‘రాష్ట్ర ప్రభుత్వం నిర్భందిస్తోంది అంబేద్కర్‌ని’
x

‘రాష్ట్ర ప్రభుత్వం నిర్భందిస్తోంది అంబేద్కర్‌ని’

తెలంగాణ రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ మధ్య రాజకీయ వేడి కాక రేపుతోంది.


తెలంగాణ రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ మధ్య రాజకీయ వేడి కాక రేపుతోంది. పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన బాటబట్టాయి. ఈరోజు భారీ నిరసన చేపట్టడానికి బీఆర్ఎస్ కీలక నేతలు కూడా రెడీ అయ్యారు. ఈ క్రమంలో అలెర్ట్ అయిన పోలీసులు.. పలువురు బీఆర్ఎస్ నేతలను గృహ నిర్భంధం చేశారు. ఈ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధిస్తోంది బీఆర్ఎస్ నేతలను కాదని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌నని అన్నారు. ఆయన ఏ స్వేచ్ఛ కోసమైతే పోరాడారో.. ఆ స్వేచ్ఛనే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హరిస్తుందని విమర్శలు గుప్పించారు. దళిత బంధు డిమాండ్ చేస్తే వారిపై దండిగా కేసులు పెట్టి లోపలేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫ్యాషన్ అయిపోయిందంటూ ఎద్దేవా చేశారు.

‘‘బీఆర్ఎస్ పాలన సమయంలో సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి ఆయనను గౌరవించుకున్నాం. 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పుడు అంబేద్కర్ వర్ధింతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించకుండా ఈ ప్రభుత్వం అడ్డుపడుతోంది. ఆయన విగ్రహాన్ని నిర్లక్ష్యం చేయడం వెనక అసలు ఉద్దేశం ఏంటి? దళితబంధు తొలగించి అంబేద్కర్ అభయహస్తం తెస్తామని అన్నారు. ఇప్పుడు ఆ ఊసేలేదు. అభయహస్తం ఎటు కొట్టుకుపోయిందో తెలీదు. ఇక దళితబంధు డిమాండ్ చేసే వారిపై దండిగా కేసులు బనాయిస్తున్నారు’’ అని మండిపడ్డారు కేటీఆర్. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్రంలో అప్రకటిన ఎమర్జెన్సీ నడుస్తోందని విమర్శలు గుప్పించారు.

అందుకే నిరసన..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలే టార్గెట్‌గా అక్రమ కేసులు బనాయిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ కేసులకు వ్యతిరేకంగానే ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర భారీ నిరసన నిర్వహించాలని, అందులో ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నిరసన నేపథ్యంలోనే పోలీసులు పలువురు బీఆర్ఎస్ కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగానే తనను గృహ నిర్భందం చేయడంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘తెలంగాణలో అప్రకటిన ఎమర్జెన్సీ నడుస్తోంది. మేము ధర్నాకు వెళ్లకుండా అడ్డుకోవడం అప్రజాస్వామికం’’ అని అన్నారాయన. అదే విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆమె ఇంటి దగ్గర భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ నేతలు హౌస్ అరెస్ట్‌లు జరుగుతున్న క్రమంలో కేటీఆర్ రావడం కీలక మారింది. ఈ విషయం తెలిసిన వెంటనే తెలంగాణ భవన్‌ దగ్గర భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.

Read More
Next Story