అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులుల సందడి ప్రారంభం
x
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులి సంచారం

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులుల సందడి ప్రారంభం

అమ్రాబాద్ అభయారణ్యంలో పర్యటనకు వెళ్లిన డీఎఫ్ఓ గోపిడి రోహిత్ బృందానికి పులి కనిపించింది.


అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో (Amrabad Tiger Reserve) మూడు నెలల మేటింగ్ సీజన్ విరామం అనంతరం పులులు కనిపిస్తున్నాయి. మంగళవారం ఉదయం అటవీశాఖ జీపులో అమ్రాబాద్ అభయారణ్యంలో పర్యటనకు వెళ్లిన డీఎఫ్ఓ గోపిడి రోహిత్ (rohithgopidi)బృందానికి పులి కనిపించింది(Tiger sighting). అభయారణ్యంలో పులి దర్శనమివ్వడంతో అటవీశాఖ బృందం సంభ్రమాశ్యర్యాలకు గురైంది. తమ అభయారణ్యంలో పులులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ డీఎఫ్ఓ గోపిడి రోహిత్ మంగళవారం ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధికి చెప్పారు. అటవీశాఖ బృందం చూసిన పులి వీడియోను తీసి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. అడవిలో పరిశీలనకు వెళ్లిన అటవీ శాఖ అధికారులకు పులి కనిపించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.




సఫారీ యాత్ర బృందానికి కనిపించిన పులి

అమ్రాబాద్ టైగర్ రిజర్వులో (Amrabad forest) సఫారీ యాత్రకు వెళ్లిన వన్యప్రాని ప్రేమికుల బృందానికి చారల మెరుపుతో కూడిన పులి దర్శనమిచ్చింది. మూడు నెలల విరామం తర్వాత తాము అడవి ప్రాంత సందర్శనకు వస్తే పులి కనిపించడం తమకు సంతోషాన్నిచ్చిందని పర్యాటకులు చెప్పారు.మూడు నెలల విరామం తర్వాత సఫారీ యాత్రకు వచ్చిన పర్యాటకులు పులి దర్శనం పొందినందుకు ఆనందం వ్యక్తం చేశారు. పులి చారల మెరుపుతో కనిపించడం గొప్ప అనుభూతి అని పేర్కొన్నారు.



అడవిలో పులుల గర్జన

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఎకోటూరిజంలో భాగంగా సఫారీ యాత్రకు వెళ్లిన పర్యాటకులకు అడవిలో పులుల గర్జన(Roar of Tigers) వినిపించింది. దీంతో అమ్రాబాద్ అడవిలో పులుల సంచారం పెరిగిందని పర్యాటకులు చెప్పారు. పులుల సంతానోత్పత్తికి అమ్రాబాద్ అటవీ ఫ్రంట్‌లైన్ సిబ్బంది చేసిన కృషి వల్ల పులుల గర్జన అమ్రాబాద్ అడవిలో ప్రతిధ్వనిస్తుందని హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ వ్యవస్థాపకులు ఇమ్రాన్ సిద్ధిఖీ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



సఫారీ యాత్రకు రండి

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో సీజన్‌ ఆరంభంలోనే పులి ప్రత్యక్షం కావడంతో సఫారీ యాత్రలకు పర్యాటకుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. పులులే కాదు ఇతర వన్యప్రాణులు కూడా కనిపిస్తున్నాయి.తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఎకో-టూరిజం బ్రాండ్ ది డెక్కన్ వుడ్స్ అండ్ ట్రైల్స్ తో కొత్త సీజన్ ప్రారంభించామని సఫారీ యాత్ర మేనేజర్ అఖిల్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. అక్టోబర్ 1 నుంచి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లోని మన్ననూర్ జంగిల్ రిసార్ట్‌లో సఫారీ యాత్ర కోసం తరలిరావాలని వన్యప్రాణి ప్రేమికులను ఆయన సూచించారు.

పులుల గర్జనతో మార్మోగుతున్న ఈ అడవి ఇప్పుడు వన్యప్రాణి ప్రేమికులకు, పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.సఫారీ సీజన్ ప్రారంభ దశలోనే పులులు ప్రత్యక్షమవుతుండటంతో సఫారీ యాత్రలకు స్పందన పెరుగుతోంది. ప్రకృతిని సజీవంగా చూడాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ అడవిని తప్పక సందర్శించాలని అటవీశాఖ సూచిస్తోంది.



Read More
Next Story