ఘనంగా ఉజ్జయినీ మహంకాళీ బోనాలు.. ట్రాఫిక్ ఆంక్షలు
x

ఘనంగా ఉజ్జయినీ మహంకాళీ బోనాలు.. ట్రాఫిక్ ఆంక్షలు

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి ఆషాఢమాసం బోనాలు ఘనంగా జరుగుతున్నాయి.


సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి ఆషాఢమాసం బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. బంగారుబోనం సమర్పించి, అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివెళ్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించి... ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు సీఎంని వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందించారు. మొదటి బోనం ఈరోజు తెల్లవారుజామున ఐదుగంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు సమర్పించారు.

బోనాల జాతర సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సంపర్పించారు. మహంకాళికి ప్రత్యేక పూజలు జరిపారు. ఉజ్జయినీ ఆలయానికి భక్తులు పోటెత్తడంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారిపోయింది. జనసందోహంగా మారింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు జరుపుకునే పవిత్రమైన రోజున అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణలో వందల ఏళ్లుగా బోనాల ఉత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. ఎవరు ఏ రంగంలో ఉన్నా, ఎంత స్థాయిలో ఉన్నా దేవతలను పూజించే విధానాలు ఒకేలా ఉంటాయన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. భక్తుల సౌకర్యాల్లో ఎలాంటి లోటుపాట్లు రాకుండా అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు.

రేపే రంగం...

సికింద్రాబాద్ లో ఉజ్జయినీ మహంకాళీ ఆలయంలో రెండు రోజుల పాటు బోనాల పండుగను వైభవంగా నిర్వహిస్తారు. మొదటి రోజు (ఆదివారం) భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. రెండవరోజు (సోమవారం) ఆలయం దగ్గర ఫలహారం బండ్ల ఊరేగింపు, అమ్మవారిని అంబారీపైన ఊరేగించడం, రంగం కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా రంగం భవిష్యవాణిని భక్తులు ఎంతో విశ్వసిస్తుంటారు. ఉజ్జయినీ అమ్మవారు రంగం చెప్పే జోగిని పూనుతారని చెబుతుంటారు. వచ్చే ఏడాది వరకు రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుంది? విపత్తులు ఏమైనా సంభవిస్తాయా? వ్యవసాయం ఎలా ఉంటుంది? ఇలాంటి అంశాలన్నీ భవిష్యవాణిలో జోగిని చెబుతుంది. గతేడాది తన ఆలయాన్ని పట్టించుకోవడం లేదని భవిష్యవాణిలో జోగిని వెల్లడించింది. రాష్ట్రంలో అంతా బాగుంటుందని, తన భక్తులని జాగ్రత్తగా చూసుకుంటానని తెలిపింది. ఈసారి రాష్ట్రంలో ప్రభుత్వం కూడా మారిన నేపథ్యంలో రంగంలో జోగిని భవిష్యవాణి ఏం చెప్పనుంది అనే ఆసక్తి నెలకొంది.

రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు...

సికింద్రాబాద్ అమ్మవారి ఆలయ ప్రాంతం బోనాల సమయం కావడంతో మరింత రద్దీగా ఉంది. దీంతో జులై 21, 22 (ఈరోజు, రేపు) న సికింద్రాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి 2 కిలోమీటర్ల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంచారు. కర్బలా మైదాన్, రాణిగంజ్, రాంగోపాల్ పేట్ ఓల్డ్ పీఎస్, ప్యారడైజ్, సంగీత్ క్రాస్ రోడ్స్, ప్యాట్నీ క్రాస్ రోడ్స్, పార్క్ లేన్, బాటా, బైబిల్ హౌస్, మినిస్టర్ రోడ్, రసూల్ పురా వైపు వచ్చే వాహనదారులు ఇతర మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

Read More
Next Story