యం చేసుకొని కమిషనర్లను నియమించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరింది.
తెలంగాణ రాష్ట్రంలో సమాచార హక్కు కమిషన్ ఖాళీగా ఉంది. సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారాన్ని ఇవ్వకుంటే కమిషన్ కు అప్పీలు చేసుకోవచ్చు. కానీ తెలంగాణలో అసలు సమాచార హక్కు కమిషన్ ను నియమించక పోవడంతో వేల సంఖ్యలో అప్పీళ్లు పెండింగులో ఉన్నాయి.
- సమాచారహక్కు చట్టం సెక్షన్ 15 (1) ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన సమాచార కమిషనర్, కమిషనర్లను నియమించాలి.రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం సమాచారం ఇవ్వని పక్షంలో కమిషన్ తమ వద్దకు వచ్చిన అప్పీళ్ళను విచారించి కోరిన సమాచారం ఇప్పించాలి.కానీ అసలు కమిషన్ నియమించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది.
- సమాచార హక్కు చట్టం ప్రధాన సమాచార కమీషనర్, కమీషనర్లు ప్రజా జీవనంలో సుప్రసిద్ధులై ఉండాలి.వారికి విషయపరిజ్క్షానం,చట్టం,శాస్త్ర సాంకేతిక రంగాలు, సామాజిక సేవ, మేనేజ్‌మెంట్, జర్నలిజం, ప్రసార మాధ్యమాలు, కార్యనిర్వహణ, పరిపాలనరంగంలో అనుభవముండాలని సెక్షన్ 15 (5) నిర్థేశిస్తుంది.
18 నెలలుగా కమిషన్ ఖాళీ
తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన కమీషనర్ 2020 ఆగస్టు 24వతేదీన పదవీ విరమణ చేశారు. మిగిలిన ఐదుగురు కమీషనర్లు కూడా2023వ సంవత్సరం ఫిబ్రవరి 24వతేదీన పదవీ విరమణ చేయడంతో గత 18 నెలల నుంచి కమిషన్ ఖాళీగా ఉంది. కమిషన్ లేక పోవడడం వేలాది అప్పీళ్లు పరిష్కారానికి నోచుకోలేదు.
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్ దాఖలు
సమాచార హక్కు చట్టం యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ప్రధాన కమీషనర్, కమీషనర్ల నియామకం చేయాలని కోరుతూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ స్వచ్ఛంద సంస్థ గత ఏడాది హైకోర్టులో పిల్ వేసింది. ఆ పిల్ పై నాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ అఫిడవిట్ దాఖలు చేస్తూ ప్రధాన కమీషనర్, కమీషనర్ల నియామకం గురించి దరఖాస్తులు కోరామని తొందరలోనే నియామకం జరుగుతుందని హైకోర్టుకు తెలిపారు. కాని ఇంతవరకు కమిషన్ నియామకానికి చర్యలు తీసుకోలేదు.
15వేల అప్పీళ్లు పెండింగులోనే...
సమాచార హక్కు కమీషనర్లు లేకపోవడంతో 15 వేల అప్పీళ్ళు కమషన్ కార్యాలయంలో పెండింగులో ఉన్నాయి. అదీకాక కమీషనర్లు లేనందున ప్రభుత్వ కార్యాలయాలలో అధికారులు సమాచారం కోసం వచ్చిన దరఖాస్తులను పెద్దగా పట్టించుకోవడం లేదు.ఈ నేపథ్యంలో తెలంగాణలో సమాచార హక్కు చట్టాన్ని సమర్ధంగా అమలు చేసేందుకు వీలుగా కమిషన్ ప్రధాన కమీషనర్, కమీషనర్లను వెంటనే నియమించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.
Next Story