వీళ్ళ ఒత్తిడికి అధిష్టానమే తట్టుకోలేకపోతోందా ?
మొదటిసారి చట్టసభలోకి అడుగుపెట్టిన వీళ్ళ ఒత్తిడికి అధిష్టానం లొంగిపోయిందనే ప్రచారం పార్టీలో జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీలో వ్యవహారాలన్నీ విచిత్రంగా ఉంటాయి. ఎంతో బలవంతులమని అనుకున్న నేతలను అధిష్టానం ఒక్కోసారి పట్టించుకోదు. ఇదే సమయంలో మామూలు ఎంఎల్ఏలు కూడా అధిష్టానంపై బాగా ఒత్తిడి పెట్టి కొన్ని కార్యక్రమాలను వాయిదా వేయించగలరు. ఇపుడిదంతా ఎందుకంటే ఇద్దరు ఎంఎల్ఏలు అందులోను మొదటిసారి చట్టసభలోకి అడుగుపెట్టిన వీళ్ళ ఒత్తిడికి అధిష్టానం లొంగిపోయిందనే ప్రచారం పార్టీలో జరుగుతోంది.
విషయం ఏమిటంటే రేవంత్ రెడ్డి మంత్రివర్గాన్ని విస్తరించాలని అనుకున్నారు. ఎవరెవరిని తీసుకోవాలనే విషయంలో కూడా నిర్ణయానికి వచ్చారని, అందుకు అధిష్టానం కూడా అంగీకరించిందనే వార్తలు అందరికీ తెలిసిందే. పార్టీవర్గాల ప్రకారమైతే మంత్రివర్గ విస్తరణ బుధవారం జరిగిపోయుండాల్సింది. అయితే హఠాత్తుగా వాయిదాపడింది. ఎందుకు వాయిదాపడిందనే విషయమై పార్టీలో నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ చర్చల్లోనే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఇద్దరు ఎంఎల్ఏలు అధిష్టానంపై బాగా ఒత్తిడి తేవటం వల్లే విస్తరణకు బ్రేకులు పడ్డాయని. వీళ్ళు అధిష్టానం దగ్గర తమకున్న పలుకుబడితో మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మంత్రిపదవి కోసం ఇద్దరు అధిష్టానం మీద బాగా ఒత్తిడి పెడుతున్న కారణంగా ఎవరిని క్యాబినెట్లోకి తీసుకోవాలో తేల్చుకోలేని అధిష్టానం చివరకు మంత్రివర్గ విస్తరణనే వాయిదా వేసింది.
అధిష్టానాన్నే ఇన్ఫ్ల్యుయెన్స్ చేయగలిగిన ఎంఎల్ఏలు ఎవరంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి ఎంఎల్ఏ కొండయ్యగారి మదన్ మోహన్ రావు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల ఎంఎల్ఏ కొక్కిరాల ప్రేమసాగర్ రావు. ఇద్దరు కూడా మొదటిసారి ఎంఎల్ఏలు అయినవాళ్ళే. ప్రేమ్ సాగర్ గతంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎంఎల్సీగా పనిచేశారు. కొక్కిరాలది మొదటినుండి కాంగ్రెస్ కుటుంబమే. ప్రేమ్ సాగర్ కు పార్టీలోని కీలకవ్యక్తులతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ఎన్నికలకు ముందు జిల్లాలోని ఇంద్రవెల్లిలో రేవంత్ పాల్గొన్న భారీ బహిరంగసభను విజయవంతం చేశారు. అలాగే అంతకుముందు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాదయాత్రను నియోజకవర్గంలో సక్సెస్ చేశారు. ఎన్నికల సమయంలో మంచిర్యాలలో ఐఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్న బహిరంగసభ విజయవంతమైంది. దీనికి కూడా ప్రేమ్ సాగరే కారణం. ఈయన శ్రీమతి సురేఖ మంచిర్యాల జిల్లాకు అధ్యక్షురాలిగా ఉన్నారు. రేవంత్ తో పాటు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, భట్టి కూడా ప్రేమ్ సాగర్ కు గట్టిగా మద్దతిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
ఇక నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి ఎంఎల్ఏ కొండయ్యగారి మదన్ ది బాగా సంపన్న కుటుంబం. అమెరికాలో ఉద్యోగంచేసి తర్వాత అక్కడే ఐటి కంపెనీలు పెట్టినట్లు పార్టీవర్గాల సమాచారం. ఆర్ధికంగా అత్యంత పటిష్టమైన స్ధితిలో ఉన్నారు. బీఆర్ఎస్ కీలక నేత, మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అల్లుడు. ఒకపుడు టీడీపీలో యాక్టివ్ గా పనిచేశారు. 2016లో కాంగ్రెస్ లో చేరి 2019లో జహీరాబాద్ ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ఆర్ధికంగా పట్టిష్టమైన స్ధితితో పాటు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ప్రచారంలో ఉంది. నియోజకవర్గంలోని యువతకు జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగాలిప్పించారు. రాహూల్ తో సంబంధాలున్న కారణంగా ఢిల్లీలో కూడా మంచి పట్టు దొరికింది. దాంతో మంత్రిపదవి కోసం గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇద్దరు ఎంఎల్ఏలు కూడా ఎవరిస్ధాయిలో వాళ్ళకు అధిష్టానం దగ్గర గట్టి పట్టుందనే అర్ధమవుతోంది. కాకపోతే ఇద్దరిలోను పెద్ద మైనస్ ఒకటుంది.
అదేమిటంటే ఇద్దరు కూడా ఒకే సామాజికవర్గం(వెలమ)కు చెందిన వాళ్ళు. ఇప్పటికే మంత్రివర్గంలో ఇదే సామాజికవర్గంకు చెందిన జూపల్లి కృష్ణారావున్నారు. కాబట్టి ఇద్దరికి ఛాన్సు దక్కే అవకాశంలేదు. మహాయితే ఒక్కళ్ళకి మాత్రమే అవకాశం దక్కుతుంది. అందుకనే మంత్రివర్గంలో ఎవరికి అవకాశం ఇవ్వాలి ? అన్నదే పెద్ద సమస్య అయిపోయింది. ఈ సమస్య రేవంత్ స్ధాయిలో తెగకపోవటంతోనే చివరకు ఢిల్లీకి చేరుకుంది. అధిష్టానం కూడా ఎటూ తేల్చుకోకపోవటంతో మంత్రివర్గ విస్తరణే వాయిదాపడిందనే చర్చ జోరుగా జరుగుతోంది. మొత్తంమీద ఇద్దరు కూడా తమకున్న పట్టుతో అధిష్టానాన్నే ఒత్తిడిలోకి నెట్టి లొంగదీసుకున్నారనే చర్చ జరుగుతోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.