అప్పుడు చెప్పులు... ఇప్పుడు బుక్కులు...
x

అప్పుడు చెప్పులు... ఇప్పుడు బుక్కులు...

సబ్సిడీ విత్తనాల కోసం క్యూ లైన్లో రైతులు పాస్ బుక్కులు ఉంచడం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో కేటీఆర్ చేసిన విమర్శలు ఆయనకే తిరిగి తగులుతున్నాయి.


తెలంగాణలో పలుచోట్ల విత్తన కేంద్రాల వద్ద సబ్సిడీ విత్తనాల కోసం సోమవారం ఉదయం నుంచి రైతులు పడిగాపులు కాశారు. సంగారెడ్డి జిల్లాలో ఎండలో నిలబడలేక తమ పాస్ బుక్కులను క్యూ లైన్లో పెట్టారు. ఈ వీడియోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో రేవంత్ సర్కార్ పై ప్రతిపక్షాలు మాటల దాడులు మొదలుపెట్టాయి. ఆనాటి రోజులు తెస్తానన్నావ్.. ఇవేనా రేవంత్ అంటూ గత ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం రైతులు క్యూలైన్లో చెప్పులు ఉంచిన ఫోటోలు షేర్ చేస్తూ నిలదీస్తున్నారు.

ఇక ఇదే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగ జోగిపేటలో విత్తనాల కేంద్రం వద్ద క్యూ లైన్లో పాస్ బుక్కులు ఉంచిన ఫోటో షేర్ చేస్తూ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు ఆరు నెలల్లోనే ఆవిష్కృతం అయ్యాయన్నారు. కాంగ్రెస్ పాలనలో నీటి కష్టాలు, విద్యుత్ కష్టాలు, రైతుల కష్టాలు, అన్నదాతల ఆత్మహత్యలు, చివరికి జోగిపేటలో.. విత్తనాల కోసం రైతుల మొక్కులు... క్యూలైన్ లో పాస్ బుక్కులు చూడాల్సొచ్చిందని అధికార ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో.. ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో అంటూ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఆయన చేసిన ఈ పోస్టుపై స్పందించిన కొందరు నెటిజన్లు మరి మీ ప్రభుత్వంలో జరిగినవాటి గురించి ఏం సమాధానం చెబుతారంటూ నిలదీశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2019 సెప్టెంబర్ లో యూరియా కోసం ఇలానే పడిగాపులు పడాల్సి వచ్చింది. క్యూలైన్లో చెప్పులు పెట్టి తమ టర్న్ వచ్చేవరకు వెయిట్ చేశారు. సిద్దిపేటలో 65 ఏళ్ళ వృద్ధుడు రెండు రోజులు వరుసగా ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలో నిలబడి ప్రాణాలు విడిచాడు. అప్పట్లో ఈ వార్త సంచలనం రేపింది.

అప్పుడు చెప్పులు.. ఇప్పుడు బుక్కులు...

బీఆర్ఎస్ హయాంలో యూరియా కోసం రైతులు క్యూ లైన్లో చెప్పులు పెడితే... ఇప్పుడు విత్తనాల కోసం రైతులు పాస్ బుక్కులు పెట్టారు. ఏ ప్రభుత్వం అయినా రైతులకి క్యూ లైన్ అగచాట్లు మాత్రం తప్పడం లేదు.

Read More
Next Story