కరవు పీడిత కామారెడ్డిలో వెల్లువెత్తిన వరదలు
x
కామారెడ్డిని ముంచెత్తిన వరద విపత్తు

కరవు పీడిత కామారెడ్డిలో వెల్లువెత్తిన వరదలు

గోదావరి నీళ్ల కోసం ఎదురుచూస్తూంటే వరదనీరు ముంచేసింది...


కామారెడ్డి (Kamareddy)ప్రాంతం నిత్య కరవుపీడిత ప్రాంతం(DroughtArea). కానీ ఇపుడు ప్రజలు వరద బాడిన పడ్డారు. జిల్లా యావత్తూ జలమమయమైంది.(Record Rainfall) నీళ్లు కావాలి అన్న వాళ్లకి వరద దెబ్బ సోకిన విచిత్రమైన పద్ధతి జిల్లాలో కనబడుతూ ఉంది.గత వారం రోజులపాటు కామారెడ్డిని వరదలు చుట్టుముట్టాయి. ఊర్లన్నీ వరద నీట మునిగాయి. గిరిజన తండాలన్నీ జలమయం అయ్యాయి. కాలువలు పొంగి పొర్లాయి. రోడ్లు దెబ్బ తిన్నాయి. అనావృష్టి ఇంతవరకు ఒక దెబ్బ వేస్తే ఇపుడు కామారెడ్డి మీద అతివృష్టి తీరని నష్టాన్ని మిగిల్చింది.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి కామారెడ్డి ప్రజలు గోదావరి నీటిని తమ ప్రాంతానికి తరలించి బీడు భూములను సస్యశ్యామలం చేయాలని కోరుతూ పోరాటాలు చేశారు. 2008వ సంవత్సరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గోదావరి నదిపై నిర్మించే ప్రాణహిత ప్రాజెక్టు(PranahithaProject) నుంచి కామారెడ్డికి కాల్వ తవ్వుతానని హామీ ఇచ్చారు. కానీ ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం కాకముందే వైఎస్ మరణించారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలతో రాష్ట్ర విభజన జరిగింది. నాటి ప్రాణహిత ప్రాజెక్టును కాస్తా అప్పటి సీఎం కేసీఆర్ కాళేశ్వరానికి(Kaleswaram) మళ్లించారు. అంతే కామారెడ్డి కాలువ మాయమైంది.



ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు శంకుస్థాపనకే పరిమితం

ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి 2008వ సంవత్సరం డిసెంబరు 16వతేదీన కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణమైతే కామారెడ్డి ప్రాంతంలోని మూడు లక్షల ఎకరాలకు సాగునీరందేది. ఆ రతర్వాత రాష్ట్ర పునర్ విభజన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే కామారెడ్డి ప్రాంతంలోని భూములకు సాగునీరు అందుతుందని ఆశించిన రైతులకు తీవ్ర నిరాశ మిగిలింది. అప్పటి సీఎం కేసీఆర్ ప్రాణహితకు రీడిజైనింగ్ చేసి తుమ్మిడి హెట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టును కాళేశ్వరానికి తరలించారు.



కాళేశ్వరం నిర్మించినా కామారెడ్డికి కాల్వ ఏది?

కామారెడ్డికి కాళేశ్వరం జలాలు తీసుకొచ్చి తీరుతామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు హామి ఇచ్చారు. కామారెడ్డికి కాళేశ్వరం జలాలు తీసుకురావడం ద్వారా బీడు భూములను సస్యశ్యామలం చేస్తామని ప్రకటించారు. దీనిలో భాగంగా కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులు చేపట్టేందుకు రూ.695 కోట్లతో మూడు రిజర్వాయర్లు నిర్మించాలని ప్రతిపాదించినా కార్యరూపం దాల్చలేదు.కామారెడ్డి మండలం తిమ్మక్ పల్లి, లింగంపేట మండలం మోతే, గాంధారి మండలం కాటేవాడిలో రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించినా కదలిక లేదు. 2004వ సంవత్సరంలో ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా సదాశివనగర్ మండలం భూంపల్లి రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా కామారెడ్డి ప్రాంత పొలాలకు సాగునీరు అందించేందుకు కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ప్రతిపాదలనను కేసీఆర్ దారి మళ్లించారు.



కామారెడ్డిలో కేసీఆర్ ఓటమికి కారణమిదేనా?

కామారెడ్డికి ప్రాణహిత జలాలు తీసుకురానందుకు కారణమైన కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాను కామారెడ్డికి కాళేశ్వరం జలాలు తీసుకువస్తాననే హామీ ఇచ్చారు. తన వెంట కామారెడ్డికి కాళేశ్వరం జలాలు తీసుకువస్తానని ఎన్నికల సమయంలో ప్రకటించినా ప్రజలు ఆయన మాట నమ్మలేదు. కాళేశ్వరం ప్యాకేజీ 22 పనులు ప్రారంభించి కామారెడ్డిలోని మూడుల లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తానని అప్పటి కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి, నేటి ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి హామి ఇచ్చారు. కామారెడ్డికి కాళేశ్వరం జలాల తరలింపు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన హామీగా నిలిచింది. మొత్తంమీద కామారెడ్డిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓటమికి కాళేశ్వరం జలాలు తరలించక పోవడమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు.



నాడు అనావృష్టి...నేడు అతి వృష్టి

గోదావరి నుంచి కాళేశ్వరం జలాలు రప్పించే ప్యాకేజీ 22 నిర్మాణం చేపట్టక పోవడం, మూడు రిజర్వాయర్ల నిర్మాణం ప్రతిపాదనల్లోనే ఉండటంతో కామారెడ్డి ప్రాంత ప్రజలు అనావృష్టి పరిస్థితులతో నిత్యం అల్లాడుతూనే ఉన్నారు. సాగునీరు అందే పరిస్థితి లేక వర్షాధారంపైనే పంటలు పండించుకోవాల్సిన పరిస్థితులుండేవి. వరుణుడు కరుణించక కామారెడ్డి ప్రాంతంలో నిత్యం కరవు పరిస్థితులు కనిపించేవని ఈ ప్రాంత రైతు సంఘం నాయకుడు కోటపాటి నర్సింహనాయుడు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



కరవుపీడిత కామారెడ్డిలో కుండపోతవర్షాలు

నిత్యం కరవుతో అల్లాడే కామారెడ్డిలో నేడు తెలంగాణలోనే అత్యధికంగా ఒకే రోజు 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుండపోత వర్షాలతో కామారెడ్డి కకావికలం అయింది. గడచిన వందేళ్లలో 41 సెంటీమీటర్ల వర్షపాతం తెలంగాణలోనే ఎక్కడా కురవలేదు. కామారెడ్డి జలప్రళయం రికార్డుగా మిగిలింది.ఎప్పుడూ అనావృష్టి పరిస్థితులుండే కామారెడ్డిలో నేటి జలప్రళయంతో అతి వృష్టి పరిస్థితులు ఏర్పడి ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. వేసిన పంటలు నీట మునగడమే కాకుండా ఇళ్లు నీట మునిగి పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. పలు రోడ్లు తెగిపోయాయి, చెరువులకు గండ్ల పడ్డాయి. కామారెడ్డి ప్రాంతంలో ఈ జలప్రళయం మర్చిపోలేని విపత్తును మిగిల్చింది.



కామారెడ్డిలో జలప్రళయం

తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి, మెదక్ జిల్లాలను జలప్రళయం కంపింపజేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కామారెడ్డిలో 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై గత వర్షపాతం రికార్డులను బద్ధలు చేసింది.కామారెడ్డి జిల్లాలో కురిసిన కుండపోత వర్షపాతం గత తెలంగాణ రికార్డులను చెరిపేస్తూ సరికొత్త రికార్డు నెలకొల్పింది. అల్పపీడన ప్రభావం, నైరురుతువపనాల ప్రభావం, తూర్పు, పడమర దిశల నుంచి తేమ వ్యాపించడంతో అతి భారీవర్షాలు కురిశాయి. దీని వల్ల వందలాది చెరువులు, నాలాలు తెగిపోయి వరదనీరు గ్రామాలపై పడి జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి.



జలప్రళయాల్లో కామారెడ్డిది రికార్డు

తెలంగాణలో జలప్రళయాల్లో కామారెడ్డిది రికార్డు అని చెప్పవచ్చు. తెలంగాణలోనే అత్యధిక వర్షపాతం నమోదై కామారెడ్డి వర్షాల చరిత్రను తిరగరాసింది. ఒక్క రోజులో 41 సెంటీమీటటర్ల వర్షంతో కామారెడ్డి కకావికలమైంది. 2008వ సంవత్సరం ఏప్రిల్ 8వతేదీన ఆదిలాబాద్ జిల్లాల్లో కేవలం 24 గంటల్లో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.నాడు ఆదిలాబాద్ జిల్లా జలమయం అయింది.గత ఏడాది(2024) జనవరి 9వతేదీన భద్రాచలంలో 23 సెంటీమీటర్ల వర్షం కురిసింది.1908వ సంవత్సరం సెప్టెంబరు 28వతేదీన హన్మకొండలో 30 సెంటీమీటర్లు, 1954 వ సంవత్సరం అక్టోబరు 7వతేదీన ఖమ్మం జిల్లాలో 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
పాలమూరులో....
కరవు పీడిత ప్రాంతంగా పేరొందిన మహబూబ్ నగర్ జిల్లాలో 1978వ సంవత్సరం ఆగస్టు 15వతేదీన 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1983 వ సంవత్సరంలో నిజామాబాద్ జిల్లాలో 35 సెంటీమీటర్లు,2005 వసంవత్సరంలో మెదక్ జిల్లాలో 19 సెంటీమీటర్లు,2018 వ సంవత్సరంలో రామగుండంలో 26 సెంటీమీటర్లు,2019వ సంవత్సరంలో నల్గొండ జిల్లాలో 21సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



వర్షపాతం రికార్డులెన్నో...

తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాలు అత్యధిక వర్షపాతం నమోదుతో పలు రికార్డులు సృష్టించాయి. 2023వ సంవత్సరం జులై నెల 27వతేదీన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల ప్రాంతంలో కేవలం 24 గంటల్లోనే 620.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.నాడు భూపాలపల్లిలో చెరువులు తెగిపోయి,గ్రామాలు నీట మునిగాయి. 2013వ సంవత్సరం జులై 19వతేదీన ములుగు జిల్లాలోని పేరూరులో 24 గంటల్లో 581. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై హైదరాబాద్ వాతావరణ కేంద్రం చరిత్రలో రికార్డుగా మిగిలింది. 2013 వసంవత్సంర జులై 19వతేదీన ములుగు జిల్లాలోని వాజేడులో 517.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

వరదల్లో చిక్కుకున్న ప్రజలు
తెలంగాణ రాష్ట్రంలో గత మూడు రోజులుగా వరదల్లో చిక్కుకున్న 1646 మందిని తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్టుమెంట్ సిబ్బంది రక్షించారు. అతిభారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని చిన్న మల్లారెడ్డి గ్రామంలో వెల్లువెత్తిన వరదల్లో చిక్కుకున్న ఆరుగురిని ఫైర్ స్టేషన్ సిబ్బంది కాపాడారు. ధర్పల్లి ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు ఇద్దరు వరదల్లో చిక్కుకు పోవడంతో ఆర్మూర్ ఫైర్ సిబ్బంది వారిని సురక్షితంగా తీసుకువచ్చారు. సిరికొండ మండలం కొండూర్ గ్రామంలో వరదల్లో చిక్కుకున్న 10 మంది గ్రామస్థులను రెస్క్యూ సిబ్బంది రక్షించారు.ముత్య చెరువు తెగిపోవడంతో వాడి గ్రామంలో వరదనీటిపాలైన 380 మందిని వరదల నుంచి కాపాడారు. గాంధారి, రామారావుపల్లె, సిర్పూర్, నర్మల, బెజ్జొరా, యంక, డోంకల్, బూరుగుపల్లి,మునిపల్లి, కామారెడ్డి హౌసింగ్ బోర్డు, తిమ్మారెడ్డి, ఉగ్రవాయి, చేగుంట, రామాయంపేట, అన్నాసాగర్, గునుకుల్, జీఆర్ కాలనీ నీట మునగడంతో ఆయా ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.



గోదావరి బేసిన్ లో జలకళ

గోదావరి బేసిన్ జలకళతో ఉట్టిపడుతోంది. సింగూరు జలాశయంలోకి పెద్ద ఎత్తున వరదనీరు చేరుతుండటంతో శుక్రవారం 51వేల క్యూసెక్కుల వరదనీటిని దిగువకు వదులుతున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి 1,68,000 క్యూసెక్కులు, శ్రీరాంసాగర్ జలాశయం నుంచి 5,30,000 క్యూసెక్కుల వరదనీటిని దిగువకు వదిలారు. కడెం నది నిండు కుండలా మారడంతో ప్రాజెక్టు నుంచి 28వేల క్యూసెక్కుల వరదనీటిని గేట్లు తెరచి కాల్వలోకి విడుదల చేశారు.అప్పర్ మానేరు డ్యాం నుంచి 40,800 క్యూసెక్కులు, మిడ్ మానేరు నుంచి 45,000 క్యూసెక్కులు, ఎల్లంపల్లి నుంచి 6,77,000 క్యూసెక్కులు, సుందిళ్ల నుంచి 8,35,000, మేడిగడ్డ నుంచి 9.72,000, అన్నారం నుంచి 7,19,000 క్యూసెక్కులు, సమ్మక్క సారక్క జలాశయం నుంచి 8,11,000 క్యూసెక్కులు, సీతారాం సాగర్ నుంచి 7,03,00 క్యూసెక్కుల వరదనీటిని గేట్లు తెరచి దిగువకు వదిలారు.

లోతట్టుప్రాంతాలు జలమయం
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాల్లో గడచిన ఆరుగంటల్లో అతి భారీ వర్షాలు కురవడంతో జిల్లాలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఆకాశాసికి చిల్లులు పడినట్లుగా కుండపోత వర్షం కురుస్తుందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. కామారెడ్డిలో 500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు. అతి భారీవర్షాల వల్ల గంటగంటకు వరద విపత్తు పెరుగుతోంది. లోతట్టు ప్రాంతాలు వరదనీటి చిక్కుకోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. పలు రోడ్లు వరదనీటికి కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచాయి. కామారెడ్డిలో ఇప్పుడు ఏమి జరుగుతుందో వర్ణించలేని పరిస్థితులు నెలకొన్నాయి. గంట గంటకూ భయంకరంగా వరద పరిస్థితి మారుతోంది.



రాజంపేటలో రికార్డు స్థాయిలో వర్షం

కామారెడ్డిలోని రాజంపేటలో అత్యధిక వర్షపాతం నమోదైంది. బుధవారం తెల్లవారుజామున 12 గంటల నుంచి నుండి ఉదయం 8 గంటల వరకు 136మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.బుధవారం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు 363మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. కామారెడ్డిలో కేవలం 14 గంటల్లోనే 410మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది విపత్తు కంటే ఎక్కువ అని తెలంగాణ వెదర్ మ్యాన్ చెప్పారు. మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో 3-4 గంటల పాటు అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.కామారెడ్డిలో ప్రస్థుత అతి భారీ వర్షాలు నాటి భూపాలపల్లి వరదలను గుర్తుకు తెస్తున్నాయి.



వందేళ్ల ప్రాజెక్టు పోచారంకు భారీవరద

1922 సంవత్సరంలో 1.82 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో తో నిర్మితమైన పోచారం ప్రాజెక్టు నుంచి అత్యధికంగా 70 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలే అవకాశం ఉంది. కానీ గత రెండు రోజులుగా కురుస్తున్నది భారీ వర్షం మూలంగా 1,82,000 క్యూసెక్కుల నీరు ప్రాజెక్ట్ నుంచి దిగువకు వెళ్లడంతో దెబ్బతిన్న ప్రాజెక్ట్ ఆనకట్టకు మరమ్మతులు చేపట్టారు ఈ ఆనకట్ట మరమ్మతు పనులు ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రత్యేక పర్యవేక్షణలో జరుగుతున్నాయి.

తెలంగాణలో జలప్రళయాల పట్టిక
-----------------------------------
సంవత్సరం వరద విపత్తు వర్షపాతం(సెంటీమీటర్లలో)
-----------------------------------------------
2025 కామారెడ్డి 41
2024 భద్రాచలం 23
2023 భూపాలపల్లి 62
2019 నల్గొండ 21
2018 రామగుండం 26
2013 పేరూరు 58
2013 వాజేడు 51
2008 ఆదిలాబాద్ 25
2005 మెదక్ 19
1983 నిజామాబాద్ 35
1978 మహబూబ్ నగర్ 25
1954 ఖమ్మం 29
1908 హన్మకొండ 30

---------------------------------


Read More
Next Story