శివసన్నిధికి చేరాలంటే ‘సిడితలే’ మార్గం
x

శివసన్నిధికి చేరాలంటే ‘సిడితలే’ మార్గం

శివుడికి తమ తలను నరుక్కుని ప్రాణార్పణం లేదా ఆత్మాహుతి చేసుకునే వాళ్ళని అప్పట్లో ‘సిడితల వీరగల్లులు’ అనేవారు.


వీరగల్లులు-సిడితల వీరగల్లు...ఈ పదాలు వినటానికి కొత్తగా, విచిత్రంగా ఉన్నాయా ? ఇప్పటి జనాలకు ఈ పదాలు కొత్తేకాని ఒకపుడు అంటే సుమారు 6-7 శతాబ్దాల్లో చోళులు, రాష్ట్రకూటుల పాలనలో శైవమతానికి సంబందించిన జనాల్లో మాత్రం చాలా ప్రాచుర్యంలో ఉండేది. బొందితో కైలాసం చేరుకోవాలని అనుకునే వారు, శివసన్నిధికి అర్జంటుగా చేరాలని అనుకునే వీర శైవభక్తులు అనుసరించే మార్గమే సిడితల ప్రక్రియ. సిడితలలో సిడి అనేపదం కన్నడ నుండి వచ్చింది. సిడి అంటే వెదురు గడకర్ర, తలంటే తలే. గడకర్రకు తలను బిగించి కట్టడాన్నే సిడితల అటారు. అలాగే గడకర్రకు తలజుట్టును గట్టిగా బిగించి కట్టి కత్తితో మెడను నరుక్కుంటారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని శిల్పంగా చెక్కటాన్ని వీరగల్లు అనంటారు. కన్నడంలో గల్లు అంటే రాయి. వీరుని ఆత్మార్పణ ప్రక్రియను రాయి లేదా శిలమీద చెక్కడాన్నే వీరగల్లు అనంటారు. ఆత్మార్పణ చేసుకునే శివభక్తులు(వీరులను) ఏమని అంటారనే విషయాన్ని తెలుసుకునేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి.

యుద్ధాలు తప్పదని తేలినపుడు రెండువైపుల సైన్యాల్లోని సైనికులు విజయమో, వీరస్వర్గమో అని యుద్ధభూమిలోకి దిగుతారు. చనిపోవటం ఖాయమని తెలిసినా చావుకు తెగించి యుద్ధభూమిలోకి ఎందుకు దిగుతారు. ఎందుకంటే స్వామిభక్తి. స్వామిభక్తికి మించిన పుణ్య కార్యంలేదన్నది అప్పటి ఆచారం. అలాగే స్వామిభక్తి కోసం ప్రాణాలు అర్పిస్తే నేరుగా స్వర్గానికి చేరుతారనే నమ్మకం బలంగా ఉండేది. అందుకనే యుద్ధాల్లో విజయమో...వీరస్వర్గమో అనే నినాదాలు చేసేవారు. అలాగే ఏదైనా సందర్భంలో ఆరోపణలకు గురై నిందను ఎదుర్కోవాల్సొచ్చినపుడు, తన నిజాయితిని నిరూపించుకునే అవకాశంలేదని తేలిపోయినపుడు కూడా కొందరు ఆత్మార్పణ చేసుకోవటం తెలిసిందే.




అయితే పై ఘటనలకు భిన్నమైనది వీరగల్లులు అనుసరించిన సిడితల ప్రక్రియ. ఇక్కడేమిటంటే యుద్ధాలుండవు, నిజాయితీకి పరీక్షలూ ఉండవు అచ్చంగా ఆత్మర్పణ చేసుకుని కైలాసంలో కొలువుండే శివుడి సన్నిధికి చేరుకోవాలన్న బలమైన కోరిక ఒకటే కనబడుతుంది. సిడితల అంటే ఏమిటంటే తమ తలను తామే నరుక్కోవటం లేదా ఎవరితో అయినా నరికించుకోవటం. వీరగల్లులు అంటే పై ప్రక్రియలో తమ ప్రాణాలను తమంతట తాముగా కైలసవాసుడికి అర్పించుకునే వాళ్ళని అర్ధం. అందుకనే శివుడికి తమ తలను నరుక్కుని ప్రాణార్పణం లేదా ఆత్మాహుతి చేసుకునే వాళ్ళని అప్పట్లో ‘సిడితల వీరగల్లులు’ అనేవారు.




6-7 శతబ్దాల్లో చోళులు, రాష్ట్రకూటుల పరిపాలనా కాలంలో స్త్రీలతో పాటు చాలామంది పురుషులు పొడవాటి జుట్టును కలిగుండేవారు. భక్తిలో చివరి దశ ఏమిటంటే తమ ప్రాణాలను అర్పించుకుని శివుని సన్నిధికి చేరుకోవటమే. తమప్రాణాలను ఎలా అర్పించుకుంటారంటే తమ పొడవాటి జుట్టును చివరలో ముడివేసేవారు. ఆ ముడిని పక్కనే నాటి వంచిన ఒక వెదురు కర్ర చివరకి గట్టిగా కట్టేవారు. తమ జుట్టుముడిని వెదురు కర్రకు గట్టిగా కట్టి వదిలేయగానే అప్పటివరకు వంగి ఉన్న వెదురు కర్ర ఒక్కసారిగా పైకి లేస్తుంది. దాంతో కర్రతో పాటు జుట్టుముడి కూడా గట్టిగా తలను పైకి లేపుతుంది. అప్పుడు వీరగల్లు ఏమి చేస్తాడంటే ఒక పదునైన కత్తితో తన మెడను తానే కోసేసుకుంటాడు. తన మెడను తానే నరుక్కోవటం సాధ్యంకాదని అనుకున్నపుడు పక్కన ఒక సహాయకుడిని పెట్టుకుని కత్తితో మెడను నరికించుకుంటాడు. పురుషులే కాదు స్త్రీలు కూడా ఈ ప్రక్రియలో ఆత్మార్పణం చేసుకునే వారు.



తన మెడను తాను నరుక్కోవటం ఎంత పుణ్యకార్యంగా వీరగల్లులు భావిస్తారో వీరగల్లుల మెడను నరకటం లేదా నరకటంలో సాయంచేయటాన్ని కూడా సహాయకులు అంతే పుణ్య కార్యంగా భావించేవారు. కాబట్టి అప్పటికాలంలో సిడితల వీరగల్లు కార్యం అంటే ఎంతో పుణ్యకార్యం కింద భావించేవారు అందరు. ఇప్పటివరకు గ్రంధస్ధంగా మాత్రమే ఉన్న సిడితల వీరగల్లు ప్రక్రియకు సంబంధించిన కొన్ని ఆధారాలు దొరికాయి. ‘కొత్త తెలంగాణా చరిత్ర పరిశోధక బృందం’ చేస్తున్న చారిత్రక పరిశోధనల్లో ఇలాంటి సిడితల వీరగల్లుల ఆనవాళ్ళు దొరికాయి. సిద్ధిపేట జిల్లాలోని రాయపోల్ ప్రాంతంలో గణపతి దేవాలయం దగ్గర వీరగల్లు ప్రక్రయను తెలిపే విరిగిపోయిన శిలలు దొరికాయి. వీటిని పరిశోధక బృందం క్షుణ్ణంగా పరిశోధించినపుడు ఆ శిల్పాలు చోళులు, రాష్ట్రకూటల పరిపాలనా కాలంనాటివని తేలింది.




దొరికిన శిల్పాల్లో ఒకదానిలో ఒక శైవభక్తుడు సిద్ధాసనంలో కూర్చుని వంచిన వెదురు కర్రకు తన సిగముడిని గట్టిగా బిగించి కత్తితో మెడను తెగనరుక్కున్నట్లుంది. ఇలాంటి చారిత్రక ఆధారాల కోసం కొత్త తెలంగాణా చరిత్ర పరిశోధక బృందం అన్వేషిస్తోంది. ఇదే విషయమై తెలంగాణా ఫెడరల్ తో పరిశోధక బృందం కన్వీనర్ శ్రీ రామోజు హరగోపాల్ మాట్లాడుతు ‘చారిత్రక ఆనవాళ్ళపై తమ సంస్ధ 25 ఏళ్ళుగా పరిశోధనలు చేస్తున్న’ట్లు చెప్పారు. ‘వివిధ అంశాలపై జరిపిన పరిశోధనల్లో లభ్యమైన 93 శాసనాలతో పుస్తకాలు కూడా ప్రింట్ చేశామ’ని చెప్పారు. సిడితల వీరగల్లు గురించి మాట్లాడుతు ‘ఇప్పటివరకు ఇలాంటి ప్రక్రియకు సంబంధించి పది శిలలు దొరికి’నట్లు చెప్పారు. ‘పురుష సిడితల వీరిగల్లుల శిల్పాలు లింగంపల్లి, రాయపోలులో లభించాయ’న్నారు. ‘స్త్రీ సిడితల వీరగల్లుల శిల్పాలు చొల్లేరు, వనపర్తి ప్రాంతాల్లో దొరికాయ’ని హరగోపాల్ చెప్పారు.

Read More
Next Story