
జాలువారుతున్న కుంటాల జలపాతం
తెలంగాణ'మాన్సూన్ మ్యాజిక్'చూడాలనుకుంటున్నారా!
ఇదిగో ఇవే ప్రదేశాలు, వెంటనే బయలుదేరండి...
గాలివానలో...హోరు గాలిలో ...పాలపొంగులా నురుగుతో జాలువారుతూ పరవళ్లు తొక్కుతున్న జలపాతాల జోరుతో (Waterfalls) ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, కోనల మీదుగా జాలువారుతున్న జలపాతాల సోయగాలు, జలసవ్వడి ప్రకృతి ప్రేమికులకు స్వాగతం పలుకుతున్నాయి.
- కొండలు, కోనలు, రాతిగుట్టలపై నుంచి జాలువారుతున్న జలపాతాల అందాలు చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదు. జోరుగా కురుస్తున్న వర్షాలతో జలపాతాలు జాలువారుతూ పరవళ్లు తొక్కుతున్నాయి. జలపాతాల అందాలను చూసి ప్రకృతి ప్రియులు మురిసి పోతున్నారు.
- ఈ వర్షాకాలంలో వారం రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో తెలంగాణ రాష్ట్రంలోని జలపాతాలు (Telangana Monsoon Magic) వరదనీటి పాలధారలతో పొంగి ప్రవహిస్తుండటంతో ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకులు మక్కువ చూపిస్తున్నారు. వర్షాకాలంలో ఆహ్లాదాన్ని అందిస్తున్న జలపాతాలను వీక్షించేందుకు యువతీ యువకులు తరలివస్తున్నారు.

జలపాతాల్లో జలకళ
తెలంగాణ రాష్ట్రంలోని అడవుల్లో కొండలు, కోనల మీదుగా జాలువారుతున్న జలపాతాలు ఈ వర్షాకాలంలో రా రమ్మంటూ పర్యాటకులను పిలుస్తున్నాయి. నల్లమల అడవుల్లోని రాతిగుట్టల మీదుగా ప్రవహిస్తున్న మల్లెల తీర్థం, పాలధార, పంచధార, పాతలింగాల, ఆదిలాబాద్ జిల్లా కుంటాల, పొచ్చెర, గాయత్రి, కనకై, ములుగు జిల్లాలోని బొగత, భీమునిపాదం జలపాతాలు పర్యాటకులను అలరిస్తున్నాయి.తెలంగాణ నయాగరా జలపాతాలుగా (Niagara of Telangana) వీటిని పిలుస్తుంటారు.
అడవితల్లి ఒడిలో...
అడవితల్లి ఒడిలో సహజసిద్ధంగా ఏర్పడిన జలపాతాలను చూసేందుకు పర్యావరణ ప్రేమికులు ఆసక్తి చూపిస్తున్నారు. వారం రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో జోరుగా పారుతున్న జలపాతాలను సందర్శించి ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు పర్యాటకులు వీకెండ్స్ లో వస్తున్నారు. జలపాతాల హోరు శబ్దాలను, ప్రకృతి రమణీయ దృశ్యాలను తనివీ తీరా చూడాలంటే హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లోని 100 నుంచి 300 కిలోమీటరల్ దూరంలో పలు జలపాతాలున్నాయి.

జలపాతాలను సందర్శించండి
జోరుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మీరు విహారయాత్రకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీకు ప్రశాంతతతో ప్రకృతి రమణీయత కలబోసినట్లు ఉన్న జలపాతాలను సందర్శించండి అంటున్నారు టూరిస్టు ప్లానర్లు. స్వచ్ఛమైన పాలధారల్లా జాలువారుతున్న జలపాతాల్లో తడిసి ముద్దయి రిఫ్రెష్ అవ్వాలనుకుంటున్నారా? అయితే హైదరాబాద్ నగరానికి చేరువలోని జలపాతాలను ఈ వర్షాకాలంలో సందర్శించండి అంటున్నారు తెలంగాణ పర్యాటక శాఖ(Telangana travel) అధికారులు.

బొగత జలపాతం
చికుపల్లి జలపాతం అని కూడా పిలిచే బొగత జలపాతం (Bogatha Waterfalls)ములుగు జిల్లాలోని చికుపల్లి గ్రామానికి సమీపంలో ఉంది.అత్యంత అందమైన జలపాతాల్లో ఇది ఒకటి. దట్టమైన చెట్ల మధ్య నుంచి 30 అడుగుల ఎత్తు నుంచి నీరు వస్తుంది. నీటి ప్రవాహాలు కలిసి జలపాతం దిగువన ఒక విశాలమైన కొలను ఏర్పడింది. బొగత ప్రదేశం స్థానికులకు ప్రసిద్ధ పిక్నిక్ స్పాట్.హైదరాబాద్ నుంచి 280 కిలోమీటర్ల దూరంలోని ఉమ్మడి వరంగల్ జిల్లా వాజేడు మండలం బొగత గ్రామ సమీపంలో ఉన్న బోగత జలపాతాన్ని తెలంగాణ నయాగరా జలపాతంగా పిలుస్తుంటారు. ములుగు జిల్లాలో కురుస్తున్న అతి భారీ వర్షాలతో బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. జలపాతం వద్ద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో పర్యాటకుల సందర్శనను నిలిపివేశామని ములుగు జిల్లా ఫారెస్ట్ అధికారులు ప్రకటించారు.పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అటవీ శాఖ ఈ నిర్ణయం తీసుకుందని అధికారిక వర్గాలు తెలిపాయి.
భీముని పాద జలపాతం
చుట్టూ గుట్టలు...ఎత్తైన కొండలపై నుంచి జాలువారుతున్న భీమునిపాదం జలపాతం (Bhimuni Padam Waterfall) పర్యాటకులను రా రమ్మని పిలుస్తోంది.మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం గ్రామ కొమమ్ములవంచ శివారులో ఉన్న భీముని పాదం జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నాడు పాండవులు వనవాసం చేసినపుడు భీముడు కాలు మోపిన ప్రదేశం కావడంతో దీన్ని భీముని పాదం జలపాతంగా పేరు వచ్చినట్లు స్థానికులు చెబుతుంటారు. అత్యంత ప్రసిద్ధ జలపాతాల్లో ఒకటైన భీమునిపాదం జలపాతం 70 అడుగుల ఎత్తు ఉంది. వారాంతపు విహారయాత్ర కోసం చూస్తున్న ప్రకృతి ప్రేమికులకు ఈ జలపాతం మంచి సందర్శనస్థలంగా చెప్పవచ్చు. భీముని పాద జలపాతం వద్ద సూర్యాస్తమయం,సూర్యోదయం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలోని మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం గ్రామంలో ప్రవహిస్తున్న భీమునిపాదం జలపాతం సూర్యోదయ సమయంలో కాంతులీనుతూ అద్భుతంగా కనిపిస్తుంది. దీని సమీపంలో భీముని పాదముద్ర రూపంలో ఒక రాయి ఉంది.జులై నుంచి సెప్టెంబర్ వరకు దీన్ని సందర్శించవచ్చు.
ముత్యంధార జలపాతం
ములుగు జిల్లా వెంకటాపురం మండలం ముత్యంధార జలపాతం దట్టమైన అడవి మధ్యలో ఎతైన గుట్టల పై నుంచి ఆకాశగంగలా నీరు దిగుతున్నట్లుగా ఉంది. వెంకటాపురం మండలంలోని వీరభద్రపురం గ్రామానికి 8 కిలోమీటరల్ అటవీ మార్గంలో 700 అడుగుల ఎత్తు ఉన్న కొండలపై నుంచి నీరు జాలువారుతుంది. ముత్యాల ధారలా నీరు జాలువారుతుండటంతో దీనికి ముత్యాలధార అని పేరు పెట్టారు.

కుంటాల జలపాతం
హైదరాబాద్ సమీపంలోని కుంటాల జలపాతం (Kuntala Falls) అత్యంత ప్రసిద్ధి చెందిన జల వినోద ప్రదేశంగా గుర్తింపు పొందింది.కుంటాల జలపాతం రెండు మెట్ల ద్వారా కిందకు నీరు జాలువారుతుంది.150 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న నీరు కుంటాల గుండంలో పడుతుంది. కుంటాల వద్ద జల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, దీన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించి ఏళ్లు గడుస్తున్నా అవి ఆచరణ రూపం దాల్చలేదు.హైదరాబాద్ నగరానికి 260 కిలోమీటర్ల దూరంలో నాగపూర్ 44 వజాతీయ రహదారికి 12 కిలోమీటర్ల దూరంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుంటాల వద్ద జలపాతం ఉంది.

పొచ్చెర జలపాతం
అటవీ గ్రామాల మధ్య ఉన్న పొచ్చెర జలపాతం 40 అడుగుల ఎత్తు నుంచి నీరు జాలువారుతుంటుంది. నీరు అనేక మెట్ల మీదుగా రాతి గుట్టల గుండా ప్రవహించి చివరికి 40 అడుగుల ఎత్తు నుంచి ఒక పెద్ద కొలనులోకి దిగుతుంది.హైదరాబాద్ నగరానికి 267 కిలోమీటర్ల దూరంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర గ్రామ శివార్లలోని పొచ్చెర జలపాతం ఈ వర్షాకాలంలో జలకళ సంతరించుకుంది. అత్యంత సుందరమైన జలపాతాల్లో ఒకటైన పొచ్చెరను సందర్శించవచ్చు.ఈ జలపాతం తెలంగాణలోనే అత్యంత లోతైనది.ఈ జలపాతాన్ని జులై నుంచి డిసెంబర్ వరకు సందర్శించవచ్చు.
కనకై జలపాతం
కడెం నదిపై ఉన్న కనకై జలపాతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక జలపాతం. కనకదుర్గ అని కూడా పిలిచే ఈ జలపాతం 30 అడుగుల ఎత్తు నుంచి 100 అడుగుల వెడల్పుతో కిందకు నీరు జాలువారుతుంది. బండ్రేవ్ జలపాతం, చీకటి గుండం, కనకై వద్ద మూడు జలపాతాలు ఉన్నాయి. ఈ జలపాతం చుట్టూ పచ్చని చెట్లు, ప్రత్యేకమైన రాతిగుట్టలు ఉన్నాయి. హైదరాబాద్ నగరానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తమ జలపాతం.బజార్‌హత్నూర్ మండలం బాలన్‌పూర్ వద్ద ఉన్న ఈ జలపాతం వద్ద కనక దుర్గ ఆలయం కూడా ఉంది.కుంటాల జలపాతానికి 35 కిలోమీటర్ల దూరంలో నిర్మల్ నుంచి 54 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే కడెం నదిపై కనకై జలపాతం కనిపిస్తుంది. దీనికి కనకదుర్గ జలపాతం అని కూడా పిలుస్తుంటారు. గిర్నూర్ అనే కుగ్రామం చేరువలో ఉన్న ఈ జలపాతం అడవి మధ్యలో ఉంది.

గాయత్రి జలపాతం
ఎటూ చూసినా పచ్చని చెట్లు, గల గల పారుతున్న కడెం నదీ అందాలు, కనివిందు చేస్తున్న రంగురంగుల సీతాకోకచిలుకల మధ్య 100 అడుగుల ఎత్తు నుంచి నీరు జాలువారుతూ గాయత్రీ జలపాతం (Gayatri Falls) అందాలను చూడాలంటే మంకాపూర్ గ్రామానికి వెళ్లాల్సిందే. ఈ జలపాతం సమీపంలో పురాతన మల్లికార్జునస్వామి ఆలయం ఉండటంతో దీనికి గాయత్రీ మాత పేరు పెట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గాయత్రీ జలపాతం పర్యాటకుల పాలిట స్వర్గథామంగా వెలుగొందుతుంది. ఈ జలపాతాన్ని ముక్తి గుండం,గదిధ గుండం అని కూడా పిలుస్తారు.ఈ ప్రశాంతమైన ప్రదేశం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతపై స్థానికులు పలు ఆసక్తికరమైన కథలు చెబుతుంటారు.

మల్లెల తీర్థం జలపాతం
నల్లమల అడవుల్లోని మల్లెల తీర్థం జలపాతం నుంచి జాలువారుతున్న జలాలు కృష్ణా నదిలో కలుస్తుంటాయి. అగ్నిపర్వత శిలల కారణంగా వర్షపు నీరు చొచ్చుకుపోదు.ఈ జలపాతం నీరు సాధారణంగా పర్వతాల నుంచి గుండ్లకమ్మ నదిలోకి ప్రవహిస్తుంది.హైదరాబాద్ నగరానికి 185 కిలోమీటర్ల దూరంలోని నాగర్ కర్నూల్ జిల్లాలో మల్లెల తీర్థం జలపాతం ఉంది. 150 అడుగుల ఎత్తు కొండలు, కోనల నుంచి ఈ జలపాతం జాలువారుతుంటుంది. ఈ జలపాతం ఒక చిన్న శివలింగం ఉంటుంది.
కొత్త జలపాతం
పచ్చని చెట్లతో అలరారుతున్న నల్లమల అడవులు...ఎతైన నల్లటి రాతి గుట్టల మీదుగా పాలధారలా కిందకు జాలువారుతూ బిజినేపల్లి- తిమ్మాజీపేట రోడ్డు సమీపంలోని జలపాతం కనువిందు చేస్తుంది. తాజాగా కురుస్తున్న భారీవర్షాలకు నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం గుమ్మకొండ శివారులో కొత్త జలపాతం పుట్టుకువచ్చింది.
బుగ్గ జలపాతం
నల్గొండ జిల్లాలోని అజిలాపూర్ గ్రామంలో రాతి గుట్టలపై నుంచి నీరు ప్రవహించే ప్రాంతాన్ని బుగ్గ జలపాతం(Bugga Falls) అని పిలుస్తుంటారు. అడవి మధ్యలో ఉన్న ఈ జలపాతం వద్ద నరసింహస్వామి ఆలయం ఉంది. కొండలు, కోనల మీదుగా స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తూ పర్యాటకులను అలరిస్తుంది.

ఎత్తిపోతల జలపాతం
చంద్ర వంక నదిపై ఉన్న ఎత్తిపోతల జలపాతం అద్భుతమైంది. ఈ జలపాతం నలుమూలలా పచ్చదనంతో అలరారుతూ అందమైన అటవీప్రాంతంలో ఉంది.జలపాతానికి దగ్గరగా వెళ్లవచ్చు.ఈ జలపాతం చంద్రవంక వాగు, నక్కల వాగు, తుమ్మల వాగుల ప్రవాహాల కలయిక.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాగార్జునసాగర్ కు చేరవలో ఉన్న పల్నాడు జిల్లాలోని ఎత్తిపోతల జలపాతం జులై నుంచి ఫిబ్రవరి వరకు జలకళతో కనువిందు చేస్తోంది. కృష్ణానదిలో కలిసే మూడు వాగుల సంగమం వద్ద ఏర్పడిన ఎత్తిపోతల జలపాతం హైదరాబాద్ నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. 70 అడుగుల ఎత్తు నుంచి ఈ జలపాతంలో నీరు జాలువారుతుంది.
సహస్త్రకుండ్ జలపాతం
సహస్త్రకుండ్ జలపాతం గోదావరి నది ఉపనది అయిన పెన్‌గంగా నదిపై ప్రవహించే మురళి గ్రామంలో ఉంది. 50 అడుగుల ఎత్తు నుంచి నీరు ప్రవహిస్తుంది. జలపాతం వద్ద నిర్మించిన ర్యాంప్‌పై నిలబడి మీరు జలపాతం అందాల దృశ్యాన్ని చూడవచ్చు. జలపాతం నుండి కొద్ది దూరంలో పెన్ గంగా నదిపై ఒక వంతెన కూడా ఉంది.తెలంగాణ సరిహద్దుల్లోని మహారాష్ట్ర ఇస్లాపూర్ వద్ద ఈ జలపాతం ఉంది. హైదరాబాద్ నుంచి 283 కిలోమీటర్ల దూరంలో ఉన్న సహస్రకుండ్ సందర్శకులను ఆకట్టుకుంటోంది.నిర్మల్ పట్టణానికి 60 కిలోమీటర్ల దూరంలో సహస్ర కుండ్ జలపాతం నీటి కొలనులతో నీరు ఉప్పొంగుతూ కనిపిస్తుంది. పెనుగంగా నదిపై 50 అడుగుల ఎత్తు నుంచి నీళ్లు జాలువారుతూ సందరంగా కనిపిస్తుంటాయి.

గౌరీ గుండాల జలపాతం
పచ్చని చెట్లతో అలరారుతున్న అడవులు...ఎతైన కొండలు...దట్టమైన పొగమంచు మధ్య గౌరీ గుండాల జలపాతం తాజాగా కురుస్తున్న భారీవర్షాలతో పొంగి ప్రవహిస్తోంది. కొండల పైనుంచి పాలధారల్లా జాలువారుతున్న గౌరీ గుండాల జలపాతంలో పర్యాటకులు తడిచి ముద్దవుతున్నారు. జలపాతంలో జలకాలాడుతూ ఫోన్లతో సెల్ఫీలు దిగుతూ యువతీ, యువకులు సందడి చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సబితం గ్రామం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌరిగుండాల జలపాతం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూ.6కోట్లను విడుదల చేసింది. సబ్బితం గ్రామం నుంచి జలపాతానికి మూడు కిలోమీటర్ల రహదారి నిర్మాణం, సీటింగ్, వ్యూయింగ్ పాయింట్లు, రెస్ట్‌రూమ్‌లు నిర్మించనున్నారు.

ప్రమాదాలు పొంచి ఉన్నాయ్... జర జాగ్రత్త
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బొగత, భీమునిపాదం జలపాతాల వద్ద ఇప్పటి వరకు 23 మంది పర్యాటకులు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. కొంగాల సమీపంలోని దుసపాటిలొద్ది జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లిన 8 మంది మరణించారు. పలువురు పర్యాటకులు గాయాల పాలయ్యారు.కుంటాల వద్ద కూడా ప్రమాదాల్లో పలువురు మరణించారు. నిషేధిత జలపాతాలను చూసేందుకు వచ్చి ప్రమాదాల బారిన పడవద్దని అటవీశాఖ అధికారి కారం శ్రీనివాస్ పర్యాటకులకు సూచించారు. జలపాతాల సందర్శనకు మద్యం తాగి రావద్దని, అలా వచ్చి ప్రమాదాల బారిన పడవద్దని అధికారులు సూచించారు. అందుకే జలపాతాల వద్ద మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నారు.
ఈ జలపాతాల సందర్శనలపై నిషేధం
జిల్లాలోని ముత్యంధార, కొంగళ, మామిడిలోద్ది, కృష్ణపురం జలపాతాలను భద్రతా కారణాల దృష్ట్యా అటవీ శాఖ శాశ్వతంగా మూసివేసింది. ఈ ఆదేశాలను ధిక్కరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.బొగత, కుంటాల జలపాతాల సందర్శనను అటవీశాఖ నిలిపివేసింది. ప్రమాదాలు పొంచి ఉన్న జలపాతాల వద్ద పర్యాటకుల సందర్శనను తెలంగాణ అటవీ శాఖ నిషేధించింది.
Next Story