టైగర్ ఎస్టిమేషన్‑2026: అడవుల్లో పులుల గణనకు వాలంటీర్లు
x
అమ్రాబాద్ అడవిలో ఫరా పులి సంచారం : కెమెరా ట్రాప్ చిత్రం ( ఫారెస్ట్ డిపార్టుమెంట్ సౌజన్యంతో)

టైగర్ ఎస్టిమేషన్‑2026: అడవుల్లో పులుల గణనకు వాలంటీర్లు

తెలంగాణ అడవుల్లో పులులు, ఇతర వన్యప్రాణులు,వృక్షాలు, పక్షులు ఎన్ని ఉన్నాయో ఈ గణనలో తేల్చనున్నారు...


తెలంగాణ అడవుల్లో ‘‘ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్-2026’’(Tiger Estimation‑2026) గణన కార్యక్రమంలో పాల్గొనేందుకు వాలంటీర్లుగా నవంబరు 22 వ తేదీలోగా చేరండి. పులులను రక్షించడంలో సహాయపడండి! అడవిలో ఫీల్డ్ అడ్వెంచర్ పులుల గణనలో 2026వ సంవత్సరం జనవరి 17–23 వతేదీ మధ్య పాల్గొనాలని అటవీశాఖ అధికారులు కోరారు. .దేశంలో పెద్ద పులుల సంరక్షణకు ఒక నూతన అధ్యాయాన్ని తెరుస్తోంది. అమ్రాబాద్, కవ్వాల్ అభయారణ్యాలు మాత్రమే కాకుండా, మహారాష్ట్ర­ అటవీ ప్రాంతాల నుంచి కూడా వలస వచ్చే పులులను కూడ ఈ సారి లెక్కించబోతున్నారు.(Counting of tigers in forests) పులుల సంఖ్యలో గత కొన్నేళ్లుగా వచ్చే అద్భుతమైన వృద్ధి ఈ గణనలో వెల్లడి కానుంది. పులుల సంఖ్య పెరిగిందా? లేదా? వాటి ఆవాసాలు ప్రమాదంలో ఉన్నాయా? వచ్చే వారంలో జరగనున్న పులుల గణనలో ఆ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయో లేదో వేచి చూడాలి.


నాలుగేళ్లకు ఓ సారి ఫులుల గణన
తెలంగాణ రాష్ట్రంలోని అమ్రాబాద్, కవ్వాల్ పులుల అభయారణ్యాలతోపాటు అడవులలో పెద్దపులుల గణనను అటవీశాఖ సమాయత్తం అయింది. ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి దేశంలో జరగనున్న పులుల గణన కార్యక్రమం జరుగుతుంది. పులుల అభయారణ్యాల్లోనే కాకుండా పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి పులులు కిన్నరసాని, మణుగూరు, గుండాల, తాడ్వాయి,ఏటూరునాగారం, ములుగు, ఆదిలాబాద్, మంచిర్యాల,ఆసిఫాబాద్ అడవుల్లోకి వలస వస్తున్నందున వాటిని కూడా లెక్కించాలని నిర్ణయించారు. దేశంలో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్- 2026 కార్యక్రమాన్ని డెహ్రాడూన్ కు చెందిన వైల్డ్ లైఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా , నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీలు పర్యవేక్షించనున్నాయి.

అడవిలో పులి సంచారం కెమెరా ట్రాప్ చిత్రం (అటవీశాఖ సౌజన్యంతో)


దేశంలో ఎన్ని పులులున్నాయంటే...

దేశంలోని అడవుల్లో పులుల సంఖ్య ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి పెరుగుతుందని తెలంగాణ జూ అథారిటీ డైరెక్టర్ సునీల్ హీరేమత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. దేశంలోని 8.27 లక్షల చదరపుకిలోమీటర్లఅటవీ ప్రాంతంలోని 65వేల బీట్ లలో పులుల గణన చేపట్టనున్నారు. దేశంలో 2006 పులుల గణనలో 1,411 పులులున్నాయని తేలింది. 2014వ సంవత్సరానికి పులుల సంఖ్య 2,226కు పెరిగాయని పులుల గణాంకాలే తేటతెల్లం చేశాయి. 2018వ సంవత్సరంలో దేశంలో 2,967 పులులుండగా, 2022 నాటికి వీటి సంఖ్య 3,967 కు పెరిగాయి ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ సర్వే వెల్లడించింది.

దేశంలో పెరుగుతున్న పులుల సంఖ్య
సంవత్సరం పులుల సంఖ్య
2006 - 1,411
2014 - 2,226
2018 - 2,967
2022 - 3,867

తెలంగాణలో పెరిగిన పులుల సంఖ్య
తెలంగాణ రాష్ట్రంలోని అమ్రాబాద్, కవ్వాల్ పులుల అభయారణ్యాల్లో అటవీశాఖ అధికారుల పెట్రోలింగ్, పులుల సంరక్షణ చర్యలతో పులుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. తెలంగాణ దక్కన్ రీజియన్ లోని 26,000 చదరపు కిలోమీటర్లలోని 3,200 ఫారెస్ట్ బీట్లలో చేపట్టనున్న పులుల గణనలో అటవీశాఖ అధికారులు,వన్యప్రాణుల ప్రేమికులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అటవీశాఖ అధికారులు పాల్గొననున్నారు. పులులు, చిరుతపులులు, జింకలు, వివిధ రకాల పక్షులను గణించనున్నారు. అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో పులుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని గత పులుల గణనలో తేలింది. 2017వ సంవత్సరంలో అమ్రాబాద్ ఫారెస్టులో కేవలం 6 పులులే ఉన్నట్లు లెక్క తేలింది. 2018లో ఏడుకు , 2019లో 12కు పులుల సంఖ్య పెరిగింది. 2021వ సంవత్సరంలో 13 పులులున్నాయని వెల్లడైంది. 2022-23వ సంవత్సరంలో అమ్రాబాద్ లో 33పులులుండగా 2024-25 నాటికి వీటి సంఖ్య 35కు పెరిగాయని అమ్రాబాద్ అటవీశాఖ డీఎఫ్ఓ గోపిడి రోహిత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

అడవిలో పులుల గణన చేపట్టిన అటవీ శాఖ అధకారులు

పులుల గణన ఇలా...
పులుల గణనలో భాగంగా మొదటి మూడు రోజులు మాంసాహార జంతువులు, వన్యప్రాణులను గణించనున్నారు. అడవుల్లోని కాలిబాటలు, బండ్ల దారుల్లో ఉదయం 6 గంటలకు వెళ్లి ఒక్కో అటవీశాఖ అధికారి రోజుకు 5 కిలోమీటర్ల దూరం నడిచి కనిపించిన వన్యప్రాణులు, వాటి అడుగులు, మల విసర్జనలు, వెంట్రుకల ఫొటోలు తీసి యాప్ లో నిక్షిప్తం చేస్తారు.పులులు అడవిలో అడ్డదిడ్డంగా కాకుండా బండ్లు తిరిగే దారుల్లోనే తిరుగుతుంటాయని, ఈ దారుల్లో దొరికిన వెంట్రుకలు, మల విసర్ణనలను సేకరించి వాటిని హైదరాబాద్ లోని డీఎన్ఏ ప్రయోగశాలకు పరీక్షకు పంపించనున్నారు.

ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్-2026
ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్-2026 గణనలో భాగంగా పులుల ఆవాసాలు, జీవ వైవిధ్య పరిస్థితులను అంచనా వేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ అటవీశాఖ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఏ శంకరన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. అడవిలోని పులులే కాకుండా క్రూర మృగాలు, శాకాహార జంతువులు, నీటి వనరులు,వన్యప్రాణులు, వృక్షాల జాతుల సమాచారాన్ని సేకరించాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంలోని 3,200 అటవీ బీట్ లలో సర్వేచేపట్టనున్నారు. శాకాహార జంతువులు తిరిగే ప్రాంతాల్లో తిరుగుతూ వాటి పెంటికలు, పాదముద్రలను పరిశీలించి, వృక్షాలను కూడా లెక్కిస్తారు. చెట్ల ఎత్తు, మందాన్ని కూడా ఆకులు రాలుస్తున్నాయా? పచ్చిక బయళ్లు ఎలా ఉన్నాయనేది పరిశీలించి నమోదు చేస్తారు.

ఎం స్ట్రెప్స్ మొబైల్ అప్లికేషన్‌లో పులుల గణన చేపట్టిన అటవీశాఖ అధికారులు


పులుల గణనను ఎం స్ట్రెప్స్ మొబైల్ అప్లికేషన్‌లో...

అటవీశాఖ సిబ్బంది, అధికారులు, వాలంటీర్లు చేపట్టనున్న పులుల గణనను ఎం స్ట్రెప్స్ మొబైల్ అప్లికేషన్ లో నమోదు చేయనున్నట్లు తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డాక్టర సువర్ణ చెప్పారు.అడవిలో ఫీల్డు ప్రొటోకాల్, ఎం స్ట్రైప్స్ మొబైల్ యాప్ డేటా రికార్డింగ్ పై వాలంటీర్లకు శిక్షణ ఇచ్చారు.పులుల గణనలో పాల్గనే వాలంటీర్లకు ఏడు రోజుల పాటు వసతి సౌకర్యాలు, భోజం అందించనున్నారు. అడవిలోకి వెళ్లేందుకు వాలంటీర్లకు రవాణ సదుపాయం కల్పిస్తారు. 18 నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న వాలంటీర్లు ఫిట్ నెస్ తోపాటు రోజుకు 10 నుంచి 12 కిలోమీటర్ల దూరం అడవిలో నడవగలిగిన వారిని ఎంపిక చేశారు.

పులుల గణనకు వాలంటీర్లు
తెలంగాణ అడవుల్లోని 3200 బీట్లలో పులుల గణనకు 2620 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వాలంటీర్లలో 65 శాతం మంది అమ్రాబాద్,కవ్వాల్ అభయారణ్యాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపించారు.అందులోనూ ఎక్కువ మంది వాలంటీర్లు హైదరాబాద్ నగరానికి చేరువలో ఉన్న అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో పులుల గణనలో పాల్గొంటామని చెప్పారు. మరో 7 శాతం మంది వాలంటీర్లు వికారాబాద్ అటవీ ప్రాంతంలో గణిస్తామని చెప్పారు. పులుల సంచారం ఉన్న అడవిలో గణన చేపట్టాలంటే తమకు బీమా సౌకర్యం కల్పించాలని వాలంటీర్లు కోరారు. తెలంగాణలో పులుల గణనపై సమాచారం కోసం 18004255364 టోల్ ఫ్రీ నంబరు లేదా టోల్ ఫ్రీ వాట్సాప్ నంబరు 9803338666 నంబరుకు ఫోన్ చేయవచ్చు.

పులులకు ఆశాకిరణం

నవంబర్ 26వతేదీన ముగియబోయే ఈ “ఆల్-ఇండియా టైగర్ ఎస్టిమేషన్-2026” కార్యక్రమం కేవలం గణన కాకుండా పులులకు ఆశాకిరణంగా మారనుంది. దేశవ్యాప్తంగా పులుల సంరక్షణకు ఈ గణన ఉపకరించనుంది. వాలంటీర్లు, అటవీ అధికారులు, వన్యప్రాణుల ప్రేమికులు కలిసి చేసిన ఈ మానవ-ప్రకృతి సంఘర్షణాత్మక ప్రయోగం ద్వారా పెద్దపులుల భవిష్యత్ కోసం ఒక జాతీయ సంకల్పానికి పునరుజ్జీవనం లభిస్తోంది.తద్వారా వచ్చే నాలుగు సంవత్సరాల్లో పులుల సంరక్షణలో మరింత ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవచ్చు.


Read More
Next Story