Kakatiya Monument: కాపాడండి అని కేకేస్తున్నకాకతీయుల గుడి
మెదక్ జిల్లాలోని లాల్ గాడి మలక్ పేటలో శిథిల కాకతీయ దేవాలయం
తెలంగాణ మేడ్చల్ జిల్లా తుర్కపల్లి జీనోమ్ వ్యాలీ పరిధిలోని లాల్ గాడి మలక్ పేట్ లో శిథిలమైన కాకతీయ దేవాలయాన్ని కొత్తతెలంగాణ చరిత్రబృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, మహమ్మద్ నసీరుద్దీన్, మహమ్మద్ ఇమ్రాన్ లు సందర్శించారు.
ఈ గుడి పూర్తిగా తొలితరం కాకతీయశైలిలో నిర్మించబడ్డది. ఈ దేవాలయానికి ముఖమంటపం, రంగమంటపం, అంతరాళం, గర్భగుడి వున్నాయి. గుడి పైన విమానంలేదు. మంటపాలలో, అంతరాళంలో భువనశిల్పాలున్నాయి. ప్రవేశద్వారానికి రెండువైపుల శైవద్వారపాలకులున్నారు. గర్భగుడి వెనక విరిగిన ప్రణాళి వుంది. శివలింగాభిషేక జలాలు పారడానికి పెట్టిన ఈ ప్రణాళి, శైవద్వారపాలకుల ఆధారంగానే ఈ గుడి శివాలయం అని చెప్పగలం.
ముఖమంటపం 24 స్తంభాలతో, రంగమంటపం 16 స్తంభాలతో కక్ష్యాసనాలలో నిర్మితమైనాయి. ద్వారాలపై స్తంభికలు, లలాటబింబంగా గజలక్ష్మి శిల్పాలున్నాయి. గర్భగుడి పూర్తిగా తవ్వివేయబడ్డది. అందులో ఉండాల్సిన శివలింగం, పానవట్టాలు లేవు. ఒక్క భువనశిల్పం బయటపడవేసివుంది.
ఈ కాకతీయుల గుడిని కాపాడండిఈ గుడి పట్టిష్టంగానే ఉంది. పునరుద్ధరణ సులువు. చిన్న, చిన్న మార్పులతో గుడిని పూర్వస్థాయికి తీసుకువచ్చే అవకాశముంది. గుడిలో శివలింగం, పానవట్టం, నంది శిల్పాలను సమకూర్చి, గర్భగుడికి కప్పుచేర్చి, భువనశిల్పాన్ని ఎప్పటిలా పెట్టి నిర్మాణం చేయవచ్చు. తెలంగాణవారసత్వశాఖ, తెలంగాణ ప్రభుత్వం ఈ ఆలయపునరుద్ధరణకు పూనుకోవాలని కొత్త తెలంగాణ చరిత్రబృందం కోరుతున్నది