
‘రైతుల ముంగిటకు శాస్త్రవేత్తలు’ టార్గెట్ ఏంటి..?
ఈ కార్యక్రమం మే 5 నుంచి జూన్ 13 వరకు కొనసాగనుంది. ఇందులో దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 450 మంది శాస్త్రవేత్తలు పాల్గొననున్నారు.
దేశం, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుస్తోంది. ప్రతి అంశంలో కొత్త పొంతలు తొక్కుతోంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారాన్ని వెతుకుతోంది. కానీ వ్యవసాయం మాత్రం అభివృద్ధి బాట పట్టడం లేదు. రాష్ట్రం ఎంత సాధించినా వ్యవసాయ రంగం మాత్రం ఇంకా చాలా వెనకబడే ఉంది. రైతుల ఆత్మహత్యలూ తగ్గడం లేదు. అందుకు ప్రధాన కారణం పంటలు, నేల సహా అనేక అంశాలపై రైతులకు అవగాహన సరిగా లేకపోవడమే అని నేతలు, అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నదాతల కోసం ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ‘రైతుల ముంగిటకు శాస్త్రవేత్తలు’. వ్యవసాయానికి సంబంధించి పలు అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో పలువురు ప్రొఫేసర్లతో కలిసి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం మే 5 నుంచి జూన్ 13 వరకు కొనసాగనుంది. ఇందులో దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 450 మంది శాస్త్రవేత్తలు పాల్గొననున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 618 మండలాల్లో 200 మండలాల్లోని రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఇందుకోసం ప్రతి జిల్లాలోని నాలుగు మండలాలను ఎంచుకున్నారు. ఎంపిక చేసిన ప్రతి గ్రామంలో శాస్త్రవేత్తల బృందాలు పర్యటించి.. రైతులకు సాగు మెళకువలు, విత్తనోత్పత్తి, సస్యరక్షణ చర్యలు, నీటి నిర్వహణ సహా అనేక అంశాలపై అవగాహన కల్పిస్తారు. విత్తనాలకు ఎలా ఎంచుకోవాలి అనే విషయాలను కూడా వివరిస్తారు. పంట మార్పిడి ఆవశ్యకతను వివరిస్తారు. పత్తి, వరి కొయ్యలు కాల్యడంతో వచ్చే నష్టాలను, అధికంగా ఎరువుల వాడకం దుష్ప్రభావాలను సవివరంగా ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా చెప్తారు.
ఒక బృందంలో ఇద్దరు శాస్త్రవేత్తలు, ఇద్దరీ బీఎస్పీ లేదా పాలిటెక్నిక్ డిప్లోమా చదువుతున్న విద్యార్థులు, వ్యవసాయ శాఖ అధికారులు ఉంటారు. ఈ బృందాలు తమకు కేటాయించిన గ్రామాల్లో పర్యటించి.. ప్రతి గ్రామంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుంది. రైతు వేదికలు, పంచాయతీ కార్యాలయాల దగ్గర ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే నాణ్యమైన విత్తనాలను తయారు చేసుకోవడంపై కూడా అవగాహన కల్పించనున్నారు. చాలా మంది రైతులు విత్తనాలు వేసిన తర్వాత మొక్కలే తప్ప ఇంకేమీ రాక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే అధికారులు విత్తనాలపై కూడా అవగాహన కల్పించాలని, రైతులే స్వయంగా విత్తనాలను తయారు చేసుకుంటే ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని భావించారు. గ్రామాల్లోని రైతులపై విత్తన భారం పడకుండా చూడాలని వారు భావిస్తున్నారు. ప్రభుత్వ సహకారంతో నాణ్యమైన విత్తనాల తయారీపై కూడా శాస్త్రవేత్తలు రెడీ అవుతున్నారు.
వీటితో పాటుగా భూసార పరీక్షలు, యూరియా వాడకం, ఎరువులు వాడకం తగ్గించడం, చీడపీడల నివారణ మార్గాలు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, యాంత్రీకరణ, సమీకృత, సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తారు. వీటితో పాటు నీటి నిర్వహణ, ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ పథకాలపై కూడా అవగాహన కల్పించనున్నారు.