ఉసూరుమనిపించిన ఉక్కు మంత్రులు!
x

స్టీల్ ప్లాంట్కు వస్తున్న ఉక్కు మంత్రులు కుమారస్వామి, శ్రీనివాసవర్మ 

ఉసూరుమనిపించిన ఉక్కు మంత్రులు!

ప్రత్యేక ప్యాకేజీ అప్పులు, జీఎస్టీ, వీఆర్ఎస్లకే సరి. జీతాలకు పైసా కూడా ఇవ్వబోమని స్పష్టీకరణ. తీవ్ర నిరాశలో వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కార్మికులు.

కేంద్ర ఉక్కు శాఖ మంత్రులు వస్తున్నారు.. తమ జీతాల కష్టాలు గట్టెక్కిస్తారని విశాఖ ఉక్కు కార్మికులు గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ ఆ మంత్రులు వారి ఆశలపై నీళ్లు చల్లారు. పైగా మరో మూడు నెలల పాటు జీతాలు ఇవ్వబోమని కుండబద్దలు కొట్టారు. అంతవరకు ఉక్కు కర్మాగారం కోసం త్యాగరాజులు కావాలని కూడా కార్మికులకు పిలుపునిచ్చారు. దీంతో వైజాగ్ స్టీల్ కార్మికులు ఉక్కు ద్రవంలా కుతకుతలాడుతున్నారు. విశాఖ ఉక్కు చరిత్రలో కార్మికులు ఎన్నడూ లేనంతగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.

నాలుగేళ్ల క్రితం ప్రైవేటీకరణ ప్రకటన వెలువడినప్పట్నుంచి వీరు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఒకపక్క అప్పులు పేరుకుపోవడం, ముడి సరకు కొనుగోలు చేసే స్థోమతు లేక ఉత్పత్తి తగ్గిపోవడం వంటివి ఈ ఫ్యాక్టరీ నష్టాల్లో కూరుకుపోయింది. మరోపక్క కార్మికులను తగ్గించుకుంటూ పోవడం, వీఆర్ఎస్కు వీలు కల్పించడం, ఉన్న వారిలో కొందరిని ఇతర ప్లాంట్లకు డిప్యుటేషన్పై పంపడం, కొత్తగా నియామకాలు జరపకపోవడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ప్లాంట్ను ప్రైవేటీకరించాలన్న నిర్ణయంపై ఇన్నాళ్లూ తగ్గేదే లే! అన్నట్టు మొండిగా వ్యవహరిస్తోంది.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలన్న నిర్ణయానికి నిరసనగా ఉక్కు కార్మికులు నాలుగేళ్లుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో యాజమాన్యం వీరికి సెప్టెంబర్ నుంచి జీతాలు కూడా చెల్లించడం మానేసింది. అప్పుడప్పుడు అరకొరగా కొద్దిపాటి వేతనాలు చెల్లిస్తున్నా డిసెంబర్ నుంచి పూర్తిగా చేతులెత్తేసింది. ఈ ప్లాంట్ కార్మికులకు నెలకు రూ.85 కోట్ల వరకు నికర జీతాలను (ఇతర చెల్లింపులు మినహా) చెల్లించాల్సి ఉంటుంది. గడచిన ఐదు నెలలుగా వీరికి రూ.250 కోట్లకు పైగా జీతాల బకాయి పడింది. ఇలా ప్లాంట్ పరిస్థితి రానురాను తీసికట్టుగా తయారైంది.

ప్రైవేటీకరణ వద్దంటూ నినాదాలు చేస్తున్న కార్మికులు

ప్రైవేటీకరణ వద్దంటూ నినాదాలు చేస్తున్న కార్మికులు

ప్యాకేజీ ప్రకటన ఊరటనిచ్చినా..

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈనెల మొదటి వారంలో విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ.11,440 కోట్ల పునరుజ్జీవ ప్యాకేజీని ప్రకటించింది. ఎప్పట్నుంచో జీతాల కోసం అలమటిస్తూ ఆవురావురుమంటున్న కార్మికులు.. ఈ ప్యాకేజీ సొమ్ముతో ఇక తమ జీతాల కష్టాలు తీరతాయని సంబరపడ్డారు. గురువారం విశాఖ స్టీల్ ప్లాంట్కు వచ్చిన ఉక్కు మంత్రులు కుమారస్వామి, శ్రీనివాసవర్మలు చల్లని కబురు చెబుతారని ఆశగా చూశారు. కానీ ఈ ప్యాకేజీలో ఒక్క పైసా కూడా జీతాల బకాయిల కోసం చెల్లించబోమని వారు కుండబద్దలు కొట్టారు.

అంతేకాదు.. మరో మూడు నెలల పాటు చెల్లించే పరిస్థితి లేదని, అప్పటివరకు కార్మికులు త్యాగరాజులు కావాలని కూడా హితవు పలికారు. ఇప్పటికే నాలుగు నెలలుగా జీతాల్లేకుండా అప్పులు పాలవుతున్న తమకు మరో మూడు నెలలు ఎలా కుటుంబాలను పోషించాలంటూ వీరు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 'నాలుగు నెలలుగా జీతాల్లేక అవస్థలు పడుతున్నాం. ప్యాకేజీ ఇచ్చినట్టు ప్రకటించగానే కనీసం జీతాల బకాయిలైనా తీరతాయని ఊరట చెందాం. కానీ ఇప్పుడు ప్యాకేజీ సొమ్ము జీతాలకు చెల్లించడానికి వీల్లేదని తెలిసి ఉసూరుమంటున్నాం' అని రామచంద్రరావు అనే కార్మికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంకెన్నాళ్లు అప్పులు చేయాలోనని నిట్టూర్చాడు.

ప్యాకేజీ సొమ్ము దేనికి వెచ్చిస్తారు?

ఈ స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రకటించిన రూ.11,440 కోట్ల సొమ్మును బాకీలు, బ్యాంకు అప్పులు, జీఎస్టీ బకాయిలు, వీఆర్ఎస్ తీసుకున్న కార్మికులకు ఇవ్వాల్సిన మొత్తాలకు వెచ్చించాలని కేంద్ర మంత్రులు స్పష్టం చేశారు. ఇలా విశాఖ స్టీల్ ప్లాంట్ టాటా ఇంటర్నేషనల్ స్టీల్కు రూ.1,500 కోట్లు, జెఎస్ఈ బ్ల్యూకి రూ.1,400 కోట్లు. ఎన్ఎండీసీ రా మెటీరియల్ బకాయి రూ.3,400 కోట్లు, జీఎస్టీ బకాయిలు రూ.500 కోట్లు, బ్యాంకులకు రూ.160 కోట్లు మిగిలిన సొమ్ములో వడ్డీలు, వీఆర్ఎస్ తీసుకున్న వారికి చెల్లించాలని ఉక్కు మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్టు తేల్చారు.

దీంతో ఈ ప్యాకేజీ మొత్తంలో 90 శాతం వీటికే వెచ్చించనున్నట్టు తేటతెల్లమైంది. అందువల్ల ఈ సొమ్ములో కార్మికుల జీతాల బకాయిలే కాదు.. రా మెటీరియల్ (ముడి సరకు) కొనుగోలుకు కూడా వినియోగించే పరిస్థితి లేదు. 'ప్యాకేజీ సొమ్ము బ్యాంకుల అప్పులు, వడ్డీలు, ఇతరుల బాకీలు, వీఆర్ఎస్ చెల్లింపులకే వెచ్చిస్తే.. ముడిసరకు కొనుగోలుకు మళ్లీ ఇబ్బందులు తప్పవు. కార్మికుల బకాయిలు తీర్చకుండా, మరో మూడు నెలలు త్యాగాలకు సిద్ధం కావాలని చెప్పడం దుర్మార్గం' అని విశాఖ స్టీల్ ప్లాంట్ జనశక్తి మజ్జూర్ సభ ప్రధాన కార్యదర్శి వరసాల శ్రీనివాసరావు 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు.

Read More
Next Story