తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య రాజుకున్న ప్రొటోకాల్ రగడ
x

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య రాజుకున్న ప్రొటోకాల్ రగడ

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య ప్రొటోకాల్ రగడ రాజుకుంది. అధికార కార్యకమాల్లో కాంగ్రెస్ నేతల ఆధిపత్యం చలాయిస్తున్నారంటూ ఫిర్యాదులు.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రభుత్వం అవమానిస్తోందని, ప్రొటోకాల్ విషయంలో తీవ్ర వివక్ష చూపిస్తోందని అసెంబ్లీ స్పీకర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు.కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయినా కూడా నియోజకవర్గాల్లో వారి పెత్తనమే కొనసాగుతోందని బీఆర్ఎష్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.


కేసీఆర్‌ను అవమానించే ప్రయత్నం
స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా అధికారులు ముద్రించిన ఆహ్వాన పత్రికలో ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ పేరును విశిష్ఠ అతిధిగా కాకుండా గౌరవ అతిథిగా ఎమ్మెల్యేల జాబితాలో పెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిాగా తెలంగాణ రాష్ట్ర సలహాదారు కేశవరావును పిలిచి ఆయనతో జెండా ఎగురవేయించారు. మెదక్‌ జిల్లా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పంపిన ఆహ్వానపత్రంలో కేబినెట్ మంత్రుల పేర్లను అనుసరించేలా ప్రతిపక్ష నాయకుడి పేరును ముద్రించాలి. కాని ప్రొటోకాల్‌ ప్రకారం కాకుండా కేసీఆర్ పేరు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల పేర్లతో ఉండడంతో అసలు సమస్య తలెత్తింది.

బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం
ప్రొటోకాల్ ప్రకారం ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ పేరును మంత్రుల సరసన కాకుండా ఎమ్మెల్యేల జాబితాలో ఆహ్వానపత్రికలో పెట్టడంపై బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.ప్రోటోకాల్ ఉల్లంఘిస్తూ ఆహ్వానపత్రికను ముద్రించడంపై మెదక్ జిల్లా యంత్రాంగం,రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు.తెలంగాణ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా, ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు ఎంపీగా పనిచేసిన కేసీఆర్ పేరును ఆహ్వాన పత్రికలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కంటే కిందకు ముద్రించారు.

సిగ్గు, సిగ్గు అంటూ బీఆర్ఎస్ ట్వీట్
దిగజారుడుతనంలో అధికార పార్టీ పరాకాష్టకు చేరుకుందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది.తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ పేరుని ఆహ్వాన పత్రికలో చివర్లో పెట్టి తమ కుంచిత స్వభావాన్ని మరోసారి బయపెట్టుకుందని రేవంత్ సర్కారును విమర్శించింది.

ప్రోటోకాల్ సరిచేసిన సర్కార్
మెదక్ జిల్లా అధికారులు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముద్రించిన ఆహ్వాన పత్రికను సవరించారు.ప్రొటోకాల్ ను సరిచేస్తూ మంత్రుల పేర్ల వద్ద ప్రతిపక్ష నేత కేసీఆర్ పేరు ఉండేలా సవరించారు.కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీ సోషల్ మీడియా ప్రచార దెబ్బకు దిగివచ్చి, తప్పు ఒప్పుకుని ప్రోటోకాల్ సరిచేసిందని బీఆర్ఎస్ నాయకుడు భానుప్రకాష్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

పోలీసులు ప్రొటోకాల్ ఉల్లంఘనపై బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదు
ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలీసులు ప్రొటోకాల్ ను ఉల్లంఘించారని బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ తాజాగా తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు.పోలీసులు కాంగ్రెస్ నేతలకు వత్తాసు పలుకుతున్నారని ఎమ్మెల్యే పాయల శంకర్ ఆరోపించారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డిని డీఎస్పీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్ఐలు కలవడంపై వీడియో క్లిప్పింగులతో తాను డీజీపీకి ఫిర్యాదు చేశానని ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

ఎన్నెన్నో ప్రొటోకాల్ ఉల్లంఘనలు
- నారాయణ పేట మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఇటీవల ప్రొటోకాల్ రగడ రాజుకుంది. ప్రాథమిక వ్యవసాయ సంఘం భవనం ప్రారంభోత్సవ శిలాఫలకంపై కాంగ్రెస్ మండలాధ్యక్షుడి పేరు ఎలా పెడతారని బీజేపీ నేత, ఎంపీ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి పేరును ఎలా మరుస్తారని అరుణ ప్రశ్నించారు.
- అధికారిక కార్యక్రమం ఫ్లెక్సీలో సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఫొటో లేదంటూ ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు.బోనాల పండుగ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే పద్మారావు ఫోటో లేకుండా ప్రోటోకాల్ ఉల్లంఘించారని బీఆర్ఎస్ కార్పొరేటర్ సామల హేమ ఆందోళన చేశారు.
-ఖిల్లా మైసమ్మ బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రొటోకాల్ రచ్చ రాజుకుంది. బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం ఇంచార్జ్ కిచ్చనగారి లక్ష్మారెడ్డిని వేదిక పైకి పిలిచారు. దీంతో ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థులనూ వేదిక వద్దకు రానివ్వద్దని సబితా ఇంద్రారెడ్డి అభ్యంతరం తెలిపారు.
- అసిఫాబాద్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం ప్రారంభంలో డీసీసీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి అజ్మీరా శ్యాంనాయక్ పాల్గొనడాన్ని స్థానిక అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మీ వ్యతిరేకించారు. ప్రొటోకాల్ ను ఉల్లంఘించి కాంగ్రెస్ నాయకులను పిలిచారని కోవాలక్ష్మి ఆందోళన చేశారు.
- కొమురవెల్లి మల్లికార్జునస్వామి కళ్యాణం, బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన సమన్వయ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ అధికారిక సమావేశంలో జనగామలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కూర్చొవడంపై పల్లా రాజేశ్వరరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. బయట జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాయకులు పాల్గొంటే తప్పేమీ లేదని మంత్రి సురేఖ సమాధానం ఇచ్చారు. దీంతో సమావేశాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి బహిష్కరించారు.
- నాగర్ కర్నూల్ ప్రభుత్వ పాఠశాల ప్రారంభోత్సవంలో ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగిందని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఆరోపించారు.స్కూలు భవనాన్ని నిర్మిస్తే మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో ప్రారంభిస్తారా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఆదేశంతో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
- జూబ్లీహిల్స్ లో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ నేత, కార్పొరేటర్ బాబా ఫిసియుద్దీన్ అనారోగ్యం కారణంగా ఆయన రాలేక పోవడంతో అతని స్థానంలో భార్య రావడంతో, కాంగ్రెస్ నాయకులు అధికారిక కార్యక్రమంలో ఎలా పాల్గొంటారని ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

Read More
Next Story