
'అందెశ్రీ మరణం తెలుగు సమాజానికి తీవ్రమైన లోటు'
విజయవాడ ‘జనచైతన్య వేదిక’ నివాళి
తెలుగు ప్రజల హృదయాలల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రముఖ అభ్యుదయ కవి అందెశ్రీ మరణం తెలుగు సమాజానికి తీవ్రమైన లోటు అని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీతలు, డా. పాపినేని శివశంకర్, పెనుగొండ లక్ష్మీనారాయణ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ తెలుగు ఆచార్యులు జి. కృపాచారి, విజ్ఞాన్స్ నిరులా మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. రాధిక, జనచైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. ధనుంజయ రెడ్డి జాషువా కల్చరల్ సెంటర్ వ్యవస్థాపకులు, ప్రజా గాయకులు పివి రమణ నివాళులు అర్పించారు.
ఈనెల 10వ తేదీన గుంటూరులోని విజ్ఞాన్స్ నిరులా మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన అందెశ్రీ సంతాప సభలో వారు ప్రసంగించి నివాళులు అర్పించారు. అందెశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని, మాయమైపోతున్నాడమ్మా అనే గీతంతో ప్రజలను ఆలోచింప చేశారని, జయ జయహే తెలంగాణ అనే గీతాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించిందని వివరించారు.
అందెశ్రీ 2006లో నంది పురస్కారం, 2014లో గౌరవ డాక్టరేట్, 2015లో దాశరధి సాహితీ పురస్కారం, రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరధి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్ నాయక్ పురస్కారాలను అందుకున్న మహనీయుడని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి పేర్కొంటూ అందెశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం గతంలోనే అందెశ్రీ కి కోటి రూపాయల నగదు పురస్కారంతో సత్కరించిందని, నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతించారు.

