‘శ్వేతపత్రం విడుదల చేస్తారా’.. కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ మహేష్ ఛాలెంజ్..
x

‘శ్వేతపత్రం విడుదల చేస్తారా’.. కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ మహేష్ ఛాలెంజ్..

గ్రూప్-1 అభ్యర్థులతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా భేటీ అయ్యారు. అభ్యర్థులు తొందరపాటు చర్యలకు పాల్పడొద్దని కోరారు.


గ్రూప్-1 అభ్యర్థులతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా భేటీ అయ్యారు. అభ్యర్థులు తొందరపాటు చర్యలకు పాల్పడొద్దని, వారి విన్నపాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తామని, ప్రభుత్వ ఔత్సాహికులకు అనుకూలంగానే నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. ఈ సందర్బంగా గ్రూప్-1 అభ్యర్థులతో భేటీ సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో, ఎంత మంది రోడ్లెక్కి ఆందోళన చేసినా పట్టించుకోలేదో అందరికీ తెలుసంటూ చురకలంటించారు. ఈ ఆరోపణలతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గ్రూప్-1 పరీక్షల వాయిదా వ్యవహారం చిచ్చు పెట్టినట్లయింది.

ఈ అంశంపై ఇరు పార్టీలో మాటల యుద్ధానికి దిగుతున్నాయి. ఒకరిపై ఒకరు ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. వ్యంగ్యాస్త్రాలు సంధించుకుంటున్నారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌తో సమావేశమైన గ్రూప్-1 అభ్యర్థులు.. మెయిన్స్ పరీక్షను వాయిదా వేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కేటీఆర్‌ను కోరారు. కాగా అభ్యర్థులకు తాను, తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, ప్రతి అడుగులో సహకారం అందిస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. కాగా ఇదే సమయంలో గాంధీ భవన్‌లో గ్రూప్-1 అభ్యర్థులతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశమై.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా ఆయన ముందు కూడా జీవో29 రద్దుతో పాటు గ్రూప్-1 మెయిన్ పరీక్ష పాత జీవో55 ప్రకారం జరగాలని కోరారు. అంతేకాకుండా పాత నోటిఫికేషన్‌లో ఇచ్చిన 503 పోస్ట్‌లలో కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వకూడదని కూడా వారు కోరారు. వారి అభ్యర్థనలు విన్న మహేష్ కుమార్.. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, అభ్యర్థులు నిశ్చింతగా ఉండాలని చెప్పారు.

సాయంత్రానికి చెప్తాం..

‘‘గ్రూప్-1 అభ్యర్థులకు ఏ విషయం అనేది సాయంత్రానికి చెప్తాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అభ్యర్థులకు అనుకూలంగానే నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నా. ఎవరూ తొందరపడొద్దు. రోడ్డెక్కి ఆందోళన తెలిసి.. అభ్యర్థుల్లో భయాందోళనలు రేకెత్తించొద్దు. ఏ ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం అన్యాయం చేయదు’’ అని అన్నారు. మరోవైపు కేటీఆర్‌పై విమర్శలు వర్షం కురిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో ఇచ్చిన ఉద్యోగాలను, బీఆర్ఎస్ పదేళ్లలో ఇచ్చిన ఉద్యోగాల సంఖ్యను ఒకసారి బేరీజు వేసుకుని కేటీఆర్ మాట్లాడాలంటూ హితవు పలికారు.

శ్వేతపత్రం విడుదల చేస్తారా..

‘‘కేటీఆర్.. నిరుద్యోగుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారు. అధికారంలో ఉన్నంత కాలం వారిని పట్టించుకోని బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు వారి అన్ని విధాలా సహకారం అందిస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామంటున్నారు.. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరైన సమయానికి జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో డీఎస్సీ, వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాలు, గ్రూప్స్.. పోలీసు ఉద్యోగాలు, ఇచ్చాం. మీరు ఏడున్నర లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఏ శాఖలో ఎంత శాతం ఖాళీలను భర్తీ చేశారు. అన్న వాటిపై శ్వేతపత్రం విడుదల చేస్తారా? చేసే ధైర్యం కేటీఆర్‌కు ఉందా?’’ అని సవాల్ చేశారు. అయితే ఆయన ఛాలెంజ్‌పై బీఆర్ఎస్ నేతలు ఇంకా స్పందించలేదు.

Read More
Next Story