యాదాద్రికి ఎంఎంటీఎస్ సేవలు పొడిగించి తీరతాం: కిషన్ రెడ్డి
x

యాదాద్రికి ఎంఎంటీఎస్ సేవలు పొడిగించి తీరతాం: కిషన్ రెడ్డి

హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్(MMTS) సేవలను పొడిగించడంపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.


హైదరాబాద్ నుంచి యాదాద్రి(Yadadri) వరకు ఎంఎంటీఎస్(MMTS) సేవలను పొడిగించడంపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి(Kishan Reddy) కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సేవలను పొడిగించి తీరుతామంటూ ఆయన కీలక స్టేట్‌మెంట్ ఇచ్చారు. దక్షిణ మైద్య రైల్వే పరిదిలో 90శాతం రైల్వేలైన్ల విద్యుదీకరణ కేంద్రం పూర్తి చేసిందని వెల్లడించారాయన. రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌తో రాష్ట్ర ఎంపీల సమావేశం అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లను ఆధునీకరించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని, అందులో దక్షిణ మధ్య రైల్వే తన మార్క్ చూపుతోందని కొనియాడారు.

వరంగల్‌లో రూ.650 కోట్లతో రైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దక్షిణ మధ్య రైల్వే బడ్జెట్‌ను కూడా కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఎన్నడూ లేనంతగా పెంచినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఘట్‌కేసర్ వరకు ఎంఎంటీఎస్ సేవలు అందుబాటులో ఉన్నాయని, వీటిని యాదాద్రి వరకు పెంచడమే లక్ష్యంగా తాము చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం పంచుకుంటే మంచిదేనని, అలాకాకుండా రాష్ట్ర ప్రభుత్వం సహకరించబోమని చెప్పినా.. ఎంఎంటీఎస్ సేవలను యాదాద్రి వరకు పొడిగించి తీరుతామని స్పష్టం చేశారు.

రానున్న మరిన్ని వందేభారత్‌ రైళ్లు..

‘‘దక్షిణ మధ్య రైల్వే పరిదిలో 5 వందే భారత్(Vande Bharat) రైళ్లు ఉన్నాయి. రానున్న కాలంలో వీటి సంఖ్యను గణనీయంగా పెంచనున్నాం. రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు చేస్తున్నాం. వచ్చే ఏడాది అంటే 2025 డిసెంబర్ నాటికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పూర్తవుతుంది. అందులో భాగంగానే ఎంఎంటీఎస్ సేవలను కూడా యాదాద్రికి చేరేలా చేస్తాం. అందులో సందేహం అక్కర్లేదు’’ అని ఆయన తేల్చిచెప్పారు. కొన్ని రోజుల క్రితమే యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సేవలను పొడిగింయాలని యోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. అంతేకాకుండా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చేపడుతున్న రైల్వే స్టేషన్ ఆధునికీకరణ గురించి కూడా పలు కీలక విషయాలు వెల్లడించారు.

కిషన్ రెడ్డి ఏం చెప్పారంటే..

‘‘ప్రధాని మోదీ నేతృత్వంలో దేశంలోని రైల్వేస్టేషన్‌లు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను‌ కూడా అనుకున్న దాని కంటే తక్కువ సమయంలోనే నిర్మించాం. చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రాజెక్ట్ కోసం రూ.430 కోట్లు ఖర్చు చేశాం. రైల్వే ట్రాక్ నిర్మాణంతో పాటు సరికొత్త టెక్నాలజీతో అన్ని సదుపాయాలు కల్పించాం. దివ్యాంగులకు, వృద్ధులకు పైఅంతస్తులకు వెళ్లడం కోసం ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు నిర్మించాం. చర్లపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి వెళ్లడం కోసం రోడ్ల కనెక్టివిటీని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలి. భరత్ నగర్, మహాలక్ష్మీ నగర్ వైపు 80 అడుగుల మేర రోడ్లు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రాతిపదిక వీటిని ఏర్పాటు చేయాలి. దీని కోసం తెలంగాణ సర్కార్ మాస్టర్ ప్లాన్‌ను తయారు చేసింది. దానిన వెంటనే అమలు చేయాలి. ఇక్కడి నుంచి పూర్తి స్థాయి రోడ్ల కనెక్టివిటీ ఉంటేనే రైల్వే స్టేషన్‌తో పూర్తి ఉపయోగం ఉంటుంది. లేకుంటే ఎంత సరికొత్త టెక్నాలజీతో నిర్మించినా ఈ రైల్వేస్టేషన్ పూర్తి స్థాయిలో ప్రజలకు సేవలు అందించలేదు’’ అని ఆయన చెప్పుకొచ్చారు.

తెలంగాణకు కవచ్

‘‘తెలంగాణలో రైల్వే ప్రమాదాలను నియంత్రించడం కోసం ఇక్కడ కూడా రైల్వే కవచ్ సాంకేతికతను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాం. ఇందుకు ప్రధాని ప్రత్యేక ధన్యవాదాలు. వందేభారత్ రైళ్లు ఢిల్లీ తర్వాత తెలంగాణలోనే అధిక సంఖ్యలో ఉన్నాయి. అతి త్వరలోనే వందేభారత్ రైళ్లలో కూడా స్లీపర్ కోచ్‌లను అందుబాటులోకి తెస్తాం. తెలంగాణలో అమృత్ పథకం కింద 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను రూ.715కోట్లతో, నాంపల్లి స్టేషన్‌ను రూ.429కోట్లతో, చర్లపల్లి స్టేషన్‌కు రూ.430కోట్లు ఖర్చు చేయనున్నాం. ఈ అభివృద్ధి పనుల కోసం రూ.521 కోట్లతో రైల్ మాన్యుఫ్యాక్చర్ యూనిట్ ప్రారంభించాం’’ అని చెప్పుకొచ్చారు కేంద్రమంత్రి.

Read More
Next Story