అనుకున్న కాలంలోనే పరీక్ష నిర్వహించి, మార్కులను ప్రకటించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివాదాలకు తెరలేపింది. తెలుగు మీడియం వాళ్లకు మార్కులు తక్కువగా ఇచ్చారని, ఇంగ్లీష్ మీడియం వాళ్లని నెత్తిన పెట్టుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ వివాదం ఇలా కొనసాగుతూ ఉండగానే మార్కుల్లో మోసాలు, ఫోర్జరీ జరిగిందని, రీ కౌటింగ్ లో మార్కులు తగ్గించారని వదంతులు బయటకు వచ్చాయి.
ఈ వివాదంపై రాష్ట్ర హైకోర్టులో 19 పిటిషన్లు దాఖలయ్యాయి. నిన్న జరిగిన విచారణలో జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు వాదనలు విన్నారు. రీకౌంటింగ్ చేస్తే మార్కులు తగ్గిన అభ్యర్థుల వివరాలను అఫిడవిట్ రూపంలో తమ ముందు పెట్టాలని ఆదేశించారు.
ప్రస్తుతం జరుగుతున్న ధృవపత్రాల పరిశీలన చేసుకోవచ్చని, అయితే తుది నియమాకాలు మాత్రం ఇప్పడే చేపట్టవద్దని ఆదేశించింది. విచారణను ఈ నెల 28 కి వాయిదా వేసింది.
ప్రధాన వివాదం ఏంటీ?
గ్రూప్- 1 మూల్యాంకనంలో చాలా తప్పులు జరిగాయని, ఈ విషయంపై స్వతంత్య్ర దర్యాప్తు అవసరమని కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా రెండు సెంటర్ల నుంచే ఎక్కువ స్థాయిలో అభ్యర్థులు ఉద్యోగానికి ఎంపిక అయినట్లు తెలిసిందని వీరి సంఖ్య ప్రకారం చూస్తే 12 శాత కంటే ఎక్కువగా ఉండటంపై సందేహం వ్యక్తం చేశారు.
అలాగే అభ్యర్థుల సంఖ్య మొదట ప్రకటించిన దానికి, తరువాత ప్రకటించిన దానికి తేడా ఉందని, సెంటర్ల సంఖ్య పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పేపర్ల మూల్యాంకనంలో రిటైర్డ్, ప్రయివేట్ వ్యక్తులతో పేపర్లు వాల్యుయేషన్ చేయించారని ఆరోపించారు. ప్రిలిమ్స్, మెయిన్స్ హల్ టికెట్ నంబర్లు వేరుగా ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో ప్రశ్నల పరంపర
గ్రూప్ వన్ ఉద్యోగాలకు సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పటికే అనేక పోస్టులు వస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు వీటిని అమ్ముకున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
తెలంగాణ నిరుద్యోగులు అనే హ్యండిల్ నుంచి వచ్చిన ఓ పోస్ట్ ను పరిశీలిస్తే..మార్చి 13, 2025 నాటి టీజీపీఎస్సీ వెబ్ నోట్ లో ఉర్దూలో పరీక్ష రాసిన వ్యక్తుల సంఖ్య తొమ్మిది ఉండగా, మార్చి 15 నాటి వెబ్ నోట్ లో మాత్రం 10 అని విడుదల చేసింది.
రెండు రోజుల్లో కొత్త వ్యక్తిని ఎలా జతచేశారని చేసిన ఈ పోస్ట్ హైలైట్ అయింది. అలాగే మొత్తం మెయిన్స్ పరీక్ష రాసిన వ్యక్తుల సంఖ్య మొదట ప్రకటించిన దానికి, తరువాత విడుదల చేసిన గణాంకాలకు మధ్య 16 మంది పెరిగినట్లు కమిషన్ విడుదలు చేసిన గణాంకాలు తెలియజేస్తున్నాయని సదరు పోస్ట్ ఆరోపిస్తూ.. స్వతంత్య్ర దర్యాప్తు అవసరమని డిమాండ్ చేసింది.
టీజీపీఎస్సీ అస్పరెంట్స్ అనే మరో పోస్టు లో.. టీజీపీఎస్సీ తన విశ్వసనీయతను కోల్పోయిందని ఆక్షేపించింది. గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లు ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహించే జేఈఈ, మిగిలిన గ్రూప్స్ పరీక్షలతో పోల్చడం కేవలం అభ్యర్థులను తప్పుదారి పట్టించడానికే అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కమిషన్ అడ్డదారులు తొక్కుతుందన్నారు. ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష రాసిన చాలామంది కూడా డిస్క్రిప్టివ్ పద్దతిలో కాకుండా కేవలం పాయింట్ల వైస్ గా రాశారని ఆరోపించారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష, యూపీఎస్సీ పరీక్షలతో పోల్చాలని ఎటుకాకుండా ఇలా ఆబ్జెక్టివ్ పద్దతిలో పరీక్ష రాసే వాళ్లని ఎందుకు ఎంకరేజ్ చేసేలా ప్రకటనలు ఇస్తున్నారని ఆక్షేపించింది.
ఈ వివాదం పై జ్యోతి(పేరు మార్చాము) అనే అభ్యర్థిని ఫెడరల్ తో మాట్లాడారు. ‘‘నేను తెలుగు మీడియంలో పరీక్ష రాశాను. అన్ని పేపర్లు డిస్క్రిప్టివ్ పద్దతిలోనే చాలా చక్కగా రాశాను. అయితే నేను అనుకున్నంత స్కోర్ రాలేదు.
నాకు తెలిసిన సమాచారం ప్రకారం చాలా మంది పాయింట్ల వైస్ గా రాశారని, వారికే ఎక్కువ మార్కులు వచ్చినట్లు చెబుతున్నారు. అలాగే తెలుగు మీడియంలో నాతో పాటు పరీక్ష రాసిన చాలామందికి మంచి మార్కులు రాలేదు.
కొంతమంది బ్రిలియంట్.. చాలా సంవత్సరాలుగా మెయిన్స్ కు సిద్దం అయ్యారు. కానీ వారు అనుకున్న మార్కులు సాధించలేకపోయారు. కేవలం తెలుగులో పరీక్ష రాసినందుకే ఇలా మార్కులు తక్కువ వేస్తారా? ’’ అని ప్రశ్నించారు.
హైకోర్టు ఇచ్చే తీర్పు పై మాకు నమ్మకం ఉందని చెప్పారు. కచ్చితంగా ఇంగ్లీష్ మీడియం వాళ్లవి, తెలుగు మీడియం వాళ్ల పేపర్లు పక్కపక్కన పెట్టి రీ వాల్యూయేషన్ చేస్తే పూర్తి నిజాలు బయటకు వస్తాయని అభిప్రాయపడ్డారు.
కొంతమంది అయితే అన్ని సబ్జెక్ట్ లలో కలిపి కనీసం వందమార్కులు తగ్గాయని చెప్పారు. అందువల్ల అనుకున్న ర్యాంక్ రాకపోవడంతో చాలా డిప్రెషన్ లోకి వెళ్లారని తెలిపారు. పారదర్శకంగా పేపర్లు వాల్యూయేషన్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ వివాదంలో ఓ మాజీ ఐఏఎస్ అధికారి చేసిన పోస్ట్ తీవ్ర కలకలం రేపింది. తనకు తెలిసిన అభ్యర్థికి సివిల్స్ ఎస్సే పేపర్ లో 120 మార్కులు వచ్చాయని, కానీ టీజీపీఎస్సీ నిర్వహించిన ఎస్సే పేపర్ లో కేవలం 47 మార్కులు వచ్చాయని.. ఇందేంటనీ ఆయన ప్రశ్నించారు. సదరు అభ్యర్థికి ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ లో 121 మార్కులు వచ్చాయని వెల్లడించారు. ఇవన్నీ కూడా కమిషన్ పై అనుమానాలు పెంచాయి.
ప్రభుత్వాలు మారిన.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిస్థితి అదే..
ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా.. ప్రస్తుత తెలంగాణ సర్వీస్ కమిషన్ అయినా దాని పనితీరులో మార్పు రావడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించిన గ్రూప్ 1 నోటిఫికేషన్ పరీక్ష కోసం దాదాపు దశాబ్ధం పాటు అభ్యర్థులు వేచి చూడాల్సి వచ్చింది.
ప్రిలిమ్స్ లో తప్పులు జరిగాయని వివాదం కోర్టుకు చేరడంతో దాదాపు ఏడు సంవత్సరాలు హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసు నడిచింది. ఎట్టకేలకు 2017 లో కేసుపై సుప్రీంకోర్టు తుది తీర్పు చెప్పింది. 2011 లో జరిగిన మెయిన్స్ ను రద్దు చేసింది.
ఈ పరిణామంతో 2018 లో తిరిగి పరీక్ష నిర్వహించి ఫలితాలు ప్రకటించారు. అయితే ఇక్కడ కూడా మరోసారి వివాదం తలెత్తింది. మొదటి ప్రకటించిన ర్యాంకులను, తరువాత అప్పటి టీఎస్పీఎస్సీ రద్దు చేసి కొత్త ర్యాంకులు వెల్లడించింది. సాప్ట్ వేర్ లో లోపం వల్ల ఈ విధంగా జరిగిందని తెలిపింది.
కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో విడుదల చేసిన అనేక నోటిఫికేషన్లలో ఇలాంటి వివాదాలు తలెత్తాయి. దీనివల్ల అభ్యర్థులు సమయం వృథా కావడం, కోచింగ్ సెంటర్లు పండగ చేసుకోవడం జరిగింది.
తాజాగా నిర్వహించిన గ్రూప్ 2 పరీక్ష ఏకంగా నాలుగు సార్లు వాయిదా వేశారు. గ్రూప్ 3 పరీక్ష తేదీలను సంవత్సరం తరువాత కానీ విడుదల చేయలేకపోయారు. చిన్న గొడవ జరగగానే దాన్ని అడ్డుపెట్టుకుని పరీక్ష తేదీలను మార్చడం టీఎస్పీఎస్పీకి అప్పట్లో అలవాటుగా మారింది.
కమిషన్ ఎలాంటి ముందస్తు ప్రిపరేషన్ లేకుండా పరీక్షలు నిర్వహించడం కూడా అభ్యర్థులకు శాపంలా మారింది. ఇలా జరగడానికి కమిషన్ కు తగినంత స్టాప్ లేదని ప్రభుత్వం చెబుతున్నా.. వాటిని పరిష్కరించడంలో మాత్రం విఫలమవుతూనే ఉంది.
దీనికి ప్రస్తుతం జరుగుతున్న గ్రూప్ -1 హైకోర్టు కేసే ఓ ఉదాహారణ. పరీక్ష సజావుగా నిర్వహించిన ఫలితాలు త్వరగా ఇవ్వాలనే తొందరలో వాల్యూయేషన్ సరిగా చేయలేదని, తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం చేశారని వదంతులు ప్రచారం లో ఉన్నాయి. ఇప్పుడు హైకోర్టులో దాఖలైన కేసుతో పరిస్థితి మరోసారి మొదటికి వచ్చింది.
కోర్టులో ప్రభుత్వ వాదన ఏంటీ?
అయితే కోర్టులో కమిషన్ అభ్యర్థుల ఆరోపణలను ఖండించింది. ఎక్కడా ఎవరికి మార్కులు తగ్గలేదని, ఓ అభ్యర్థిని విషయంలో మార్కులు తక్కువ వస్తే ఎక్కువ వేసినట్లు దిద్దారని, దానికి షోకాజ్ నోటీస్ జారీచేసినట్లు తెలిపారు. అలాగే పిటిషన్ దాఖలు చేసిన వారిలో 19 మంది ప్రభుత్వ ఉద్యోగులని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ పరీక్షలో అబ్బాయిలకన్నా.. అమ్మాయిలే బాగా రాసినట్లు తేలిందని, పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగలేదని వాదించింది.
ఏదీఏమైనా నిరుద్యోగుల ప్రభుత్వ ఉద్యోగం కల నెరవడానికి ఏళ్లకు ఏళ్లు పడుతోంది. ఓఎంఆర్ షీట్ లో చిన్న తప్పు చేసిన ఇన్ వాలిడ్ చేసే కమిషన్.. తానే స్వయంగా ఎన్ని తప్పులు చేసిన వాటిని సరిదిద్దుకోకుండా కోర్టు కేసులతో కాలయాపన చేస్తోంది.