బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మనకొద్దు... ఆందోళనలు ఉద్రిక్తం
x

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మనకొద్దు... ఆందోళనలు ఉద్రిక్తం

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు.


తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ నుంచి అధికార పార్టీలోకి జంప్ అయ్యేందుకు రెడీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఆపరేషన్ ఆకర్ష్ ఫలించినట్టు కనిపిస్తోంది. గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి హస్తం తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం. ఈ నెల 6 న లేదా 9 న కాంగ్రెస్ కండువా కప్పుకోడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు నియోజకవర్గంలో చర్చలు జోరందుకున్నాయి.

ఈ క్రమంలో కృష్ణ మోహన్ ని కాంగ్రెస్ లో చేర్చుకోడానికి వీల్లేదంటూ కార్యకర్తలు రోడ్డెక్కారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్ కార్యకర్తలని ఇబ్బందులు పెట్టాడని, కేసులు పెట్టి హింసించాడని, అలాంటి వాడిని ఇప్పుడు పార్టీలోకి చేర్చుకోవడానికి వీల్లేదంటూ ఆందోళన చేస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణమోహన్ పై పోటీ చేసి ఓడిపోయిన జెడ్పీ చైర్‌పర్సన్ సరిత.. ఆయన కాంగ్రెస్‌లో చేరడాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ మేరకు ఆమె ఇటీవల నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవిని కలిసి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రవేశానికి అనుమతి ఇవ్వకుండా పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.

గురువారం ఆమె మద్దతుదారుల్లో ఒకరైన ప్రసాద్ అనే యువకుడు పట్టణంలోని నల్లగుంట వద్ద ఉన్న మొబైల్ నెట్‌వర్క్ టవర్ పైకి ఎక్కాడు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి రావడాన్ని కాంగ్రెస్ అధిష్టానం ప్రోత్సహిస్తే టవర్ పైనుండి దూకుతానని బెదిరించాడు. ప్రసాద్ తో పాటు పార్టీ కార్యకర్తలు టవర్‌ వద్ద బైఠాయించి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానికులు అప్రమత్తం చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రసాద్ ని ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడొద్దని కోరారు. అతనిని కిందకి దించారు.

అలాగే, జిల్లాలోని జిల్లాలోని కేతిదొడ్డిలో ఇదే తరహాలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ చేరికను వ్యతిరేకిస్తూ జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత మద్దతుదారుడు కృష్ణ తనపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసాడు. అతనితో పాటు మరికొందరు మద్దతుదారులు కేతిదొడ్డి మండలం ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పార్టీలోకి అనుమతించే యోచనను విరమించుకోవాలని కాంగ్రెస్‌ నేతలను డిమాండ్‌ చేశారు.

కాగా, తెలంగాణలోని కాంగ్రెస్ నాయకత్వం ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తరుణంలో, ముఖ్యంగా బీఆర్‌ఎస్ నుండి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడంపై స్థానిక నేతల నుంచి వ్యతిరేక స్వరాలూ వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ కాంగ్రెస్ లో చేరినప్పుడు బాన్సువాడ, జగిత్యాలలో స్థానిక కాంగ్రెస్‌ నేతలు ఇదే తరహాలో నిరసనలు చేపట్టారు.

Read More
Next Story