జగిత్యాలలో పోస్టర్ కలకలం.. ఒక్కొక్కరిని చంపుతామంటూ..
x

జగిత్యాలలో పోస్టర్ కలకలం.. ఒక్కొక్కరిని చంపుతామంటూ..

జగిత్యాలలో ఓ పోస్టర్ కలకలం సృష్టిస్తోంది. మంత్రగాళ్లకు హెచ్చరికగా కట్టిన ఈ వాల్ పోస్టర్‌పై ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.


జగిత్యాలలో ఓ పోస్టర్ కలకలం సృష్టిస్తోంది. మంత్రగాళ్లకు హెచ్చరికగా కట్టిన ఈ వాల్ పోస్టర్‌పై ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. దీనిపై మంత్రగాళ్లందరినీ చంపేస్తామంటూ హెచ్చరిక ఉండటమే ఈ టెన్షన్‌కు కారణం. దీనిని ప్రజల మంచి కోరే సంస్థ పేరిట ప్రచురించడం జరిగింది. దీంతో దీనికి బాధ్యులెవరో తెలుసుకోవడం ఛాలెంజ్‌లా మారింది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంటలో ఈ పోస్టర్‌లు వెలిశాయి. అన్ని వాడల్లో ఈ పోస్టర్లే దర్శనమిస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. స్థానికులు భయాందోళనలకు గురవుతున్న క్రమంలో పోస్టర్లన్నింటిని పోలీసులు తొలగించారు. అంతేకాకుండ దీనికి బాధ్యులను అతి త్వరలోనే పట్టుకుంటామని ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా తమకు సమాచారం అందించాలని, ఈ పోస్టర్లను చూసి ఎవరూ భయబ్రాంతులకు గురికావాల్సిన అసరం లేదని పోలీసులు తెలిపారు. ఇప్పటికే రెండు బృందాలుగా ఏర్పడి ఈ పోస్టర్లు వెనక ఉన్న వారు ఎవరో తెలుసుకోవడం కోసం దర్యాప్తు ప్రారంభించినట్లుగా కూడా పోలీసు వర్గాలు చెప్తున్నాయి.

ఇంతకీ పోస్టర్లలో ఏముందంటే..

‘గ్రామ మంగ్రగాళ్లు తస్మాత్ జాగ్రత్త.. మా సంస్థకు అందిన అనేక ఫిర్యాదుల ఆధారంగా గ్రామంలో ఉన్న ప్రతి మంత్రగాడిని ఒక్కరిగా చంపబోతున్నాం. ఈ పనిని గచ్చు నూతి దగ్గర ఉన్న ఇద్దరి మంత్రగాళ్లతో మొదలు పెడతాం. ఆ తర్వాత గుండ్ల వాడ కట్టు, గోలొల వాడ కట్టు, గౌండ్లోల్లు, పాల కేంద్ర చుట్టుపక్కల, మాల మాదిగల వాడ కట్టులో ఉన్న మంద్రగాళ్లందరినీ హతమారుస్తాం. ఎవరు ఎప్పుడు ఎలా చస్తారో మాకే తెలియదు. గ్రామ ప్రజలకు మనవి.. ఇన్నాళ్లూ మంత్రగాళ్ల ఆగడాలను ఎలా చూస్తూ ఉన్నారో.. ఇప్పుడు కూడా అంతే ఉండండి. కాదు కూడదని మంత్రగాళ్లకు మద్దతు ఇచ్చారు మీకు కూడా ప్రాణాపాయం ఉండొచ్చు. ఈ మంత్రగాళ్ల వల్ల అనేక మంది అనేక బాధలు పడుతున్నారు.. ఇట్లు ప్రజల మంచి కోరే సంస్థ’’ అని పోస్టర్‌పై రాసి ఉంది.

ఇదిలా ఉంటే రెండున్నరేళ్ల క్రితం కూడా జగిత్యాల జిల్లాలో ఎనిమిది మంది మంత్రగాళ్లను హెచ్చరిస్తూ ఇటువంటి పోస్టర్లే వెలిశాయి. ఇటువంటి ఘటనే ఇప్పుడు కూడా జరగడం పోలీసులకు ఛాలెంజ్‌గా మారింది. దానికి తోడుగా ఇటీవల కొంతకాలంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో క్షుద్రపూజలు, మంత్రగాల్ల హత్యల ఘటనలు అధికం అవుతున్న క్రమంలో ఈ పోస్టర్లు కీలకంగా మారాయి. వీటి వెనక ఎవరు ఉన్నారు? అనేది తెలుసుకోవడం కోసం పోలీసులు తలమున్కలవుతున్నారు.

Read More
Next Story