వీధి కుక్కల నియంత్రణకు  సీఎం ఆదేశాలతోనైనా అధికారులు కదిలేనా?
x

వీధి కుక్కల నియంత్రణకు సీఎం ఆదేశాలతోనైనా అధికారులు కదిలేనా?

హైదరాబాద్‌లో వీధికుక్కలు వరుసగా ముగ్గురు పిల్లల్ని బలిగొన్న ఘటనలతో సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర కలత చెందారు. ఇక నగరంలో వీధికుక్కలను నియంత్రించాలని సీఎం ఆదేశించారు.


తేదీ 16-07-2024, సమయం : రాత్రి ఏడు గంటలు... మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ ప్రాంతంలోని ఆదర్శనగర్ కాలనీలో భరత్-లక్ష్మీ దంపతుల 18 నెలల కుమారుడు విహాన్ తుళ్లుతూ ఎంతో సంతోషంతో ఇంటి ఎదుట ఆడుకుంటున్నాడు. అంతలో వీధికుక్కల గుంపు ఒక్కసారిగా బాలుడిపై దాడి చేసింది. బాలుడిని నోట కరచుకున్న వీధికుక్కలు కొంత దూరం తీసుకెళ్లి కాట్లతో శరీరాన్ని ఛిద్రం చేశాయి. కుక్కల దాడిని చూసి ఓ వ్యక్తి అక్కడకు వెళ్లి చూడగా బాలుడు తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్నాడు. శరీరమంతా కుక్క కాట్లతో నిందిపోవడంతో అతన్ని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా, రక్తస్రావం అధికం కావడంతో మంగళవారం రాత్రి 9.30 గంటలకు విహాన్ మరణించారు.

- జూన్ 28,2024: పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామ పరిధిలోని మహీధర వెంచరులో వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు మరణించాడు. బాలుడు ఆడుకుంటుండగా వీధికుక్కలు వచ్చిన దాడి చేశాయి. వీధికుక్కల దాడిలో బాలుడు రక్తపుమడుగులో మృత్యువాత పడ్డాడు.
- ఫిబ్రవరి 20,2023 : అంబర్ పేట సమీపంలోని ఛే నంబర్ చౌరస్తాలో ఉన్న ఓ కారు సర్వీస్ సెంటరులో వాచ్ మెన్ గా పనిచేస్తున్న గంగాధర్, జనప్రియల నాలుగేళ్ల కుమారుడు ప్రదీప్ పై వీధికుక్కలు దాడి చేసి దారుణంగా కరిచాయి. ప్రదీప్ కాళ్లు చేతులను పీకాయి. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మరణించాడు. గంగాధర్, జనప్రియలకు వీధికుక్కలు శోకాన్ని మిగిల్చాయి.

కుక్కల కాటుకు ఇంకెంతమంది బలవ్వాలి?
గ్రేటర్ హైదరాబాద్ లో వీధి కుక్కల దాడులకు ఇంకెంత మంది బలవ్వాలని జవహర్ నగర్ ప్రాంత వాసులు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. కుక్కల బెడదపై స్థానికులు బుధవారం తీవ్ర ఆందోళన చేశారు. ఒక్కగానొక్క కుమారుడిని వీధికుక్కలు పొట్టన పెట్టుకున్నాయని జవహర్ నగర్ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరుసగా వీధి కుక్కల దాడులు
- జగిత్యాల జిల్లా బీర్పూర్‌ మండలం మంగేలా అనే గ్రామంలో ఓ పిచ్చికుక్క బాలుడిని దారుణంగా కరిచింది. దేవేందర్‌ అనే ఏడేళ్ల చిన్నారిపై పిచ్చికుక్క దాడి చేసి కరిచింది.
ఇంకెంత మంది పిల్లల ప్రాణాలు పోతే అధికారులు కుక్కల బెడద సమస్యను పట్టించుకుంటారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
- కాజీపేట రైల్వే క్వార్టర్స్ సమీపంలో వీధికుక్కలు చిన్నారిని పొట్టన పెట్టుకున్నాయి.వరంగల్‌లో వీధికుక్కల దాడిలో 65 ఏళ్ల వ్యక్తి గాయపడ్డాడు.
- జులై 3: సంగారెడ్డి పట్టణంలోని 12వ వార్డు శ్రీనగర్ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై ఆరు వీధికుక్కలు దాడి చేశాయి. బాలుడి కేకలు విన్న స్థానికులు కుక్కలను తరిమికొట్టారు. వీధి కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.
- జూన్ 23: నిర్మల్ జిల్లా నిర్మల్ పట్టణంలో వీధి కుక్కలు రోడ్డుపై నడచి వెళుతున్న ఓ వృద్ధురాలిపై దాడి చేశాయి. వృద్ధురాలు పరుగెత్తడంతో ప్రమాదం తప్పింది.

వీధికుక్కల బెడద నియంత్రణకు కంట్రోల్ రూం
వీధికుక్కల వరుస దాడుల్లో పిల్లలు మరణిస్తున్న నేపథ్యంలో వీటి నియంత్రణకు ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం ఎ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జవహర్ నగర్ లో వీధి కుక్కల దాడి ఘటనలో 18 నెలల బాలుడు మరణించిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని సీఎం ఆవేదనగా చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని, కుక్కల దాడుల ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.

సత్వర చికిత్స అందించండి : సీఎం రేవంత్ రెడ్డి
కుక్క కాటుకు అన్ని ఆసుపత్రుల్లో బాధితులకు సత్వర చికిత్స అందించాలని సీఎం కోరారు.ఇతర రాష్ట్రాల్లో కుక్కల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పశువైద్యులు, బ్లూక్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కమిటీని ఏర్పాటు చేయాలసి సీఎం కోరారు.
వీధికుక్కల బెడదపై రేపు హైకోర్టు విచారణ
వీధికుక్కల నివారణకు తీసుకున్న చర్యలను వివరిస్తూ వారం రోజుల్లో తమకు నివేదిక సమర్పించాలని మున్సిపల్, రెవెన్యూ, వెటర్నరీ అధికారులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె అనిల్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. పరిస్థితి క్లిష్టంగా ఉందని, అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తులు నొక్కి చెప్పారు.దీని కోసం కమిటీని నియమించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు గురువారం హైకోర్టులో విచారణ జరగనుంది.




Read More
Next Story