జన్వాడ ఫాం హౌస్ లో ట్విస్టు..ఎవరిపేరుతో ఉందో తెలుసా ?
x

జన్వాడ ఫాం హౌస్ లో ట్విస్టు..ఎవరిపేరుతో ఉందో తెలుసా ?

కాంగ్రెస్ పార్టీ ఒక డాక్యుమెంటును బయటపెట్టింది. అందులో ఏముందంటే జన్వాడలోని సర్వే నెంబర్లు 301/6, 301 లోని ఫాంహౌస్ శైలిమా కల్వకుంట్ల పేరుతోనే ఉంది.


జన్వాడ ఫాం హౌస్ వ్యవహారం అధికార కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య పెద్ద వివాదంగా మారింది. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని జన్వాడ ఫాం హౌస్ ఎవరిది అనే విషయంపై జనాల్లో కూడా ఆసక్తి పెరిగిపోయింది. అసలు జన్వాడ ఫాం హౌస్ విషయం నేపధ్యం ఏమిటి అనే విషయాన్ని జనాలు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెరువులు, కుంటల్లో నిర్మించిన, ప్రభుత్వ భూముల్లోని అక్రమనిర్మాణాలను తొలగించేందుకు ప్రభుత్వం హైడ్రా అనే సంస్ధను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ హైడ్రాకు కమీషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాధ్ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికి 140 అక్రమనిర్మాణాలను తొలగించి 150 ఎకరాలను హైడ్రా ప్రభుత్వానికి స్వాధీనంచేసింది.

ఈ నేపధ్యంలోనే జన్వాడలోని ఫాంహౌస్ ను హైడ్రా కూల్చేయబోతోందని బిల్డర్ ప్రదీప్ రెడ్డి హైకోర్టులో కేసు వేయటంతో అందరి దృష్టి జన్వాడ ఫాం హౌస్ మీదపడింది. కారణం ఏమిటంటే ఇప్పటివరకు అందరు జన్వాడ ఫాం హౌస్ కేటీఆర్ దే అనుకుంటున్నారు. కాబట్టి జన్వాడ ఫాం హౌస్ అనగానే అందరి దృష్టిలో కేటీఆర్ మీదపడింది. అయితే కేటీఆర్ మీడియాతో మాట్లాడుతు జన్వాడ ఫాం హౌస్ లో తానుంటున్నానే కాని ఫాం హౌస్ తనది కాదని చెప్పారు. ఫాం హౌస్ మిత్రుడు ప్రదీప్ రెడ్డిదని తననుండి లీజుకు తీసుకున్నట్లు కేటీఆర్ చెప్పారు. అయితే కేటీఆర్ చెప్పిందాన్ని ఎవరూ నమ్మలేదు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇదే ఫాం హౌస్ ముందు ధర్నా చేసినందుకు రేవంత్ రెడ్డి మీద కేసుపెట్టిన పోలీసులు అరెస్టుచేసి రిమాండుకు కూడా పంపారు. ఫాం హౌస్ తనది కాకపోతే అప్పట్లో రేవంత్ ను కేటీఆర్ ఎందుకు అరెస్టుచేయించారని కాంగ్రెస్ నేతలతో పాటు బీజేపీ ఎంపీ రఘునందనరావు కూడా నిలదీస్తున్నారు.

పైగా చెరువును ఆనుకుని కట్టిన ఫాంహౌస్ లో మంత్రిగా కేటీఆర్ ఎలాగున్నారంటు జనాలు కూడా ప్రశ్నిస్తున్నారు. తనది అక్రమనిర్మాణం కాదని బిల్డర్ ప్రదీప్ రెడ్డి అంటున్నారు. కూల్చకుండా స్టే ఇవ్వాలన్న ప్రదీప్ రిక్వెస్టును కోర్టు తిరస్కరించింది. ఫాంహౌస్ కు సంబంధించిన అన్నీ పత్రాలను చూసిన తర్వాత నిర్ణయం తీసుకోమని హైడ్రాను హైకోర్టు ఆదేశించింది. ఈ వివాదాలు, విషయాలు ఇలాగుండగానే తాజాగా కాంగ్రెస్ పార్టీ ఒక డాక్యుమెంటును బయటపెట్టింది. అందులో ఏముందంటే జన్వాడలోని సర్వే నెంబర్లు 301/6, 301 లోని ఫాంహౌస్ శైలిమా కల్వకుంట్ల పేరుతోనే ఉంది. ఈ డాక్యుమెంటును ఎన్నికల సందర్భంగా కేటీఆర్ ఎన్నికల కమీషన్ కు సమర్పించిన అఫిడవిట్ లో నుండి కాంగ్రెస్ సంపాదించింది.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే తనదికాదని కేటీఆర్ చెబుతున్న ఫాం హౌస్, శైలిమా కల్వకుంట్ల పేరుతో ఉన్న ఫాంహౌస్ ఒకటేనా కాదా అన్నదే సందేహం. జన్వాడ గ్రామంలో ఎన్ని ఫాంహౌస్ లున్నాయి, అందులో కేటీఆర్ ఉంటున్న ప్రదీప్ రెడ్డి ఫాం హౌస్, కల్వకుంట్ల శైలిమ పేరుతో ఉన్న ఫాం హౌస్ ఒకటేనా కాదా అన్నది హైడ్రా లేకపోతే రెవిన్యు అధికారులే తేల్చాలి. అయితే తనదికాదని కేటీఆర్ చెబుతున్న ఫాం హౌస్, శైలిమా కల్వకుంట్ల పేరుతో ఎన్నికల అఫిడవిట్లో చెప్పిన ఫాం హౌస్ ఒకటే అని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ ఖాతాలో డాక్యుమెంటును పోస్టుచేసింది. దాంతో జన్వాడ ఫాం హౌస్ వివాదం మరింతగా రాజుకునేట్లుంది. మరి అధికారులు, హైడ్రా ఏమి తేలుస్తారో చూడాలి.

Read More
Next Story