
చిక్కడపల్లి లైబ్రరీలో చదువుతున్న విద్యార్థులు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్
టీజీపీఎస్సీ: ఈ తప్పులు సరిచేయాలంటే తరాలు పడుతుందా?
పుష్కరకాలంగా గ్రూప్-1 పరీక్ష నిర్వహించలేకపోతున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్
‘‘మా హయాంలోనే గొప్ప ప్రాజెక్ట్ లు, భవనాలు నిర్మించామని ఒకరు చెప్పుకుంటారు. హైదరాబాద్ అభివృద్దిని పరుగులు పెట్టిస్తున్నామని, పదుల సంఖ్యలో మల్టీనేషనల్ కంపెనీలతో పెట్టుబడులు పెట్టించి వేలాది ఉద్యోగాలు ఇస్తున్నామని మరొకరు ప్రచారం చేసుకుంటారు. తెలంగాణ ఖ్యాతి ఖండాంతరాలు దాటిస్తున్నామని వేరొకరు ఊదరగొడతారు. కానీ 12 ఏళ్లుగా కనీసం ఒక్క గ్రూప్-1 పరీక్షను సక్రమంగా నిర్వహించలేకపోయారు’’
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించి పుష్కరకాలమైంది. దాదాపు అన్ని రంగాల్లో రాష్ట్రం తనదైన ఉనికిని చాటుకోగలిగింది. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) మాత్రం ఒక్క గ్రూప్స్ పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేకపోయింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన 9 సంవత్సరాలకు గ్రూప్ -1 నోటిఫికేషన్ జారీ చేసిన కమిషన్.. ఒకే పరీక్షను ఏకంగా మూడు సార్లు నిర్వహించింది. నాలుగో సారి మెయిన్స్ పరీక్ష విషయంలో ఇదే సీన్ పునరావృతం అయింది.
ఈ ఏడాది మార్చి లో ప్రకటించిన గ్రూప్ -1 ఫలితాలు, ర్యాంకింగ్స్ ను రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం మంగళవారం రద్దు చేసింది. కమిషన్ నిబంధనల ప్రకారం నడుచుకోకుండా తనకు తోచిన రీతిలో పరీక్షలు నిర్వహించడం ఇందుకు ప్రధాన కారణం.
ఇప్పటికే ఒకసారి నిబంధనలు సరిగా పాటించలేదని ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. మొదటి తప్పు నుంచి పాఠాలు నేర్వని కమిషన్ రెండోసారి అదే తప్పు చేసింది. ఇప్పుడు మరోసారి కోర్టు మెయిన్స్ ఫలితాలను రద్దు చేసింది.
తప్పు కమిషన్ ది.. శిక్ష అభ్యర్థులకు
పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు రాజ్యాంగ ప్రతిపత్తి ఉంటుంది. సొంతంగా విధానాలు రూపొందించుకుని వాటిని కచ్చితంగా అమలు చేయాల్సి బాధ్యత వాటిదే. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రం అవేవి పాటించట్లేదు.
దీనికి అనేక ఉదాహారణలు ఉన్నాయి. గ్రూప్-1 పరీక్షనే తీసుకుంటే ఇప్పటికి మూడుసార్లు నిర్వహించింది. మొదటగా 2022లో కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ ప్రిలిమ్స్ పేపర్ ను అందులో పనిచేసే ప్రవీణ్, రాజశేఖర్ అనే ఉద్యోగులే లీక్ చేసి బయటకు అమ్ముకున్నారు.
ప్రవీణ్ అనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగి ప్రిలిమ్స్ పరీక్షకు హాజరై 103 మార్కులు సాధించాడు. రాజశేఖర్ అనే మరో నిందితుడు ఏకంగా న్యూజిలాండ్ లో ఉన్న తన బావను రప్పించి పరీక్ష రాయించుకున్నాడు.
కమిషన్ నిబంధనల ప్రకారం.. ఎవరైనా అభ్యర్థులు తాము పరీక్ష రాయాలనుకుంటే ముందుగానే చైర్మన్ అనుమతి తీసుకోవాలి. తరువాత వారిని వేరే డిపార్ట్ మెంట్ కు బదిలీ చేయడం గానీ, ఇతర విభాగాలకు పంపడం కానీ చేస్తారు. కానీ ఇక్కడ కమిషన్ అసలు ఈ విషయాన్నే పరిగణలోకి తీసుకోలేదు.
ఫలితంగా కమిషన్ చేసిన పొరపాటుకు 25 వేల మంది అభ్యర్థులు శిక్ష అనుభవించారు. మరో రెండు నెలల్లో మెయిన్ పరీక్ష ఉందనగా విషయం బయటకు రావడమే కాకుండా.. నిందితులు మరో తొమ్మిది పోటీ పరీక్షలకు సంబంధించిన పేపర్లను లీక్ చేసి అమ్ముకున్నారని తేలింది.
టౌన్ ప్లానింగ్ అధికారి, తరువాత ఏఈ పరీక్ష పేపర్ లు లీక్ చేసి వాటిని అమ్మి సొమ్ము చేసుకునే సమయంలో జరిగిన కుమ్ములాటే ఈ విషయం బయటకు రావడానికి కారణమైంది.
పేపర్లు లీక్ చేసిన కమిషన్ గుర్తించకపోవడంతో నిందితులకు ధైర్యం వచ్చింది. ఇదే ధైర్యంతో మిగిలిన పోటీపరీక్షల పేపర్లను కూడా లీక్ చేశారు. ఈ కేసులలో దాదాపు 200 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
రెండోసారి అదే తప్పు..
పేపర్ లీక్ అయిన తప్పును కప్పిపుచ్చడానికి కమిషన్ హడావుడిగా నిర్ణయాలు తీసుకుంది. 2022 లో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయడమే కాకుండా, మరో మూడు నెలలో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రకటన జారీచేసింది.
ఇక్కడ కూడా కమిషన్ తన సొంత నిబంధనలు పాటించలేదు. బయోమెట్రిక్ లేకుండా పరీక్షలు నిర్వహించింది. మొదటి సారి బయోమెట్రిక్ లో పరీక్షనిర్వహించి, రెండోసారి అవి లేకుండా మాన్యువల్ పద్దతిలో పరీక్ష పెట్టడంతో కొంతమంది అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు.
కేసును విచారించిన న్యాయస్థానం రెండోసారి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసింది. మరోసారి రెండు లక్షల మంది అభ్యర్థుల నోట్లో కమిషన్ మట్టికొట్టింది.
‘‘రెండోసారి ప్రిలిమ్స్ పరీక్షకు వెళ్లగానే నాకు విషయం అర్థమైంది. మొదటిసారి బయెమెట్రిక్ తో పరీక్ష రాశాను. రెండోసారి అవేవి లేకుండా నిర్వహించారు. పరీక్ష రద్దు చేస్తారని అనుకున్నాను. కోర్టు అలాగే తీర్పు చెప్పింది’’ అని మహేశ్(పేరు మార్చాం) అనే అభ్యర్థి ఫెడరల్ తో చెప్పారు.
కమిషన్ ఎలాంటి సవరణ నోటిఫికేషన్ జారీ చేయకుండా, సొంతంగా రూల్స్ వాయిలేషన్ చేయడమే ఇందుకు కారణమన్నారు. మూడోసారి మెయిన్స్ పరీక్షను కోర్టు రద్దు చేయడంపై ఆయన మాట్లాడటానికి నిరాకరించారు.
ముచ్చటగా మూడోసారి..
తెలంగాణలో మొదటిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ బీఆర్ఎస్ హాయాంలో విడుదల చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్ ను రద్దు చేసింది. కొత్తగా 563 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రిలిమ్స్ పరీక్ష అనంతరం.. గత ఏడాది అక్టోబర్ 21-27 మధ్య మెయిన్స్ నిర్వహించింది. ఈ ఏడాది మార్చి 10 న ఫలితాలు విడుదల చేసింది. ఇదే నెల 30 న జనరల్ ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ లు సైతం నిర్వహించింది.
కానీ ఇక్కడే కథ మరో మలుపు తిరిగింది. తెలుగు మీడియం అభ్యర్థులకు సరైన మార్కులు వేయలేదని, కేవలం ఇంగ్లీష్ మీడియం వారికే ప్రాధాన్యం ఇచ్చారని కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. అయితే ఇదంతా తప్పని కమిషన్ వాదించింది. అలా ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేయించింది.
కోర్టుకు సమర్పించిన ఆధారాలలో కమిషన్ తాను విధించుకున్న నిబంధనలు తానే అమలు చేయలేదని గుర్తించింది. ముఖ్యంగా క్వాలిఫైడ్ పేపర్ గా ఉన్న ఇంగ్లీష్ లో కనీస అర్హత మార్కులు వచ్చిన వారివే.. మిగిలిన పేపర్లను మూల్యాంకనం(వాల్యూయేషన్) చేయాలి. కానీ ఈ నిబంధనలను టీజీపీఎస్సీ గాలికి వదిలేసింది. ఇంగ్లీష్ లో క్వాలిఫై కాకున్నా కొంతమంది అభ్యర్థుల పేపర్లను మూల్యాంకనం చేసినట్లు తేలింది. ఇవే కాకుండా పరీక్షకు హజరైన వారి సంఖ్యను పలు సందర్భాలలో మార్పులు చేర్పులు చేసింది.
ఉదాహారణకు 2024 అక్టోబర్ 27 నాటి కమిషన్ ప్రకటనలో క్రీడా అభ్యర్థులతో కలిపి 21,093 మంది మెయన్స్ పరీక్ష రాసినట్లు వెల్లడించింది. కానీ 2025, మార్చి 30 నాటి ఫలితాలలో వీరి సంఖ్య 21,085 అని మరో 25 మంది ఫలితాలు కోర్టు కేసుల కారణంగా విడుదల చేయడం లేదని వెల్లడించింది. అంటే మొత్తం అభ్యర్థుల సంఖ్య పెరిగింది.
ఐదు నెలల తరువాత అభ్యర్థులు ఎలా పెరిగారో అనే దానికి కమిషన్ వివరణ ఇవ్వలేదు. ఇదే కాకుండా ప్రిలిమ్స్, మెయిన్స్ కు వేరు వేరు హాల్ టికెట్లను జారీ చేయడం సందేహాలకు తావునిచ్చింది. వీటిలో ఏ ఒక్క దానికి కమిషన్ అధికారికంగా వివరణ ఇవ్వలేదు. దీనితో అభ్యర్థులు కోర్టు మెట్లెక్కారు.
ఉన్నత విద్యావంతులు.. కానీ పరీక్షలు నిర్వహించలేరు..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు దగ్గర నుంచి చైర్మన్ లుగా ఉన్నత విద్యావంతులే నియమితులయ్యారు. మొదటి ఛైర్మన్ గా ఘంటా చక్రపాణి పనిచేశారు. ఆయనకు ప్రముఖ విద్యావేత్తగా, సామాజిక ఉద్యమకారుడిగా పేరుంది.
కానీ ఆయన హయాంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2011 అభ్యర్థులకు 2018 లో పరీక్ష నిర్వహించారు. ఫలితాలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. మొదట కమిషన్ ఫలితాలు ప్రకటించింది. కానీ మరుసటి రోజు జనరల్ ర్యాంకింగ్స్ ను మార్చింది. సాంకేతిక కారణాలతో ఇలా జరిగిందని వివరణ ఇచ్చుకుంది. దీనిపై అనేక సందేహాలు వచ్చాయి. వాటిని కమిషన్ పట్టించుకోలేదు.
కమిషన్ రెండో ఛైర్మన్ గా మాజీ ఐఏఎస్ డాక్టర్ బీ. జనార్ధన్ రెడ్డి ని ప్రభుత్వం నియమించింది. కానీ ఆయన హయాంలో పేపర్ లీక్ లు, న్యాయస్థానాలు పరీక్ష రద్దు చేయడం లాంటివి చోటు చేసుకున్నాయి. గ్రూప్ -2 పరీక్షను ఏకంగా నాలుగు సార్లు వాయిదా వేశారు. బయట ఏ మాత్రం చిన్నపాటి ఆందోళన జరిగిన కమిషన్ బెండ్ అవడం రాష్ట్రంలో సాధారణంగా మారింది.
మూడోసారి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి చైర్మన్ గా నియమితులయ్యారు. ఈయన హయాంలో జరిగిన పరీక్షలో మరోసారి నిబంధనలు పాటించలేదని కోర్టు గ్రూప్-1 ఫలితాలను రద్దు చేసింది. ప్రస్తుతం కమిషన్ చైర్మన్ గా బుర్రా వెంకటేశం ఉన్నారు. ఈయన కూడా ఒక మాజీ ఐఏఎస్ అధికారే.
మూల్యాంకనం..
గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష రాసిన వారిలో తెలుగు మీడియం కంటే ఇంగ్లీష్ మీడియం వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారనే అభియోగాలు చాలా రోజుల నుంచి ఉన్నాయి. డిస్క్రిప్టివ్ పద్దతిలో కాకుండా పాయింట్ల వారిగా రాసిన ఇంగ్లీష్ మీడియం వారికి ఎక్కువ మార్కులు వచ్చాయని కొంతమంది తెలుగు మీడియం విద్యార్థుల వాదన.
ఇంగ్లీష్ మీడియంలో 12,381 మంది విద్యార్థులు హజరైతే 506 మంది ఎంపిక అయ్యారు. తెలుగులో 8,694 మంది హజరైతే 56 మంది ఎంపికయ్యారు. ఈ గణాంకాలనే వారు చూపుతున్నారు.
ఈ విషయానికి సంబంధించి గ్రూప్ -1 లో ర్యాంక్ సాధించిన అభ్యర్థి నవీన్ కుమార్(పేరు మార్చాం) ‘ది ఫెడరల్’ తో మాట్లాడారు. ‘‘ఇంగ్లీష్ లో ఒక్కో సబ్జెక్ట్ కు సంబంధించి చాలా రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. కానీ తెలుగు మీడియంలో అలా కాదు.
ఒక్కో సబ్జెక్ట్ కు కనీసం ఒక్క బుక్ కూడా అందుబాటులో లేదు. చాలా మంది సొంతంగా నోట్స్ రాసుకున్నారు. వాళ్లని మమ్మల్ని ఎలా పోలుస్తారు’’ అని ప్రశ్నించారు. ఎన్నో ఏళ్ల నుంచి చదివి కష్టపడి పరీక్ష రాశామని, ఇప్పుడు నోటి దగ్గరకి వచ్చిన ముద్దను లాగేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
నా లైఫ్ ఏదో అనుకుంటే మరో వైపు ప్రయాణిస్తోందని, ఒకరు చేసిన తప్పులకు మరోకరు శిక్ష అనుభవిస్తున్నారని చెప్పారు. అశోక్ నగర్ లో మెయిన్స్ కొత్త బ్యాచ్ లు నిర్వహిస్తామని బోర్డులు వెలిశాయని ఆయన చెప్పుకొచ్చారు.
పేపర్ మూల్యాకనంలో కమిషన్ తప్పులు చేసిందని న్యాయస్థానం కూడా గుర్తించింది. ముఖ్యంగా జూనియర్ లెక్చరర్లకు ప్రమోషన్ ద్వారా డీఎల్ గా నియమితులయ్యారని, వారితో పేపర్లు దిద్దించారని గుర్తించింది.
వారిలో చాలా మంది సబ్జెక్ట్ నిపుణులు కాదంది. తెలంగాణ ఉద్యమం గురించి అవగాహన లేనివారితో వాల్యూయేషన్ చేయడం కూడా ప్రస్తుత న్యాయ వివాదానికి కారణంగా చెప్పవచ్చు.
‘‘నేను తెలుగు మీడియంలో పరీక్ష రాశాను. ఆరో పేపర్ అయిన తెలంగాణ ఉద్యమం గురించి చాలా బాగా రాశాను. నా అంచనా ప్రకారం 110-120 వరకూ రావాలి. కనీసం 70 మార్కులు అయినా రావాలి. కానీ నాకు కేవలం 40 మార్కులే వచ్చాయి’’ అని ఓ అభ్యర్థి( తన పేరు చెప్పవద్దని కోరారు) ఫెడరల్ కు చెప్పారు.
‘‘ఇక నుంచి మెయిన్స్ లో ఆప్షనల్ గానే నిర్వహించాలి. ఈ వివాదాలను ఇదే సరైన మందు. ఒకే ఆన్సర్ కు నలుగురు అభ్యర్థులు దాదాపుగా ఒకేలా రాస్తారు. కానీ మూల్యాంకనంలో ఒకరికి ఏడు మార్కులు, మరోకరికి నాలుగు మార్కులు వేస్తారు. ఇదే వివాదాలకు కారణం అవుతుంది. దీనిని మార్చివేయాలి’’ అని త్రివేణి ఇన్ స్టిట్యూట్ నిర్వాహకులు అన్నం కళింగ రెడ్డి ‘ఫెడరల్’ కు చెప్పారు.
మెయిన్స్ పరీక్షలో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అనే భావన ఉండదన్నారు. తెలుగు మీడియం విద్యార్థులు గ్రూప్-2 తో ఆగిపోతారని, కానీ సివిల్స్ కు రాస్తున్న చాలా మంది ఇంగ్లీష్ లో చదువుతారని చెప్పారు. వారే గ్రూప్-1 కు ఎంపిక అవుతారని వివరించారు.
ఏం జరగబోతోంది..
న్యాయస్థానం గ్రూప్-1 ఫలితాలు రద్దు చేయడంతో ఉద్యోగం వస్తుందనే ఆశలో ఉన్న అభ్యర్థులలో ఆందోళన రేపింది. టీజీపీఎస్సీ కూడా డివిజన్ బెంచ్ కు వెళ్లాలనే ఆలోచనలో ఉంది. తీర్పు కాపీ అందాక న్యాయ నిపుణులతో మాట్లాడి దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అయితే అక్కడ కూడా వ్యతిరేకంగా తీర్పు వస్తేనే కొత్త సమస్య కమిషన్ కు ఎదురైనట్లే భావించాలి.
మూల్యాంకనం చేసిన తరువాత ర్యాంక్ లు మారితే పాత ర్యాంకర్లు తిరిగి కోర్టులో కేసులు వేసే అవకాశం ఉంది. వీరికి అనుకూలంగా తీర్పు వస్తే.. కొత్త ర్యాంకర్లు మరోసారి న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే.. ‘‘ముందు నుయ్యి.. వెనక గొయ్యి’’. ఈ కేసులు ఎన్నాళ్లకు పరిష్కారమవుతాయో తెలియదు.
2011 లో అప్పటి ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ -1 ప్రిలిమ్స్ లో ఆరు ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని కొంతమంది వ్యక్తులు మొదట హైకోర్టును, తరువాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అభ్యర్థుల వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం అందులో నాలుగు ప్రశ్నలు జత చేయాలని, అంతకుముందు నిర్వహించిన మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ఇలా 2018 లో అది పరిష్కారం అయింది. ప్రస్తుత వివాదం కూడా ఇలా సుదీర్ఘ న్యాయ ప్రక్రియను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి.
Next Story