‘హైదరాబాద్ బర్డింగ్ పాల్స్’ విహంగ వినోదం ఇది
x
బర్డ్ వాక్ లో పక్షిప్రియులు క్లిక్ మనిపించిన పక్షులు

‘హైదరాబాద్ బర్డింగ్ పాల్స్’ విహంగ వినోదం ఇది

పక్షి ప్రపంచంలోకి విహారయాత్ర ఎలా చేయాలి?


వీకెండ్ ఆదివారం...అందరికీ సెలవు రోజు...తెల్లవారుతుండగానే హైదరాబాద్ నగరంలోని పక్షిప్రియులంతా ఒక చోట కలుస్తారు...కాళ్లకు షూ ధరించి... బైనాక్యులర్స్, టెలీ ఫొటో, లెన్స్ కెమెరాలను మెడలో వేసుకొని, బర్డ్స్ ఆఫ్ ఇండియా బుక్ వెంట తీసుకొని బర్డ్ వాక్ చేస్తుంటారు.


మీట్ అప్
తేదీ : ఆగస్టు 31, సమయం : తెల్లవారుజామున 5గంటలు...కేఫ్ 21 కోకాపేట మీట్ అప్ ప్రదేశం...అక్కడ నుంచి అందరూ కలిసి వికారాబాద్ జిల్లా మోమిన్ పేట వద్ద ఉన్న యంకతల గ్రాస్ ల్యాండ్స్...నైరుతి రుతుపవనాల సమయంలో వలస వచ్చిన రాప్టార్స్ (Raptors), క్వైలీస్ (Quails),మాల్కోహాస్ (Malkohas), ఫ్రాంకోలిన్స్ (Francolins) ఇతర గ్రాస్ ల్యాండ్ పక్షులు (grassland birds) ను చూసేందుకు ‘హైదరాబాద్ బర్డింగ్ పాల్స్’(Hyderabad Birding Pals) సభ్యులంతా బర్డ్ వాక్ కు తరలివచ్చారు.



బర్డ్ వాక్ సందడి

రంగురంగుల పక్షులు...వివిధ జాతులు...రివ్యుమని ఎగురుతూ , వాటి కిలకిలరావాలతో సందడి చేస్తున్న పక్షులు...హైదరాబాద్ పక్షుల ప్రేమికులు బైనాక్యులర్స్ తో పక్షులను తిలకిస్తూ...నచ్చిన పక్షులను తమ మెడలోని లెన్స్ కెమెరాలతో క్లిక్ మనిపిస్తూ బర్డ్ వాక్ లో ముందుకు సాగారు.ఉదయాన్నే 6 గంటల నుంచి 10 గంటల వరకు సాగిన ఈ బర్డ్ వాక్ లో పలు అరుదైన పక్షిజాతులను ‘హైదరాబాద్ బర్డింగ్ పాల్స్’సభ్యులు తమ కెమెరాల్లో బంధించి వాటిని కార్నిల్ యూనివర్శిటీ విద్యార్థులు రూపొందించిన ఈ బర్డ్స్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారు. పక్షిప్రియులంతా వివిధ వక్షుల గురించి బర్డ్ వాక్ లో (Birds Of Telangana)చర్చించుకున్నారు. ఈ పక్షులను, ప్రకృతి పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి పక్షి ప్రియులంతా చర్చించుకుంటూ ముందుకు సాగారు.వివిధ పక్షిజాతులు, వాటిని చూస్తూ పరవశించిన పక్షుల ప్రేమికులతో బర్డ్ వాక్ సందడిగా మారింది.



‘హైదరాబాద్ బర్డింగ్ పాల్స్’బర్డ్ వాక్స్ రికార్డ్

ఇలా ఒక వీకెండ్ కాదు రెండు వీకెండ్లు కాదు ‘హైదరాబాద్ బర్డింగ్ పాల్స్’(Hyderabad Birding Pals) ఏర్పాటైన తర్వాత పన్నెండేళ్ల కాలంలో ఏకంగా 536 బర్డ్ వాక్స్ చేసి దేశంలోనే రికార్డు సృష్టించింది. వారం వారం వీకెండ్స్ లో బర్డ్ వాక్స్ నిర్వహించడంలో ‘హైదరాబాద్ బర్డింగ్ పాల్’ దేశంలోనే రికార్డు సృష్టించింది. పదకొండేళ్ల క్రితం హైదరాబాద్ నగరంలో పక్షి ప్రేమికులైన హరికృష్ణ ఆడెపు (అద్యక్షులు), రాజీవ్ ఖండేల్ వాల్ (కార్యదర్శి), నరేష్ వాడ్రేవు , ఫణికృష్ణ రావి కలిసి 2014, ఫిబ్రవరి 24వతేదీన హైదరాబాద్ నగర శివార్లలోని అమీన్ పూర్ చెరువు వద్ద బర్డ్ వాక్ కు శ్రీకారం చుట్టారు. అలా నలుగురు పక్షిప్రేమికులతో ప్రారంభమైన ‘హైదరాబాద్ బర్డింగ్ పాల్స్’నేడు పదివేల మందికి పైగా పక్షిప్రేమికులు సభ్యులుగా విస్తరించింది. బర్డ్ వాక్ లో పాల్గోనే పక్షిప్రియులకు ఉచితమని కార్యదర్శి రాజీవ్ ఖండేల్ వాల్ చెప్పారు.ఎలాంటి లాభాపేక్ష లేకుండా బర్డ్ వాక్ లు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.



హైదరాబాద్ నగరంతోపాటు నగర శివారు ప్రాంతాలే కాదు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బర్డింగ్ పాల్ సభ్యులు బర్డ్ వాక్స్ (Bird watching) నిర్వహించారు.పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారేడుమిల్లి అడవుల్లోనూ హైదరాబాద్ పక్షి ప్రేమికులు(Nature Lovers) బర్డ్ వాక్ చేశారు.




పక్షులు ఎన్ని జాతులున్నాయంటే...

ప్రపంచంలో 13వేలకు పైగా పక్షి జాతులున్నాయి. ఇందులో 1300 జాతుల పక్షులు మన భారతదేశంలో కనిపిస్తుంటాయని పక్షి ప్రియులు చెప్పారు. ఇందులో హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణలో తాము 542 జాతుల పక్షులు ఉన్నట్లు తాము జరిపిన బర్డ్ వాక్స్ లో తమ సభ్యులు గుర్తించి వాటిని రికార్డు చేశామని హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ సభ్యులు చెప్పారు. దేశంలో ఏ సొసైటీ కూడా 500కు పైగా బర్డ్ వాక్స్ చేయలేదని, తాము 11ఏళ్లలోనే వారం వారం బర్డ్ వాక్స్ చేస్తూ ఈ రికార్డు సాధించామని ‘హైదరాబాద్ బర్డింగ్ పాల్స్’ నిర్వాహక ప్రతినిధి నరేష్ వాడ్రేవు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



బర్డ్ వాక్ ఏఏ ప్రాంతాల్లో చేశారంటే...

హైదరాబాద్ నగరంతోపాటు నగర శివార్లలోని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలు, అమీన్ పూర్ చెరువు, ఫాక్స్ సాగర్, బొటానికల్ గార్డెన్, నల్లమల అడవులు, వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్, బెజ్జూరు కీకారణ్యం, ఖమ్మం జిల్లాలోని కిన్నెరసాని, వరంగల్ జిల్లాలోని పెద్ద చెరువు, ఇలా ఒకటేమిటి? పలు చెరువులు, సరస్సుల వద్ద బర్డ్ వాక్స్ చేసి రంగురంగుల వివిధ జాతుల పక్షులను పక్షి ప్రేమికులు గుర్తించారు.బర్డ్ వాక్స్ చేసే పక్షిప్రేమికుల్లో యువతతోపాటు మహిళలు కూడా పాల్గొంటున్నారు. ప్రతీ ఏటా శీతాకాలంలో వచ్చే విదేశీ పక్షులు సందడి చేస్తుంటాయి.



బర్డ్ వాక్ హాబీ

హైదరాబాద్ నగరంలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా బర్డ్ వాక్ హాబీ విస్తరిస్తోంది. వీకెండ్ ఆదివారాల్లో రంగురంగుల పక్షులను చూస్తూ, వాటి కిలకిల రావాలను వింటూ ప్రకృతి ఒడిలో వాకింగ్ చేయడం వల్ల మనసుకు శాంతి లభిస్తుందంటారు పక్షిప్రేమికులు. బర్డ్ వాచింగ్ చేసే వారి సంఖ్య వారం వారం పెరుగుతుందని, యువతరం బర్డ్ వాక్ కు తరలివస్తున్నారని ‘హైదరాబాద్ బర్డింగ్ పాల్స్’ సభ్యులు చెప్పారు. రివ్వున ఎగురుతున్న పక్షులను చూస్తే చాలు ఒత్తిడి దూరమై హ్యాపీగా జీవితాన్ని గడపవచ్చంటారు పక్షిప్రియులు. ఫొటోగ్రఫీని నేర్చుకునేందుకు కూడా యువత బర్డ్ వాక్ కు తరలివస్తున్నారని చెప్పారు ‘హైదరాబాద్ బర్డింగ్ పాల్స్’ నిర్వాహకుడు, కీలక సభ్యుడు నరేష్ వాడ్రేవు.



బర్డ్స్ ఆఫ్ తెలంగాణ పాకెట్ గైడ్‌

‘హైదరాబాద్ బర్డింగ్ పాల్స్’ సభ్యులు జరిపిన బర్డ్ వాక్స్ లో తీసిన చిత్రాలతో బర్డ్స్ ఆఫ్ తెలంగాణ పాకెట్ గైడ్ (Birds Pocket Guide)ను ప్రచురించారు. భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించేందుకు వీలుగా రంగురంగుల వివిధ జాతుల పక్షుల కలర్ ఫొటోలతో రూపొందించిన బర్డ్స్ గైడ్ అందరినీ ఆకట్టుకుంటోంది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ పక్షుల గైడ్ ను ఆవిష్కరించారు.



సేవ్ నల్లమల పేరిట ప్రచారోద్యమం

నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం మైనింగ్ ను నిలిపివేద్దాం...నల్లమల అడవులను పరిరక్షించుకుందాం అంటూ ‘హైదరాబాద్ బర్డింగ్ పాల్స్’ సభ్యులు ప్రచారోద్యమం చేపట్టారు. మైనింగ్ తో నల్లమల ప్రకృతిని నాశనం చేయవద్దని ఈ సభ్యులు కోరుతూ ఉద్యమం కూడా చేపట్టారు.



అంతరించి పోతున్న పక్షిజాతులు

హైదరాబాద్ నగర శివార్లలోని పలు చెరువులు, సరస్సుల వద్ద విదేశాల నుంచి వలస వచ్చిన ఫ్లెమింగోలు సందడి చేసేవి. చెరువుల్లో కాలుష్యం, పొలాలు కనుమరుగై రియల్ ఎస్టేట్ అభివృద్ధితో కాంక్రీట్ జంగిల్ గా మారడంతో ఫ్లెమింగోల సంఖ్య నానాటికి తగ్గిపోతుందని ‘హైదరాబాద్ బర్డింగ్ పాల్స్’ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు హరికృష్ణ ఆడెపు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. గతంలో అమీన్ పూర్ చెరువు వద్ద కనిపించే ఫ్లెమింగోలు నేడు కాలుష్యం కాటుకు కనుమరుగయ్యాయని ఆయన తెలిపారు. గతంలో ఎక్కడ పడితే అక్కడ కనిపించే పాలపిట్టలు కూడా కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. నాడు ఇళ్లలో గూళ్లు పెట్టుకొని నివాసం ఉండే ఊర పిచ్చుకలు నేడు గూడు కరవై తగ్గిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇళ్లలో బియ్యం చెరగడంతో ఆ నూకలను తిని జీవనం సాగించే పిచ్చుకలకు ఆహారంతోపాటు గూడు లేక వీటి సంతతి తగ్గుతుందని హరికృష్ణ చెప్పారు.



విద్యార్థులకు పక్షులపై పాఠాలు

హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ సభ్యులు తరచూ పాఠశాలలకు వెళ్లి బర్డ్స్ ఆఫ్ తెలంగాణ పాకెట్ గైడ్ లు అందించి పక్షుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. పక్షుల పరిరక్షణతోనే పర్యావరణాన్ని కాపాడు కోవచ్చని పక్షిప్రియులు చెబుతుంటారు. పక్షులకు హాని తలపెట్టవద్దని విద్యార్థులకు చెబుుతున్నారు. పాఠశాలల్లో పక్షుల చిత్రాలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్లు పెట్టి వీటిపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని ‘హైదరాబాద్ బర్డింగ్ పాల్స్’ వ్యవస్థాపక సభ్యుడు, కార్యదర్శి రాజీవ్ ఖండేల్ వాల్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



చెరువులను శుభ్రం చేసి...మొక్కలు నాటుతూ...

బర్డ్ వాక్ కోసం వచ్చిన హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ సభ్యులు హైదరాబాద్ నగరంతోపాటు నగర శివార్లలోని చెరువుల్లో చెత్తాచెదారాన్ని తొలగించి చెరువు ఒడ్డున మొక్కలు నాటుతూ పర్యవరణాన్ని పరిరక్షిస్తున్నారు. బర్డ్ వాక్ చేయడమే కాదు పక్షుల పరిరక్షణకు చెరువులను కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి తాము చెరువులను శుభ్రం చేస్తున్నామని ‘హైదరాబాద్ బర్డింగ్ పాల్స్’ నిర్వాహకుడైన కీలక ప్రతినిధి ఫణి కృష్ణ రావి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



ఈ బర్డ్స్ లో పక్షుల చిత్రాల అప్ లోడింగ్

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ జాతుల పక్షుల గురించి అమెరికాలోని కార్నిల్ యూనివర్శిటీ విద్యార్థులు పరిశోధనలు చేస్తున్నారు. దీని కోసం వారు ఈ బర్డ్స్ పేరిట ప్రారంభించిన వెబ్ సైట్, యాప్ లో తాము బర్డ్ వాక్ లలో తీసిన తెలంగాణ పక్షుల చిత్రాలను అప్ లోడింగ్ చేస్తున్నామని హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ వ్యవస్థాపకుడు, ప్రెసిడెంట్ హరికృష్ణ ఆడెపు చెప్పారు. తమ బర్డింగ్ పాల్స్ సభ్యులు సిటిజన్ సైంటిస్టుల్లా పక్షుల చిత్రాలను తీసి వాటిని పరిశోధనల కోసం అందిస్తున్నామన్నారు.



బయోడైవర్శిటీ లేక్

తెలంగాణ రాష్ట్రంలోని అమీన్ పూర్ చెరువును మొట్టమొదటిసారి బయోడైవర్శిటీ లేక్ గా (Telangana Biodiversity) గుర్తించారు. వివిధ రకాల జాతుల పక్షులు, వాటి కిలకిలరావాలు, చుట్టూ చెట్లు, నీటిలో కళకళలాడుతున్న చెరువును బయోడైవర్శిటీ బోర్డు బయోడైవర్శిటీ చెరువుగా ప్రకటించింది.



బిగ్ బర్డ్ డేలో అవార్డులు

దేశవ్యాప్తంగా ప్రతీ ఏటా ఫిబ్రవరి నెలలో ఆదివారాల్లో ఢిల్లీ పక్షిప్రియులు బిగ్ బర్డ్ డేలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బిగ్ బర్డ్ డే సందర్భంగా బర్డ్ వాక్ చేస్తూ అత్యధికంగా వివిధ జాతులను పక్షులను గుర్తిస్తుంటారు. ఈ బిగ్ బర్డ్ డేలలో ‘హైదరాబాద్ బర్డింగ్ పాల్స్’సభ్యులు పాల్గొని అవార్డు సాధించారు. 2016వ సంవత్సరం నుంచి బిగ్ బర్డ్ డేలలో పాల్గొంటూ 2018, 2019 సంవత్సరాల్లో హైదరాబాద్ పక్షి ప్రియులు ఏకంగా అత్యధికంగా 270 పక్షి జాతులను క్లిక్ మనిపించి అవార్డు పొందారు.



పక్షుల పరిరక్షణే మా ఆశయం

తెలంగాణకు విదేశాల నుంచి ప్రతీ సీజనులో వలస వస్తున్న పక్షులతో పాటు స్థానిక పక్షిజాతులను పరిరక్షించుకోవడమే పరమావధిగా తమ ‘హైదరాబాద్ బర్డింగ్ పాల్స్’ పనిచేస్తుందని చెబుతారు హరికృష్ణ ఆడెపు. హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ సభ్యులంతా కలిసి కొత్త కొత్త ప్రాంతాల్లో బర్డ్ వాక్ చేయడంతోపాటు పక్షులు,(Save Our Birds) ప్రకృతిని పరిరక్షించడానికి తాము అంకితభావంతో పనిచేస్తామని ‘హైదరాబాద్ బర్డింగ్ పాల్స్’ సభ్యులైన పక్షిప్రియులు ముక్తకంఠంతో చెప్పారు.




మీరూ బర్డ్ వాక్ లో పాల్లొనాలనుకుంటున్నారా ? అయితే సోషల్ మీడియాలో మమ్మల్ని సంప్రదించండి అంటున్నారు ‘హైదరాబాద్ బర్డింగ్ పాల్స్’ నిర్వాహకులు.

ఫేస్ బుక్ : https://www.facebook.com/groups/HyderabadBirdingPals

ఎక్స్ : https://x.com/hydbirdingpals

ఇన్‌స్టాగ్రామ్ : https://www.instagram.com/hyderabadbirdingpals


Read More
Next Story