అమ్రాబాద్ అభయారణ్యంలో పెరిగిన చిరుత పులుల సంఖ్య
x
జూపార్కులో చిరుతపులి క్వారంటైన్

అమ్రాబాద్ అభయారణ్యంలో పెరిగిన చిరుత పులుల సంఖ్య

హైదరాబాద్ శివార్లలోని ఇక్రిశాట్ క్షేత్రంలో సంచరించిన చిరుతపులిని బోనులో బంధించి జూపార్కులో వైద్యపరీక్షలు చేయించి, అమ్రాబాద్ అభయారణ్యంలో వదిలేశారు.


హైదరాబాద్ నగర శివార్లలోని ఇక్రిశాట్ వ్యవసాయ క్షేత్రంలో బోనులో చిక్కిన చిరుతపులిని ఒక రోజు పాటు హైదరాబాద్ లోని జంతుప్రదర్శన శాలకు తరలించి క్వారంటైన్ లో ఉంచి పశువైద్యాధికారులు వైద్యపరీక్షలు చేశారు. ఈ వైద్య పరీక్షల్లో చిరుతపులి ఆరోగ్యంగా ఉందని తేలడంతో అటవీశాఖ అధికారులు శుక్రవారం తెల్లవారుజామున అమ్రాబాద్ పులుల అభయారణ్యంలోని గుండం ప్రాంత అడవుల్లో వదిలేశారు.(Leopards Enter the AMRABAD Sanctuary)


చిరుతపులి ప్రయాణం ఇలా...
ఏప్రిల్ 10: హైదరాబాద్ నగర శివార్లలోని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ప్రాంతంలోని ఇక్రిశాట్ వ్యవసాయ పరిశోథనా కేంద్రం ఆరు సంవత్సరాల వయసుగల మగ చిరుతపులి ప్రత్యక్షమైంది. వారం రోజుల పాటు ఇక్రిశాట్ పొలాల్లో సంచరించిన చిరుతపులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ఉచ్చు బోన్లను ఏర్పాటు చేశారు.
ఏప్రిల్ 16 : ఇక్రిశాట్ లో బోనులో చిక్కిన చిరుతపులిని హైదరాబాద్ నగరంలో నెహ్రూ జూపార్కుకు తరలించారు. జూపార్కును చిరుతను జూలోని క్వారంటైన్ బ్లాక్‌లో ఉంచి పరిశీలించిన పశు వైద్యాధికారులు అడవిలో వదిలేందుకు అనువుగా ఉందని ధ్రువీకరించారు.
ఏప్రిల్ 18 : ఇక్రిశాట్ చిరుతను అటవీశాఖ అధికారులు బోనులో అమ్రాబాద్ పులుల అభయారణ్యంలోని గుండం దట్టమైన అటవీ ప్రాంతానికి శుక్రవారం తెల్లవారుజామున తీసుకువెళ్లి బోను తెరవగా చిరుతపులి చెంగున దూకుతూ అడవిలోకి వెళ్లింది.



ఇక్రిశాట్ లో చిరుతపులిని రక్షించారు...

ఇక్రిశాట్ వ్యవసాయ క్షేత్రంలో వారం రోజుల పాటు సంచరించిన చిరుతపులిని సంగారెడ్డి జిల్లా అటవీ అధికారి శ్రీధర్ రావు నేతృత్వంలో అటవీశాఖ అధికారుల బృందం బోనులో బంధించింది. ఆరు సంవత్సరాల వయస్సు గల మగ చిరుతపులిగా గుర్తించారు. వారం రోజుల క్రితం సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన చిరుతపులిని గుర్తించి బోన్లు ఏర్పాటు చేసి
పట్టుకున్నారు.

క్వారంటైన్ లో చిరుత పరిశీలన
చిరుత పులిని పట్టుకున్న అటవీశాఖ అధికారులు దాన్ని సమగ్ర వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు సురక్షితంగా తరలించారు.రక్షించిన చిరుతపులిని జూలోని క్వారంటైన్ బ్లాక్‌లో నిశిత పరిశీలన జరిపామని నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ జె వసంత ధృవీకరించారు.పశువైద్యుల బృందం చిరుతపులి మంచి స్థితిలో ఉందని, తిరిగి అడవిలోకి వదలడానికి తగినదని ప్రాథమిక ఆరోగ్య నివేదికను అందజేశారు. ఇక్రిశాట్ క్యాంపస్ నుంచి రక్షించి తీసుకువచ్చిన చిరుత పులిని హైదరాబాద్‌లోని జూపార్కు డిప్యూటీ డైరెక్టర్ (వెటర్నరీ)డాక్టర్ ఎం.ఎ. హకీమ్ నేతృత్వంలోని వెటర్నరీ డాక్టర్ల బృందం పర్యవేక్షణలో పరిశీలన కోసం క్వారంటైన్ బ్లాక్‌లో ఉంచి పరిశీలించారు.తమ పశువైద్యుల ప్రాథమిక నివేదిక ప్రకారం చిరుతపులి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తేలిందని జూపార్కు డిప్యూటీ డైరెక్టర్ (వెటర్నరీ)డాక్టర్ ఎం.ఎ. హకీమ్ ‘ఫెడరల్ తెలంగాాణ’కు చెప్పారు.



అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోకి విడుదల

పటాన్‌చెరులోని ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది సెమీ-అరిడ్ ట్రాపిక్స్ (ఇక్రిశాట్) క్యాంపస్‌లో దాదాపు వారం రోజులుగా తిరుగుతున్న మగ చిరుతను అటవీ అధికారులు విజయవంతంగా పట్టుకుని అడవిలోకి వదిలారు.శుక్రవారం తెల్లవారుజామున నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో చిరుతను సురక్షితంగా వదిలిపెట్టారు.

ఇక్రిశాట్ లో మరో పులి కోసం అన్వేషణ
ఇక్రిశాట్ క్యాంపస్‌లో రెండు చిరుతపులులు కనిపించాయని సిబ్బంది నివేదించిన తర్వాత తెలంగాణ అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. అటవీశాఖ అధికారులు
30 నుంచి 40 నిఘా కెమెరాలను మోహరించి, మేకలను ఎరగా ఉంచి రెండు ట్రాప్ బోనులను ఏర్పాటు చేశారు. ఒక చిరుత దొరకగా, మరో చిరుత కోసం గాలిస్తున్నామని అటవీశాఖ అధికారి శ్రీధర్ రావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ ప్రాంతంలో మరో చిరుతపులి ఉన్నట్లు అనుమానిస్తున్నందున, తాము క్యాంపస్‌ను పర్యవేక్షిస్తూనే ఉన్నామన్నారు.

అమ్రాబాద్ అభయారణ్యంలో పెరిగిన చిరుతల సంఖ్య
అమ్రాబాద్ అభయారణ్యంలోని గుండం ప్రాంతంలో ఇక్రిశాట్ చిరుతపులిని వదిలేశామని అమ్రాబాద్ డీఎఫ్ఓ గోపిడి రోహిత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. దీంతో అమ్రాబాద్ లో చిరుతపులుల సంఖ్య 175కు పెరిగాయని ఆయన తెలిపారు. ఎక్కవ చిరుత దొరికినా అమ్రాబాద్ అడవిలోనే వదిలివేస్తున్నామని ఆయన చెప్పారు. గతంలో శంషాబాద్, నారాయణపేట, ఫార్మాకంపెనీల్లో దొరికిన ఏడు చిరుతపులులను అమ్రాబాద్ అడవుల్లోనే వదిలేశామని రోహిత్ చెప్పారు. అమ్రాబాద్ అభయారణ్యం పులులే కాదని చిరుత పులుల సంఖ్య కూడా 175కు పెరిగిందని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (National Tiger Conservation Authority) గణాంకాలు వెల్లడించాయని చెప్పారు.




Read More
Next Story