రేవంత్ హామీలన్నీ తుస్సేర.. హరీష్ రావు సెటైర్లు
x

రేవంత్ హామీలన్నీ తుస్సేర.. హరీష్ రావు సెటైర్లు

తెలంగాణ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ తుస్సుమన్నాయంటూ మాజీ మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు.


తెలంగాణ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ తుస్సుమన్నాయంటూ మాజీ మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ప్రజలకు ఇబ్బందులు, కష్టాలు అధికమయ్యాయంటూ చెప్పుకొచ్చారు హరీష్. ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని, అందుకోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.తిమ్మాపూర్ కొత్తపల్లిలో నిర్వహించిన అలయ్ బలయ్ సభలో హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా రేవంత్‌కు అతి త్వరలోనే ప్రజల భారీ ఝలక్ ఇవ్వనున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు ఎన్నో అబద్దపు హామీలు ఇచ్చి రేవంత్ అధికారంలోకి వచ్చారని, కానీ సరిగ్గా ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేకపోయిందన్నారు. మహాలక్ష్మీ పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడం మినహా కాంగ్రెస్ ప్రజల కోసం ఏం చేసిందో సీఎం చెప్పగలరా అంటూ ఛాలెంజ్ చేశారు.

‘‘కాంగ్రెస్ వాళ్లు ప్రజలకు మభ్యపెట్టి, కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారం వచ్చీ రాగానే ప్రజలను మోసం చేయడం మొదలు పెట్టారు. ఏ పథకం గురించి అడిగినా అదిగో ఇదిగో అంటూ కాకమ్మ కబర్లు చెప్తున్నారు. కరోనా సమయంలో కూడా రైతులకు రైతు బంధు అందించాలని తాపత్రయ పడిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. రూ.10 వద్దు రైతులకు రూ.15 వేలు ఇస్తానన్న రేవంత్ ఇప్పుడు ఏం చేస్తున్నారు. ఒక్కరికైనా ఇచ్చారా. రేవంత్ ఒక రైతు వ్యతిరేకి, యాసంగికైనా రైతుబంధు కావాలంటూ అంతా ఏకతాటిపైకి వచ్చి ఐకమత్యంతో ముందుకు సాగాలి’’ అని పిలుపునిచ్చారు.

ఆరు గ్యారెంటీలేమయ్యాయి..

‘‘ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలను చెవిలో జోరీగలా ప్రచారం చేసిన హామీలు ఇప్పుడు ఏమయ్యాయి. పింఛన్‌లో కూడా దగా చేస్తున్నారు. మన సీఎం పేరు ఎనుముల రేవంత్ కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి. ఆయన తెలంగాణకు చీఫ్ మినిస్టర్ కాదు.. చీటింగ్ మాన్. బోనస్తా ఇస్తా అని ఇప్పుడు బోరున ఏడిపిస్తున్నారు సీఎం. దేవుడి మీద ఒట్టు పెట్టి మరీ స్వార్థ రాజకీయాలు చేసే నాయకుడిని నేను ఇంతవరకు చూడలేదు. రేవంత్ రెడ్డి చేసిన పాపాలకు ప్రజల్ని కాపాడు లని లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్తే నాపై కేసు పెట్టారు. నిరుద్యోగులను దేశ ద్రోహుల్లా చూస్తున్నారు. 2లక్షల ఉద్యోగాలిస్తానని హామీ ఇచ్చారు. అవి ఏమయ్యాయి. గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళన చేస్తున్నా వారి సమస్యను పట్టించుకోరే. జీఓ29ని రద్దు చేయడమే వారి సమస్యకు పరిష్కారం. రాజ్యాంగాన్ని అమలు చేస్తా అన్న రాహుల్ గాంధీ ఇప్పుడు ఏమయ్యారు? ఎన్నికల ముందు తెలంగాణకు క్యూ కట్టిన గాంధీలు ఇప్పుడు ఏమయ్యారు? ఏడా కనిపిస్తలేదు?’’ అంటూ చురకలంటించారు మాజీ మంత్రి.

Read More
Next Story