Migration Threat to Hyderabad | వలసలతో మూడు నగరాల్లో పొంచి ఉన్న ముప్పు
x

Migration Threat to Hyderabad | వలసలతో మూడు నగరాల్లో పొంచి ఉన్న ముప్పు

పెరుగుతున్న భూతాపం,ప్రకృత్తివిపత్తులతో మూడు నగరాల్లో కాలుష్య,విపత్తు పరిస్థితులపై పర్యావరణ‌వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.హైదరాబాద్,బెంగళూరు,పూణెలకు ప్రమాదముంది.


వాతావరణ మార్పులు ముదిరే కొద్దీ హైదరాబాద్, బెంగళూరు, పూణె వంటి నగరాలకు వలసలు పెరిగే ప్రమాదం పొంచి ఉందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి హెచ్చరించారు. ప్రకృత్తి విపత్తులు తట్టుకోలేని ప్రాంతాల నుంచి లక్షలకొద్దీ జనాభా నగరాలకు వలస పోవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.నానాటికీ పెరుగుతున్న భూతాపం, తీవ్ర ప్రకృత్తి విపత్తులు వలసలకు దారి తీస్తాయని ఆయన పేర్కొన్నారు.ఇప్పటికే మూడు మెట్రోపాలిటన్ నగరాల్లో మౌలిక వసతుల లేమి కాలుష్యంతో సతమతమవుతున్న నేపథ్యంలో ఈ వలసలు పెను భారం మోపుతాయన్నారు.

- హైదరాబాద్, బెంగళూరు, పూణె నగరాల్లో ఇప్పటికే కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ వంటి సమస్యలతో ప్రజలు నివసించలేని పరిస్థితి కల్పిస్తున్నాయి.నగరీకరణ వేగవంతం కావడం, జనాభా పెరుగుదల కారణంగా ఇప్పటికే దేశంలోని పలు నగరాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ఇక వాతావరణ మార్పుల కారణంగా వలసలు పెరిగి సమస్య మరింత జటిలంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.మౌలిక వసతులు,వనరుల కొరత ఏర్పడుతుందని తెలంగాణ పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
- రాబోయే రెండు దశాబ్దాలలో దేశంలోని కొన్ని ప్రదేశాలు నివాసయోగ్యంగా మారిపోయే అవకాశం ఉందని, దీని ఫలితంగా భారీ వలసలు తప్పవని నిపుణులు అంచనా వేశారు.హైదరాబాద్‌, బెంగళూరు, పుణె వంటి నగరాల్లో ట్రాఫిక్‌ సమస్యలు,మంచినీటి కొరత,డ్రైనేజీ సమస్యలు, వాతావరణ కాలుష్యం వంటి కారణాల వల్ల కూడా జీవించడం అంత సులభం కాదని తెలంగాణ పర్యావరణ వేత్తలు ప్రొఫెసర్ పురుషోత్తంరావు, డాక్టర్ లుబ్నా సార్వత్, డబ్ల్యూజీ ప్రసన్నకుమార్ లు అభిప్రాయపడ్డారు.

తెలుగు రాష్ట్రాల్లో విపత్తులు
హైదరాబాద్‌ నగరం గతంలో కురిసిన భారీవర్షాల వల్ల ఏర్పడిన వరద ముప్పుతో విలవిలలాడింది.ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులతో వరదవిపత్తులు పెరుగుతున్నాయి. గతంలో లేని విధంగా నగరాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల వరదలు వెల్లువెత్తుతుండటంతో ప్రజల జీవన విధానాన్ని దెబ్బతీస్తున్నాయి. భారీగా ఆస్తి నష్టం సంభవిస్తోంది.2020వ సంవత్సరంలో హైదరాబాద్‌లో వచ్చిన వరదలతో తీవ్రంగా దెబ్బతింది. భవిష్యత్తులో ఈ తరహా వరదలు మరింత పెరిగే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.విజయవాడలో ఈ ఏడాది కురిసిన భారీ వర్షాల వల్ల కృష్ణా నది పొంగి ప్రవహించడంతో వరదనీరు విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. వరదల వల్ల విజయవాడలో భారీ ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది.

హైదరాబాద్ లో పెరుగుతున్న జనాభా
హైదరాబాద్ మహా నగరంలో 2024వ సంవత్సరం నాటికి జనాభా 11,068,900 మందికి పెరిగింది. 1950వ సంవత్సరంలో హైదరాబాద్ జనాభా 1,096,320. హైదరాబాద్ దక్షిణ భారత రాష్ట్రమైన తెలంగాణకు రాజధాని. హైదరాబాద్ మూసీ నది ఒడ్డున సరస్సుల చుట్టూ ఉంది. 2014వ సంవత్సరంలో హైదరాబాద్ జనాభా 8.7 మిలియన్లుగా ఉంది. 2018వ సంవత్సరానికి హైదరాబాద్ జనాభా 9 మిలియన్లకు పెరిగింది. ఇతర ప్రాంతాల నుంచి పెరిగిన వలసలతో గత పదేళ్లలో హైదరాబాద్ జనాభా 24 శాతం పెరిగింది. ఉపాధి కోసం వచ్చే వలసల వల్ల జనాభా ఏటేటా పెరుగుతోంది.2035వ సంవత్సరం నాటికి హైదరాబాద్ జనాభా 14,151,700 మందికి పెరిగే అవకాశముందని అంచనా వేశారు.2030వ సంవత్సరం నాటికి 12,713,900 మందికి జనాభా చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.
-
ప్రమాదంలో హైదరాబాద్ ప్రజల జీవనం : ప్రొఫెసర్ కె పురుషోత్తంరెడ్డి
హైదరాబాద్ నగరంలో మౌలిక వసతులు, వనరులు తక్కువగా ఉంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వలసల వల్ల నగరంపై ఒత్తిడి పెరుగుతుందని ప్రముఖ పర్యావరణ వేత్త ప్రొఫెసర్ కె పురుషోత్తం రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.హైదరాబాద్ నగరంలో ప్రజలకు కావాల్సిన కనీస వసతుల లేమి, ప్రజారవాణ, డ్రైనేజీ, మంచినీటి సరఫరా వ్యవస్థ లేక పెరిగిన జనాభాతో నగర జీవనం ప్రశ్నార్థకంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. ‘‘హైదరాబాద్ కాలుష్య నగరంగా మారడంతోపాటు భూముల ధరలు గణనీయంగా పెరిగాయి.మంచినీటి సరఫరా సజావుగా లేదు, చెత్త సేకరణ సక్రమంగా జరగక నగర జీవనం ప్రమాదంలో పడింది. నగరంలోని చెరువులు, కుంటలు కబ్జాల పాలయ్యాయి.భూగర్భజలాలు కలుషితం అయ్యాయి, పరిపాలన నిర్వహణ సరిగా లేక హైదరాబాద్ నగరంలో వలసలు పెరిగి ప్రజాజీవితం సురక్షితంగా లేదు. అందుకే మన నగరంలో సురక్షితంగా,సౌకర్యవంతంగా జీవనం గడిపేందుకు మన నగరాన్ని మనం కాపాడుకోవాలి’’అని పురుషోత్తం రెడ్డి కోరారు.

పూణేలో పెరుగుతున్న జనాభా
పూణే నగర జనాభా 2024వ సంవత్సరం నాటికి 7,345,850గా ఉంది. 1950వ సంవత్సరంలో పూణే జనాభా 580,848 మంది. పూణే గత సంవత్సరంలో 1,79,480 జనాభా పెరిగింది. మహారాష్ట్రలో రెండవ అతిపెద్ద నగరమైన పూణే ముఠా నదీ తీరంలో ఉంది. 2030వ సంవత్సరానికి పూణేలో జనాభా 8,441,560 మందికి పెరగవచ్చని నిపుణులు అంచనా వేశారు. 2035వ సంవత్సరం నాటికి పూణే జనాభా 9,396,310మందికి పెరుగుతుందని భావిస్తున్నారు.

నగరాల్లో పర్యావరణ సమతౌల్యతకు విఘాతం
హైదరాబాద్ తో పాటు పూణే, బెంగళూరు నగరాల్లోకి వలసల వల్ల జనాభా విపరీతంగా పెరుగుతోందని, దీనివల్ల పర్యావరణ సమతౌల్యతకు విఘాతం వాటిల్లుతుందని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ సోషల్ సైంటిస్ట్ డబ్ల్యూజే ప్రసన్నకుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. నగరాల్లో జనాభా సాంద్రత పెరిగితే వనరుల వినిమయం పెరుగుతుందని, కాలుష్యం, వ్యర్థాలు కూడా పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. వాతావరణ మార్పుల వల్ల ప్రకృతి వైపరీత్యాలు కూడా పెరుగుతాయని ప్రసన్న కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. విపత్తులను ఎదుర్కొనేలా ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించడంతోపాటు దాన్నీ అమలు చేయాలని ప్రసన్నకుమార్ సూచించారు.

బెంగళూరులో పెరిగిన జనసమ్మర్థం
బెంగళూరు నగరంలో ప్రస్థుతం జనాభా 14,008,300గా ఉంది. 1950వ సంవత్సరంలో బెంగళూరు జనాభా 745,999మంది. బెంగళూరు గత సంవత్సరంలో 4,00,500 జనాభా పెరిగింది. కర్ణాటక రాజధాని నగరమైన బెంగళూరు నగరం భారతదేశంలోని సిలికాన్ వ్యాలీ కావడంతో ఉపాధికోసం ఇతర ప్రాంతాల వారి వలసలు ఎక్కువగా ఉన్నాయి.దీని వల్ల బెంగళూరులో జనసమ్మర్థం పెరిగింది. 2030వ సంవత్సరం నాటికి బెంగళూరు నగర జనాభా 16,226,800కు పెరగవచ్చని నిపుణులు అంచనా వేశారు. 2035వ సంవత్సరానికి బెంగళూరు జనాభా 18,065,500 కావచ్చని అంచనా. పెరుగుతున్న జనాభా వల్ల వనరులు లేక సమస్యలు ఏర్పడనున్నాయి.

నిబంధనల ఉల్లంఘనలతోనే పెరుగుతున్న కాలుష్యం
హైదరాబాద్, పూణే, బెంగళూరు నగరాల్లో నిబంధనల ఉల్లంఘనలతోనే కాలుష్యం పెరుగుతుందని చెరువుల పరిరక్షణ యాక్టివిస్ట్ డాక్టర్ లుబ్నా సార్వత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. నగరాలకు జనం వలసల వల్ల సమస్య లేదని, కానీ పరిశ్రమలు నిబంధనలను ఉల్లంఘించి కాలుష్యాన్ని వెదజల్లుతుండటంతోనే అసలు సమస్యలు ఏర్పడుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. మూడు మహానగరాల్లో చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాల పాలయ్యాయని, దీనివల్ల నీటి సమస్యలు ఏర్పడ్డాయని ఆమె చెప్పారు. అధికారులు నిబంధనలు పాటించక పోవడం వల్ల నీరు, గాలి, భూమి కలుషితం అయిందని, భూగర్భజలాలు కూడా కలుషితం అయ్యాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. నగరాల్లో కాలుష్యం, ఇతర సమస్యలు ఏర్పడకుండా నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని డాక్టర్ లుబ్నా సార్వత్ డిమాండ్ చేశారు.



Read More
Next Story