చుట్టూ ఎటు చూసినా కారడవి...పులులు, వన్యప్రాణుల సంచారం మధ్య గ్రామాలకు దూరం అడవి మధ్యలో ఉన్న మైసంపేట, రాంపూర్ గ్రామాల గిరిజనులను ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు మైదాన ప్రాంతానికి తరలించారు. (Tribals Evacuated from Karadavi)పులుల పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. కవ్వాల్ పులుల అభయారణ్యంలో ఉన్న మైసంపేట,ధర్మాజీపేట, రాంపూర్ అటవీ గ్రామాలను కడెం మండలంలోనినాచెన్యెల్లాపూర్, మద్దిపడగ గ్రామాలకు తరలించారు. (Relocated Tribals)
రెండు అటవీ గ్రామాలకు చెందిన 94 మంది గిరిజనులకు కడెం శివార్లలోని కొత్త మద్దిపడగ, ధర్మాజీపేట మధ్యలో పక్కా గృహాలు నిర్మించి, వారికి రెండు ఎకరాలకు పైగా వ్యవసాయ భూమిని ఇచ్చి పునరావాసం కల్పించారు. అటవీ గ్రామాలకు చెందిన 94 మంది గిరిజనులకు ఇళ్లు నిర్మించి ఇవ్వడంతోపాటు శనివారం వారికి 276.03 ఎకరాల భూమిని కేటాయించారు.ఈ మేరకు శనివారం జీఓఎంఎస్ నంబరు 43 తో జీవోను విడుదల చేశారు.
పులుల కోసం అటవీ గ్రామాల తరలింపు
పులుల పరిరక్షణ, వన్యప్రాణుల ఆవాసాలకు ఆటంకం కలగకుండా కారడవిలోపల మైసంపేట, రాంపూర్ గ్రామాల్లో నివాసమున్న 94 మంది గిరిజనులను కడెం శివార్లలోని మైదానా ప్రాంతానికి తరలించారు.(Forest Villages Relocated)నాచెన్యెల్లాపూర్, మద్దిపడగ గ్రామాల్లో గిరిజనులకు పక్కా గృహాలను నిర్మించి ఇచ్చారు. మరికొందరికి పునరావాసం కింద రూ.15లక్షల నగదును అందజేశారు. వ్యయసాయం చేస్తామని చెప్పిన గిరిజనులకు వ్యవసాయ భూముల పట్టాలను అందించారు.
కారడవి మధ్యలో నివాసం
చుట్టూ దట్టమైన అడవులు...చెట్లు, పులులు, ఇతర వన్యప్రాణుల సంచారం మధ్య కారడవి మధ్యలోని మైసంపేట, రాంపూర్ అటవీ గ్రామాల్లో 94 మంది గిరిజనులు దుర్భర జీవితం గడిపేవారు. గ్రామానికి వెళ్లేందుకు అడవి బాటలే దిక్కు. కనీస సౌకర్యాలకు దూరంగా కారడవిలో ఉన్న గిరిజన గ్రామాలను మైదాన ప్రాంతాలకు తరలించి పులుల ఆవాసాలకు ఆటంకం లేకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. పులులే కాకుండా మనుబోతులు, ఎలుగుబంట్లు తిరుగుతుండేవని, వన్యప్రాణుల సంచారం మధ్య తాము భయం భయంతో గడిపేవారమని, ప్రస్థుతం తమ గ్రామాలను కారడవి నుంచి మైదాన ప్రాంతాలకు మార్చడంతో తామెంతో సంతోషిస్తున్నామని గిరిజన యువకుడు కోవ ప్రవీణ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. గతంలో తమ గిరిజనులు ఎవరైనా ప్యాంట్లు ధరించి గ్రామానికి వచ్చారంటే చాలు ఇంటిలోపలకు వెళ్లి దాక్కొనే వారని, కానీ మైదాన ప్రాంతానికి తరలి రావడంతో తమ గిరిజనుల్లో చైతన్యం వచ్చిందని ప్రవీణ్ చెప్పారు.
వ్యవసాయ భూమిని కేటాయిస్తూ జీఓ జారీ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల అభయారణ్యం మధ్యలో ఉన్న మైసంపేట, రాంపూర్ గిరిజన గ్రామాల గిరిజనులకు ఎట్టకేలకు భూ ఆధారిత పునరావాసాన్ని కల్పించారు. 94 గిరిజన కుటుంబాలకు కడెం మండలంలోని నాచెన్యెల్లాపూర్, మద్దిపడగ గ్రామాల్లోని సర్వే నంబరు 114, 217 లలోని 276.03 ఎకరాల భూమిని కేటాయిస్తూ తెలంగాణ రెవెన్యూ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ శనివారం జీఓఎంఎస్ నంబరు 43 (Govt Go) పేరిట ఉత్తర్వులు జారీ చేశారు. పులుల కోసం పునరావాసం కింద వీరికి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో పాటు ఒక్కొక్కరికి 2.32 ఎకరాల వ్యవసాయ భూమిని ప్రభుత్వం కేటాయించింది. పునరావాసం కల్పించడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారని గిరిజన సంఘం నాయకుడు కోయ ప్రవీణ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ పునరావాస ప్యాకేజీ
కారడవిలోని గిరిజన కుటుంబాలను నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) గత ఏడాది ఏప్రిల్ 15వ తేదీన స్వచ్ఛంద పునరావాస ప్యాకేజీ కింద కడెం శివారు ప్రాంతానికి తరలించారు, 48 కుటుంబాలకు రూ.15 లక్షల పరిహారం (ఆప్షన్ 1)కింద అందించారు. మిగిలిన 94 కుటుంబాలు భూమి ఆధారిత పునరావాసాన్ని ఎంచుకున్నాయి (ఆప్షన్ 2). ప్రభుత్వం ఇప్పుడు వారికి అందించిన భూములను అధికారికంగా రెవెన్యూ భూములుగా గుర్తించి, వాటిని పట్టా భూములతో సమానంగా ఉంచి, ఆస్తిని విక్రయించడానికి, తనఖా పెట్టడానికి లేదా వారసత్వంగా ఇవ్వడానికి వీలుగా రెవెన్యూశాఖ హక్కులను ఇచ్చింది.
తెలంగాణలోనే ప్రథమం
తెలంగాణలో పులుల కోసం పునరావాసం పొందిన గిరిజన కుటుంబాలకు పూర్తి రెవెన్యూ పట్టాలు మంజూరు చేయడం మొట్టమొదటిసారి అని హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ వ్యవస్థాపకులు ఇమ్రాన్ సిద్ధిఖీ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ పునరావాసం వల్ల సమగ్ర వన్యప్రాణుల సంరక్షణకు కొత్త ప్రయాణాన్ని నెలకొల్పినట్లయింది. ఇళ్లు నిర్మించి ఇవ్వడంతోపాటు వ్యవసాయభూమి, నగదు సాయం అందించి అటవీ గ్రామాల గిరిజనులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించారని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన వ్యవసాయ భూమిని తాము చదును చేసి అందించామని హిటికాస్ వ్యవస్థాపకులు ఇమ్రాన్ సిద్ధిఖీ వివరించారు.