డార్క్ నెట్వర్క్ పై మూడో కన్ను
x

'డార్క్' నెట్వర్క్ పై మూడో కన్ను

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ నిర్మూలన దిశగా దృష్టి సారించింది.


తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ నిర్మూలన దిశగా దృష్టి సారించింది. మాదకద్రవ్యాల కట్టడికి పోలీసు శాఖకు ఫుల్ పవర్స్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో క్లబ్బులు, పబ్బులు, అనుమానమొస్తే అపార్టుమెంట్లను కూడా వదలకుండా రైడ్స్ చేస్తున్నారు. ఎక్కడ డ్రగ్స్ దొరికినా అమ్మినోళ్ళని, కొన్నోళ్ళని వదలడం లేదు. డ్రగ్స్ సరఫరాతో సంబంధాలున్న ఏ ఒక్కరినీ విడిచి పెట్టడం లేదు. దీంతో బహిరంగ మార్కెట్ లో డ్రగ్స్ చేతులు మారేందుకు వీలు లేకుండా పోయింది. అయినా కేటుగాళ్లు కామ్ గా ఎందుకుంటారు? ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో డార్క్ వెబ్ లో అమ్మకాలు కొనసాగిస్తున్నారు. స్పీడ్ పోస్ట్, కొరియర్ ద్వారా మాదక ద్రవ్యాలను డెలివరీ చేస్తున్నారు. అయితే, వీళ్ళ ఆటలకి కూడా తెలంగాణ పోలీసులు కళ్లెం వేస్తున్నారు.

శనివారం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGANB) డార్క్ వెబ్ ద్వారా డ్రగ్ డెలివరీ ఆపరేషన్‌ను విజయవంతంగా అడ్డుకుంది. స్పీడ్ పోస్ట్ ద్వారా డ్రగ్స్ డెలివరీ చేయడానికి ఆన్‌ లైన్ ప్లాట్‌ ఫామ్ లను ఉపయోగిస్తున్న నెట్‌వర్క్‌ను టీజీన్యాబ్ టెక్నికల్ వింగ్ గుర్తించింది. టెక్నికల్ వింగ్ నుంచి అందిన సమాచారం మేరకు రీజనల్ నార్కోటిక్స్ కంట్రోల్ సెల్ (ఆర్ఎన్సీసీ) ఖమ్మం అధికారులు, ఖమ్మం టూ టౌన్ పోలీసుల సహకారంతో ఖమ్మం పట్టణానికి చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను అరెస్టు చేశారు.

అతను జూలై 31, 2024న డార్క్ వెబ్‌లో డ్రగ్స్ ఆర్డర్ చేసి, క్రిప్టోకరెన్సీ ని ఉపయోగించి పేమెంట్ చేశాడు. డ్రగ్స్ పెడ్లర్ అతనికి స్పీడ్ పోస్ట్ ద్వారా అస్సాంలోని సిల్పుఖురి నుండి డ్రగ్స్‌ను పంపి, ట్రాకింగ్ నంబర్‌ను అందించాడు. ఈ డెలివరీపై అప్పటికే సమాచారం ఉన్న ఆర్ఎన్సీసీ ఖమ్మం అధికారులు నిఘా ఉంచారు. ఆగస్టు 8 న టెక్కీ తన ఇంటివద్ద డెలివరీ తీసుకోగానే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డ్రగ్స్ కి బానిసైన అతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు.

'డార్క్' నెట్ వర్క్ పై పూర్తి నిఘా..

మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న డార్క్ వెబ్ నెట్ వర్క్ పై టీజీన్యాబ్ టెక్నికల్ వింగ్ సహకారంతో పూర్తి నిఘా ఉంచామని టీజీన్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య స్పష్టం చేశారు. గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే టీజీ న్యాబ్ టోల్ ఫ్రీ నెంబరు 1908కు లేదా 8712671111 నెంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఆయన కోరారు.

Read More
Next Story