ఇద్దరిలో టెన్షన్..టెన్షన్
x

ఇద్దరిలో టెన్షన్..టెన్షన్

వీళ్ళు దాఖలు చేసిన రెండు పిటీషన్లపై కోర్టులో తీర్పులు చెప్పబోతున్నాయి.


తండ్రి, కూతురు ఇద్దరిలోను ఒకేసారి టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. కారణం ఏమిటంటే వీళ్ళు దాఖలు చేసిన రెండు పిటీషన్లపై కోర్టులో తీర్పులు చెప్పబోతున్నాయి. తెలంగాణా హైకోర్టులో కేసీయార్ వేసిన కేసుపై ఈరోజు తీర్పు రాబోతోంది. విద్యుత్ శాఖలో భారీ ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.

తనపై ఆరోపణలను కమిషన్ విచారణ జరిపేందుకు లేదని, తనను విచారించే అర్హత కమిషన్ కు లేదని కేసీయార్ వాదిస్తున్నారు. కాబట్టి కమిషన్ ఏర్పాటును రద్దుచేయాలనే వాదనతో కేసీయార్ పిటీషన్ దాఖలు చేశారు. దానిపై వాదనలు విన్న కోర్టు ఈరోజు తీర్పు చెప్పబోతోంది. కేసీయార్ పై విచారణ చేయటంలో తప్పులేదని కోర్టు తీర్పుచెబితే రాజకీయ పరిణామాలు చాలా స్పీడుగా మారిపోవటం ఖాయం. ఇప్పటికే విచారణకు హాజరవ్వాలని కమిషన్ కేసీయార్ కు రెండుసార్లు నోటీసులిస్తే వాటిని లెక్కచేయలేదు. కోర్టు తీర్పు అనుగుణంగా కమిషన్ విచారణలో జోరుపెంచే అవకాశముంది. మూడోసారి నోటీసు జారీచేసే అవకాశాలున్నాయి. అప్పుడు కూడా కేసీయార్ స్పందించకపోతే బెయిలబుల్ లేదా నాన్ బెయిలబుల్ అరెస్టు జారీచేసే అధికారం కమిషన్కు ఉంది.

మరి విచారణ సందర్భంగా కమిషన్ తనకున్న అధికారాలను ఉపయోగించుకుంటుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. కమిషన్ గనుక మరోసారి విచారణకు రావాలని నోటీసు జారీచేస్తే కేసీయార్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. బహుశా హైకోర్టులోనే రివ్యూ పిటీషన్ వేయటమో లేకపోతే సుప్రింకోర్టును ఆశ్రయించటమే చేయవచ్చు.

ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయిన కవిత గడచిన 100 రోజులకు పైగా ఢిల్లీలోని తీహార్ జైలులో ఉంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కవిత దాఖలుచేసుకున్న బెయిల్ పిటీషన్లను రౌస్ ఎవిన్యు కోర్టు కొట్టేసింది. బెయిల్ కు కవిత ఎన్ని కారణాలు చెబుతున్నా కోర్టు మాత్రం దేన్నీ పట్టించుకోవటంలేదు. లిక్కర్ స్కామ్ లో కవితపాత్రపై ఈడీ, సీబీఐ చాలా బలమైన కేసులు పెట్టింది. కవితపై మనీల్యాండరింగ్ కేసులు కూడా నమోదయ్యున్నాయి. అందుకనే కవిత బెయిల్ కోసం ఎంత ప్రయత్నిస్తున్నా సాధ్యంకావటంలేదు. కవిత బెయిల్ కోసం పిటీషన్ వేసినపుడల్లా దర్యాప్తుసంస్ధలు తీవ్రంగా అభ్యంతరాలు చెబుతు స్కామ్ లో కవిత పాత్రకు సంబంధించిన సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పిస్తున్నాయి.

కవిత దాఖలుచేసిన అన్నీ మధ్యంతర బెయిళ్ళను కోర్టు రెజెక్టు చేస్తుండటంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపైన కూడా హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. సోమవారం తీర్పు రాబోతోంది. హైకోర్టు కూడా కవిత బెయిల్ ను తిరస్కరిస్తే అప్పుడు ఆమె ఏమిచేస్తారన్నది ఆసక్తిగా మారింది. ఏదేమైనా ఏకకాలంలో తండ్రి, కూతురు కేసీయార్, కవిత ఆరోపణల్లో ఇరుక్కుని బయటపడేందుకు నానాఇబ్బందులు పడుతున్నారు. అందుకనే తమకు రక్షణకోసం న్యాయస్ధానాల్లో పోరాటంచేస్తున్నారు. మరీ రోజు ఇద్దరి కేసుల విషయంలో కోర్టులు ఏ విధమైన తీర్పులు చెబుతాయో చూడాలి.

Read More
Next Story