వడదెబ్బ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం
x

వడదెబ్బ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం

వడదెబ్బ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ పరిహారం రూ.50వేలుగా ఉంది.


రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. సీజన్ ప్రారంభంలోనే భానుడు భగభగమంటున్నాడు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను అధిగమించాయి. దీంతో వడదెబ్బ కేసులు కూడా షురూ అయ్యాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తప్పని పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒకవైపు వర్షాలు పడుతున్న కొద్దీ ఎండ తీవ్రత అధికం అవుతోంది. ఈ ఏడాది ఎండ తీవ్రత 50 డిగ్రీల సెల్సియస్‌ను రీచ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది వడదెబ్బ తగిలే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని, కాబట్టి చిన్నారులు, వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వడదెబ్బ ప్రమాదం అధికంగా ఉన్న క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వడదెబ్బ కారణంగా ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని నిశ్చయించుకుంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది.

వడదెబ్బను ‘రాష్ట్ర విపత్తు’గా పరిగణిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలోనే దీని కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ పరిహారం రూ.50వేలుగా ఉంది. కాగా ఈ ఏడాది ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ఈ ఎక్స్‌గ్రేషియాను రూ.4 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఎండ తీవ్రత మరింత పెరగనున్న నేపథ్యంలో ప్రజలకు కీలక మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రతి ఒక్కరూ హైడ్రేటెడ్‌గా ఉండాలని సూచించింది. దాంతో పాటుగా ఎవరూ కూడా ఎండలో ఎక్కువ సేపు గడపొద్దని, రోజూ కూలీ పనులున చేసుకునే వారు కూడా పని వేళలను మార్చుకోవాలని సూచించారు. వడదెబ్బ ప్రభావం గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కూడా సంబంధిత శాఖలకు ఆదేశించింది ప్రభుత్వం.

Read More
Next Story