హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు, ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అసద్ కు నిత్యకృత్యంగా మారింది.
- పార్లమెంట్ ఎన్నికల అనంతరం 5వసారి ఎంపీగా ఎన్నికైన అసదుద్దీన్ పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ‘జై పాలస్తీన్’ అంటూ నినాదాలు చేసి వివాదం రేపారు.
- ఈ ఘటన తర్వాత ఇటీవల ఢిల్లీలోని ఎంపీ అసద్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు మరోసారి దాడి చేశారు.గుర్తుతెలియని వ్యక్తులు అశోక్ రోడ్డులోని ఆయన నివాసంపై దాడి చేసి, ఇంటి నేమ్ ప్లేట్, గేటుపై నల్ల ఇంకు చల్లి ఆయన పేరు కనిపించకుండా చేశారు.భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్ అంటూ నినాదాలు రాసి ఉన్న పోస్టర్లను ఆయన ఇంటి గోడలకు అతికించారు.
అసదుద్దీన్ నాలుక కోస్తే రివార్డు.. మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే
లోక్‌సభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో ఒవైసీ ‘జై పాలస్తీనా’ అంటూ నినాదాలు చేయడంపై మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నాలుకను కోస్తే రివార్డు ఇస్తామని మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే నితీష్ రాణే రివార్డ్ ప్రకటించారు. పాక్ పార్లమెంట్‌లో ఎవరైనా జై శ్రీరామ్ లేదా వందేమాతరం అంటూ నినాదాలు చేసి ఉంటే, వారు ప్రాణాలతో బయటికి వచ్చేవారు కాదని రాణే మీడియాతో చెప్పారు. ‘‘కానీ మన పార్లమెంటులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం నడిచే దేశంలో శత్రు దేశాలు లేదా తీవ్రవాదులకు మద్ధతుగా నినాదాలు వింటున్నాం. ఈ నినాదాలు చేసే వ్యక్తులను పార్లమెంటు నుంచి రెండు కాళ్లతో బయటకు రానివ్వకూడదు.పాకిస్తాన్ లేదా చైనా ప్రజలు తమ పార్లమెంట్‌లలో ఇలాంటి నినాదాలను అనుమతించరు’’ అని రాణే చెప్పారు. ‘‘అసదుద్దీన్ ఒవైసీ నాలుక కోసి నా దగ్గరకు తీసుకురండి, నేను మీకు బహుమతి ఇస్తాను.జై పాలస్తీనా అంటూ పార్లమెంటు నుంచి ఒవైసీ స్వేచ్ఛగా ఎలా వెళ్లిపోయారు? ఇలాంటి పని చేసే వ్యక్తిని ఏ దేశం కూడా సజీవంగా వదలదు’’ అన్నారాయన.
నా ఇంటిపై ఎన్నిసార్లు దాడి చేస్తారు? : అసదుద్దీన్ ట్వీట్
కొంతమంది గుర్తు తెలియని దుండగులు నా నేమ్ ప్లేటుపై నల్ల ఇంకుతో దాడి చేశారు. నా ఢిల్లీ నివాసాన్ని ఎన్నిసార్లు లక్ష్యంగా చేసుకుంటారు? అని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.దాడిపై తాను ఢిల్లీపోలీస్ అధికారులను అడిగినప్పుడు, వారు నిస్సహాయత వ్యక్తం చేశారు.హోంశాఖ మంత్రి అమిత్ షా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఢిల్లీ పోలీసులను ట్యాగ్ చేసి ఎంపీల భద్రతకు హామీ ఇవ్వలేరా అని అసద్ ప్రశ్నించారు. అసదుద్దీన్ ను అనర్హుడిగా ప్రకటించాలి...
విధ్వంసకారులు అసదుద్దీన్ నివాసం ప్రధాన ద్వారం వెలుపల ఉన్న నేమ్‌ప్లేట్‌పై నల్ల ఇంక్ పూశారు.అసద్ ఇంటి చిరునామా ప్లేట్‌పై ‘ఐ స్టాండ్ విత్ ఇజ్రాయెల్’ ‘భారత్ మాతా కీ జై’ నినాదాలతో కూడిన పోస్టర్‌ను అతికించారు.పోస్టర్‌పై ఒవైసీని రెండు చేతుల మధ్య తల ఉంచి అవమానకరమైన రీతిలో చిత్రీకరించారు. ఒవైసీని పార్లమెంటు సభ్యునిగా అనర్హుడిగా ప్రకటించాలని గుర్తుతెలియని వ్యక్తులు డిమాండ్ చేశారు.
- ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రధానంగా మైనారిటీల చుట్టూ కేంద్రీకృతమై రాజకీయాలు చేస్తుంటారు. ఈ కారణంగా ఒవైసీపై తరచూ వివాదాలు తలెత్తుతుంటాయి.
వివాదాలెన్నో...
2019 సంవత్సరంలో హైదరాబాద్‌లో ఉగ్రవాద కార్యకలాపాల విస్తరణకు అసదుద్దీన్ ఒవైసీ కారణమని ఇతని రాజకీయ ప్రత్యర్థి అయిన బీజేపీకి చెందిన జి కిషన్ రెడ్డి ఆరోపించారు. దేశంలో జరిగిన చాలా ఉగ్రవాద సంఘటనల్లో హైదరాబాద్ వాసుల ప్రమేయం ఉందని కిషన్ రెడ్డి ఆరోపించారు.
- 2016వ సంవత్సరంలో ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్ట్ సెల్ కు చెందిన ఐదుగురు సభ్యులకు న్యాయ సహాయం అందించిన తర్వాత ఒవైసీని దేశద్రోహ నేరం కింద అరెస్టు చేశారు. - గుజరాత్‌లోని హరేన్ పాండ్యా కేసులో నిందితులు హైదరాబాద్ నగరానికి చెందినవారని, వారికి ఒవైసీ ఆర్థికంగా మద్దతు ఇస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ గతంలో ఆరోపించారు.
- యూపీలో ఎన్నికల ప్రచారం చేస్తున్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పులు జరిపారు. ఈ ఫైరింగ్‌లో ఆయనకెలాంటి ప్రమాదం వాటిల్లలేదు.ఒవైసీ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ఓ కారు మాత్రం పంక్చరైంది.
ఆరోపణలు...ప్రత్యారోపణలు
ముహమ్మద్ ప్రవక్తపై సయ్యద్ వసీం రిజ్వీ రాసిన పుస్తకంలో ముస్లింల మతపరమైన మనోభావాలను కించపర్చారని ఒవైసీ ఫిర్యాదు చేశారు. దీంతో ఒవైసీ ముస్లిం యువకులను సమూలంగా మార్చారని, మజ్లిస్ పార్టీ ద్వారా ఒవైసీ ముస్లిం యువకులను తప్పుదారి పట్టిస్తున్నారని రిజ్వీ ప్రత్యారోపణలు చేశారు. అసద్ ముస్లిమేతర సమాజానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాడని అని రిజ్వీ ఆరోపించారు.ఒవైసీ ఫిర్యాదుతో హైదరాబాద్‌లోని ముస్లింలు వసీం దిష్టిబొమ్మను దహనం చేశారు.
భారత్ మాతా కీ జై అనే నినాదాన్ని ఎప్పటికీ చెప్పను...
భారత్ మాతాకీ జై అని చెప్పాలని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై అసదుద్దీన్ స్పందించారు. 2016 వ సంవత్సరం మార్చిలో మహారాష్ట్రలో జరిగిన ఒక బహిరంగ ర్యాలీలో ఒవైసీ మాట్లాడుతూ,తాను భారత్ మాతా కీ జై అనే నినాదాన్ని ఎప్పటికీ చెప్పనని అన్నారు.'భారత్ మాతా కీ జై' అని చెప్పాలని రాజ్యాంగంలో ఎక్కడా చెప్పలేదని అసద్ వ్యాఖ్యానించారు.
అసదుద్దీన్ ఒవైసీ, అతని తమ్ముడు అక్బరుద్దీన్‌తో కలిసి 2005వ సంవత్సరంలో మెదక్ జిల్లా కలెక్టర్‌పై అసభ్యంగా ప్రవర్తించినందుకు వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అసద్ ను 2013 జనవరి 20వతేదీన 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించి,సంగారెడ్డి జైలుకు తరలించారు.మెదక్ జిల్లాలో రహదారి విస్తరణ కోసం మసీదు కూల్చివేతకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.దీనిపై పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
కేసులెన్నో...
2009వ సంవత్సరంలో మొఘల్‌పురా ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పోలింగ్ ఏజెంట్ సయ్యద్ సలీముద్దీన్‌ను వెంబడించి కొట్టినందుకు భారత ఎన్నికల సంఘం ఆదేశం మేరకు ఒవైసీపై కేసు నమోదు చేశారు.2013వ సంవత్సరం మార్చిలో కర్నాటక రాష్ట్రంలోని బీదర్‌లో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడం, లైసెన్స్ లేకుండా తుపాకీని తీసుకెళ్లడంపై అసదుద్దీన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2014వ సంవత్సరంలో జూన్ నెలలో ఒవైసీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగం చేశారు. 2016వ సంవత్సరంలో ఫిబ్రవరి 7వతేదీన కాంగ్రెస్ నాయకులపై దాడి కేసులో ఒవైసీ హైదరాబాద్ పోలీసుల ముందు లొంగిపోయారు.