Tigers | పులుల పరిరక్షణకే ప్రాధాన్యం, ప్రజల రక్షణకు చర్యలేవి?
పర్యావరణ పరిరక్షణ,అడవుల సంరక్షణకు దోహదపడుతున్న పులుల పరిరక్షణకు అటవీశాఖ ప్రాధాన్యం ఇస్తోంది.పులిని చంపితే కఠిన చర్యలు తీసుకుంటోంది.
తెలంగాణలో పులుల ఆవాసాలైన అటవీప్రాంతం పోడు సేద్యం వల్ల నానాటికి అంతరించి పోతోంది. తెలంగాణలో 60 లక్షల ఎకరాల అటవీభూములుండగా, 12 లక్షల ఎకరాలు పోడు వల్ల వ్యవసాయ భూములుగా మారాయి.పోడు వల్ల పులుల ఆవాసాలు తగ్గడంతో అటవీ గ్రామాల్లోకి పులులు వస్తున్నాయి. ఒక్క నెలలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది ప్రాంతాల్లో పులి సంచరించిందంటే అటవీ ప్రాంతాల్లో పోడు సేద్యం వల్ల అని చెప్పవచ్చు.
- ఒక పులి మనుగడ సాధించాలంటే 50 కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవి ఆవాసంగా అవసరమవుతుంది. పులి తన 50కిలోమీటర్ల ఆవాసంలో మూత్రం పోసి తన ఏరియాగా ప్రకటిస్తోంది. అంటే పులి మూత్రం వాసన చూసి ఇతర పులులు కూడా ఒక పులి సంచరించే ప్రాంతంలోకి మరో పులి రాదు. ఒక్క మేటింగ్ సీజనులో తప్పితే అదీ కూడా ఆడపులి మూత్రం వాసనతో పసిగట్టి మగపులి జతకూడేందుకు వస్తుంది.పోడు వల్లనే పులులు జనవాసాల్లోకి వస్తున్నాయని, అటవీ ప్రాంతం ఆక్రమణలు, పోడు సేద్యమే పులులకు, మనుషులకు మధ్య ఘర్షణ తలెత్తిందని ఆదిలాబాద్ రిటైర్డు డీఎఫ్ఓ యం పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణకు చెప్పారు.
పులిని చంపితే వెరీ సీరియస్
పులిని ఎవరైనా హతమారిస్తే వన్యప్రాణి రక్షణ చట్టం 1972 ప్రకారం అటవీశాఖ కఠిన చర్యలు తీసుకుంటోంది.పులిని విద్యుత్ కంచె ఏర్పాటు చేసి చంపడం, వేటాడటం సీరియస్ నేరం. ఈ నేరం కింద దోషులకు ఏడాదిపాటు జైలు శిక్ష సైతం విధిస్తారు. కానీ అవే పులులు ప్రజలపై దాడులు చేసి చంపితే రూ. 10లక్షల నష్టపరిహారం, మృతుడి కుటుంబానికి ఓ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి సర్కారు చేతులు దులుపుకుంటోంది.పులుల పరిరక్షణ కోసం అటవీగ్రామాలను మైదాన ప్రాంతాలకు తరలించడంతోపాటు అటవీ గ్రామాల ప్రజల రక్షణకు సర్కారు చర్యలు తీసుకోవడం లేదు.
పులుల వరుస దాడులు
పులి సిగ్గుపడే జంతువు. పులులు మనుషులపై దాడి చేసి పంజా విసురుతాయి. కానీ మనుషులను చంపి తినవు. కేవలం 24 గంటల్లోనే పులి ఇద్దరిపై దాడి చేసింది. పలు పశువులను కూడా పులి చంపింది.
- నవంబరు 29వతేదీన ఉదయం కాగజ్ నగర్ మండలం బెంగాలీ క్యాంప్ ఆరోనంబరు గన్నారం గ్రామానికి చెందిన మొర్లే లక్ష్మీ పత్తి ఏరుతుండగా పులి దాడి చంపింది.కేవలం 24 గంటల్లోనే పులి రెండు సార్లు దాడి చేసిన ఘటనలతో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.
- నవంబరు 30వతేదీన సిర్పూర్ టి మండలం దుబ్బగూడలో పొలంలో పనిచేస్తున్న రైతు సురేష్ పై పులి దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది.
పెరిగిన పులుల సంచారం
మహారాష్ట్ర నుంచి పులులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లోకి వలస వస్తుండటంతో పులుల సంచారం పెరిగింది. కేవలం నెలరోజుల్లో పది చోట్ల పులి సంచరిస్తుండగా ప్రజలు చూశారు.
- నవంబరు 4వతేదీన కుంటాల అటవీగ్రామంలో పులి ఎద్దు, గేదెపై దాడి చేసి చంపింది. నవంబరు 10వతేదీన కాసిపేటలో పెద్దపులి, చిరుతపులి సంచరిస్తూ స్థానికులకు కనిపించాయి. నవంబరు 15వతేదీన నిర్మల్ జిల్లా పెంబి మండలంలో పులి ఎద్దుపై దాడి చేసి చంపింది. నవంబరు 18,19 తేదీల్లో జోడెఘాట్ పరిధిలోని జైనూర్ మండలం రాసిమెట్ట వద్ద పులి రెండు ఆవులను చంపింది. నవంబరు 23వతేదీన దాబా గ్రామంలోని కోర్ డోబ్రాలోదిలో పశువుల మందపై పులి దాడి చేసి ఐదు పశువులను గాయపర్చింది.నవంబరు 25,26 తేదీల్లో గాయగాం ప్రాంతంలో పులి స్థానికులకు కనిపించింది. 27వతేదీన డాబా గ్రామ శివార్లలో పులి గాడ్రింపులు వినిపించాయి. నవంబరు 28వతేదీన మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలై కోస్టారా, సోనాపూర్ ప్రాంతాల్లో ఆవుదూడపై పులి దాడి చేసి హతమార్చింది.నవంబరు 29వతేదీన బోథ్ బాబేరు తండాలో మేకల మందపై చిరుతపులి దాడి మూడు గొర్రెలు, ఒక మేకను చంపింది.
పులి దాడి నుంచి తప్పించుకునేందుకు ఫేస్ మాస్క్ లు...
పొలంలో పది మంది పనిచేస్తుంటే, మరో ఇద్దరు పులి సంచారంపై దృష్టి సారించి ఈలలతో విజిల్స్ వేయడం, డ్రమ్ములతో శబ్దాలు చేయాలని అటవీశాఖ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ విల్లుసింగ్ మేర్ గ్రామస్థులకు సూచించారు. పొలాల్లో పనిచేసేవారు, బయట తిరిగే వారు తల వెనుక భాగంలో మాస్క్ పెట్టుకుంటే పులి దాడి నుంచి రక్షణగా ఉంటుందని ఆసిఫాబాద్ సీసీఎఫ్ శాంతారాం చెప్పారు. పులులను దూరంగా ఉంచడంలో సహాయపడే ఫేస్ మాస్క్‌లు, ఈలలు, డ్రమ్స్ సహాయపడతాయని అటవీశాఖ అధికారులు చెప్పారు. గత కొన్ని రోజులుగా పులి సంచరిస్తున్న కాగజ్‌నగర్ మరియు సిర్పూర్ (టి)మండలాల్లోని గ్రామాల్లో అటవీశాఖ అధికారులు మాస్క్‌లను పంపిణీ చేశారు.ఈ మాస్క్ పులిని కలవరపెడుతుందని, దీనివల్ల పులి దాడులను నివారించవచ్చని అధికారులు పేర్కొన్నారు.
మాస్కులు, ఈలలు, డ్రమ్ములే...
పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బన్స్‌లో ప్రజలపై పులులు దాడులు జరగకుండా నిరోధించడంలో మాస్కులు ప్రభావవంతంగా ఉన్నట్లు గుర్తించారు. అటవీ గ్రామాల్లో పంపిణీ చేయడానికి ఈలలు, డ్రమ్ములను అటవీశాఖ సేకరిస్తోంది. ఈ పరికరాలు పొలాల వద్ద సెంట్రీ డ్యూటీ చేసే వ్యక్తులు లేదా పశువులు లేదా గొర్రెలను మేపుతున్నప్పుడు ఉపయోగించవచ్చు. గ్రామస్థులు 8 నుంచి 10 మంది వ్యక్తుల సమూహంగా వెళ్లి పొలాల దగ్గర పులులు లేదా ఇతర వన్యప్రాణుల కదలికలపై నిఘా ఉంచడానికి కనీసం ఇద్దరిని సెంట్రీలుగా ఉంచాలని గ్రామస్థులకు అటవీశాఖ అధికారులు సూచించారు.
గ్రామ రక్షణ కమిటీలు
ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య మేత కోసం పశువులను పొలానికి తీసుకువెళ్లేటప్పుడు దానికి గంటతో కూడిన కర్రను తీసుకెళ్లాలని అధికారులు సూచించారు.పులి సంచారం నేపథ్యంలో స్థానిక పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్, అటవీ బీట్ అధికారి, ఒక పోలీసు అధికారితో గ్రామ రక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. పులి ఉనికికి సంబంధించిన ఏవైనా ఆధారాలను కమిటీకి నివేదించాలని సూచించారు. పులులకు హాని కలిగించవద్దని, అలాంటి చర్యలు వన్యప్రాణి (రక్షణ) చట్టం, 1972 ప్రకారం చర్యలు తీసుకుంటాయి.
పులి జాడ లభ్యం
పులుల సంచారం పెరగడంతో 45 డ్రోన్ కెమెరాలు, వంద ట్రాకర్స్ సాయంతో పులి జాడ కోసం అటవీశాఖ అధికారులు గాలించారు.డ్రోన్ కెమెరాల సాయంతో ఎట్టకేలకు పులి జాడను అటవీశాఖ అధికారులు గుర్తించారు. సిర్పూర్ టి మండలం ఇటిక్యాల పహాడ్ వాగు వద్ద పులి సంచరించినట్లు వెల్లడైంది. దీంతో పులిని మహారాష్ట్ర అడవుల వైపు మళ్లించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
పులి సంచారంతో అటవీగ్రామాల్లో 144 సెక్షన్
పులి సంచారం పెరగడంతో అటవీ గ్రామాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నజ్రుల్ నగర్, సీతానగర్, గన్నారం, కడంబా, ఆరెగూడ, ఇస్గాం తదితర అటవీగ్రామాల్లో రైతులు పొలాల్లోకి రాకుండా ఆంక్షలు విధించారు.
Next Story