కాంగ్రెస్ పార్టీ మార్క్ ప్రజాస్వామ్యం అంటే ఇదేనా ?
దేశంలో ఎన్ని రాజకీయపార్టీలు ఉన్నా కాంగ్రెస్ పార్టీది మాత్రం చాలా డిఫరెంటు స్టైల్. ఈ పార్టీలో ప్రజాస్వామ్యం అపరిమితంగా ఉంటుంది.
దేశంలో ఎన్ని రాజకీయపార్టీలు ఉన్నా కాంగ్రెస్ పార్టీది మాత్రం చాలా డిఫరెంటు స్టైల్. ఈ పార్టీలో ప్రజాస్వామ్యం అపరిమితంగా ఉంటుంది. మిగిలిన ఏ పార్టీని తీసుకున్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత ప్రజాస్వామ్యం కనబడదు కాక కనబడదు. ఇపుడు విషయం ఏమిటంటే తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహా చేసిన వ్యాఖ్యలు పార్టీతో పాటు ప్రభుత్వంలో సంచలనంగా మారాయి.
విషయం ఏమిటంటే మీడియాతో దామోదర్ మాట్లాడుతు తొందరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు. విస్తరణలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు హోంశాఖను కేటాయించబోతున్నట్లు చెప్పారు. నిజామాబాద్ జిల్లా నుండి ఒకరికి అవకాశం ఉంటుందన్నారు. దానం నాగేందర్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలున్నట్లు చెప్పారు. నిజానికి క్యాబినెట్ గురించి మాట్లాడే అర్హత మంత్రి దామోదర్ కు లేదు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడుంటుంది ? మంత్రివర్గంలో ఎంతమందుంటారు ? ఎవరిని తీసుకోబోతున్నారు ? ఎవరిని డ్రాప్ చేయబోతున్నారనే విషయాలను చెప్పాల్సింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే. రేవంత్ ఈ విషయాలు మాట్లాడేంతవరకు మంత్రులు ఎవరు నోరిప్పేందుకు లేదు.
ఏ పార్టీలో అయినా మంత్రివర్గంకు సంబంధించి చెప్పేది ముఖ్యమంత్రి మాత్రమే. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ కదా ముఖ్యమంత్రి మాత్రమే పలానాది చెప్పాలని, మంత్రులు ఎవరూ పలానా విషయమై నోరిప్పేందుకు లేదనే రూలు ఏమీలేదు. ఎవరు దేని గురించైనా మాట్లాడేస్తారు. అసలు చెప్పాల్సిన రేవంతేమో నోరిప్పటంలేదు. చెప్పాల్సిన సమయం వచ్చినపుడు చెబుతానని, అన్నీ విషయాలు మీడియాకు తగిన సమయంలో వివరిస్తానని ఎప్పటికప్పుడు తప్పించుకుని తిరుగుతున్నారు. నోరిప్పకూడదని మంత్రి దామోదర్ మాత్రం అన్నీ విషయాలను నిర్మొహమాటంగా మీడియాతో చెప్పేశారు. దీన్నే కాంగ్రెస్ మార్క్ ప్రజాస్వామ్యం అనంటారు.
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు హోంశాఖను కేటాయించటం రేవంత్ ఇష్టం. నిజానికి మంత్రివర్గం కూర్పు, శాఖల కేటాయింపు కూడా పూర్తిగా రేవంత్ చేతిలో ఉండదు. మంత్రివర్గం కూర్పు, శాఖల కేటాయింపు అంశాలను అధిష్టానంతో చర్చించిన తర్వాత మాత్రమే ఫైనల్ అవుతాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంతిమనిర్ణయం దాదాపు అధిష్టానం చేతిలోనే ఉంటుంది. ఈ పద్దతికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో మాత్రమే కాస్త మినహాయింపుండేది. ముఖ్యమంత్రయిన దగ్గర నుండి రేవంత్ వారంలో రెండురోజులు ఢిల్లీకి వెళుతున్నారంటే అధిష్టానంతో మాట్లాడేందుకే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంత్రివర్గం కూర్పు, శాఖల కేటాయింపు విషయాన్ని రేవంత్ ఒకవైపు అధిష్టానంతో మాట్లాడుతుంటే మరోవైపు హైదరాబాద్ లో కూర్చుని ఇదే విషయాన్ని మంత్రి దామోదర్ మీడియాతో మాట్లాడటం కాంగ్రెస్ లో మాత్రమే చెల్లుబాటవుతుంది.