పదేళ్ల తెలంగాణ, బిసిల మీద పగబట్టిన కెసిఆర్...
పదేళ్ల తెలంగాణ-2. అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ వెనకబడిన కులాల మీద పగబట్టిన వ్యవహరించారని అంటున్నారు ప్రముఖ సామాజిక తత్వవేత్త బిఎస్ రాములు
- బి.ఎస్. రాములు సామాజిక తత్వవేత్త
తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ ఛైర్మన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అనేక నూతన ప్రణాళికలతో రాష్ట్రం అభివృద్ధి కోసం కృషి జరిగిన మాట వాస్తవం. కొన్ని అదివరకే ఉన్న స్కీమ్లను కొత్త పేర్లతో ప్రాచుర్యంలోకి తెచ్చి నిజంగా కొత్తవే అనే భ్రమను కూడా కలిగించిన స్కీములు ఉన్నాయి. ఒక దశలో విద్యావంతులు కళాకారులు , మేధావులు , జర్నలిస్టులు , చరిత్రకారులు , విశ్లేషకులు , ' దేశానికి దిక్సూచి తెలంగాణ ' అని వర్ణించడం జరిగింది. ' కేసిఆర్ విజన్ , కేసిఆర్ ఇజం ' అనే సిద్ధాంతం కూడా ప్రాచుర్యంలోకి నిజానికి ఈ నమూనా మౌలిక స్వభావం డా బి.ఆర్. అంబేద్కర్ , డా రామ్మనోహర్ లోహియా , మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ వంటి మహనీయులు సిద్ధాంత పరంగా ప్రయోగాత్మకంగా ఆచరించి నిగ్గు దేల్చినవే ఎక్కువ.
రూపాయికి కిలో బియ్యం వంటి పథకాలు లోహియా వాదుల వల్లనే దేశవ్యాప్తంగా ప్రచారం పొందాయి. ఇప్పటికీ ఆచరణలో కొనసాగుతుంది. ఉ ప్పుతో తొమ్మిది రేషన్ షాపుల్లో ఇవ్వాలనే ప్రతిపాదనలు ఆచరణలోకి రాలేదు.
ఒక వ్యక్తికి లేదా కుటుంబానికి సరిపడా బియ్యం , గోధుమలు , పప్పులు , నూనెలు , పసుపు , మిరపపొడి , చింతపండు , చెక్కెర , గ్యాస్ సిలిండర్ , సబ్బులు ఇవ్వాలని 1977 జనతా పార్టీ కేంద్ర పాలన కాలం నుంచి చర్చల్లో కొనసాగుతూ వచ్చింది. వంద రూపాయల్లో ఇవన్నీ సమకూర్చాలి అని భావించడం జరిగింది. ఇది ఇప్పటికైనా అమలు జరిగితే దేశంలో ఆహార భద్రత , పౌష్టిక ఆహార సమస్య పరిష్కరించబడుతుంది.
కాంగ్రెస్ నాయకత్వంలోని రాష్ట్రాలు , కేంద్రం ఈ విషయంలో ముందడుగు వేయడం అవసరం. పౌష్టిక ఆహారం కోసం రాజ్యాంగంలో ఒక హక్కుగా 2013 లో ఆహార భద్రత చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకువచ్చిందని మరిచిపోరాదు.
కోవిడ్ కరోనా కాలంలో ఉచితంగా కూడా బియ్యం ఇవ్వడం జరిగింది. అయితే చాలాకాలంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. దానివల్ల కొత్తగా ఎదిగి వచ్చిన 10 శాతం యువతరానికి ఈ సబ్సిడీలు , ఆరోగ్యశ్రీ కార్డులు వర్తించకుండా పోయాయి.
ఆధార్ కార్డ్ అందరికి అవసరంగా మార్చిన క్రమం మనకు తెలుసు. ఆధార్ కార్డ్ ప్రాతిపదికతో ఎలాంటి సంకోచం లేకుండా అవసరమైన వారందరికి వెంటవెంటనే ఆరు నెలలకోసారి కొత్త రేషన్ కార్డులను ఇవ్వాల్సి ఉండింది. ఇవ్వలేదు.
అలాగే వృద్ధులకు , మహిళలకు , బీడీ కార్మికులకు , ఒంటరి మహిళలకు , దివ్యాంగులకు , బోదకాలు , దీర్ఘకాలిక రోగాలకు ఆసరా పథకాలతో నెలకు రూ. 2000 లకు పైగా ఇవ్వడం వల్ల ప్రజల జీవితంలో వెలుగులు ప్రసరించాయి. వృద్ధులు తమ కొడుకు , కోడళ్ళ మీద ఆధారపడడం తగ్గిపోయింది. పైగా తమ రేషన్ కార్డు కూడా కొడుకు , కోడళ్ళకు ఉపయోగపడింది. మనుమలు , మనుమరాళు బడికి పోవడానికి సంబంధించిన నోటుబుక్కులు , డ్రెస్సులు , టిప్స్ ఇస్తూ వృద్ధులు ఆసరా పథకంతో గొప్ప గౌరవం పొందుతున్నారు. ఈ ప్రకారంగా 42 లక్షల మంది ఇంటికి ఒక్కరి చొప్పున లబ్ది పొందుతున్నారు. ఒక ఇంటిలో కనీసం 3 ఓట్లు ఉంటాయి. అలా కోటి 25 లక్షల ఓట్లు టిఆర్ఎస్ కు కృతజ్ఞతలతో రిజర్వ్ అయిపోయాయి.
అలాగే కళ్యాణలక్ష్మి , షాది ముబారక్ స్కీమ్తో అటు 25 మంది ఇటు 25 మంది చొప్పున ఒక పెళ్ళితో 50 ఓట్లు టిఆర్ఎస్ కు కృతజ్ఞతతో రిజర్వ్ అయిపోయాయి. అలా 50 లక్షల ఓట్లు ఓటు బ్యాంకు స్థిరపడింది.
వెయ్యికి పైగా గురుకుల పాఠశాలల్లో ఐదున్నర లక్షలమంది విద్యార్థులు చదువుకుంటున్నారు. నాణ్యమైన విద్య ఇంగ్లీషు మీడియం , ఆటలు , పాటలు , పౌష్టిక ఆహారం గొప్ప సామాజిక సోషలిస్టు సమాజ నిర్మాణంలో భాగంగా ఎదుగుతూ వస్తున్నారు. వీరి కుటుంబాల నుండి బందుమిత్రులు కృతజ్ఞతలతో మరో 30 లక్షల ఓటు బ్యాంకు స్థిరపడింది. రైతుబంధుతో మరో 70 లక్షల ఓట్లు ఓటు బ్యాంకుగా రూపొందింది.
కులవృత్తులకు చేయూతతో 20 లక్షల మంది ఓటు బ్యాంకు పెరిగింది. ఇలా ఈ పథకాలన్నీ ఓటు బ్యాంకు దృష్టితో అమలు జరిగాయి. అనుకున్నట్టుగానే రెండుసార్లు ఈ ఓటు బ్యాంకుతో మెజారిటీ ప్రజలు టిఆర్ఎస్ కే ఓటు వేశారు. మూడవసారి 2023 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా ఈ ఓటు బ్యాంకు ద్వారా వచ్చినవే అని టిఆర్ఎస్ మరిచిపోరాదు. టిఆర్ఎస్కు పార్టీ నిర్మాణం సరిగ్గా లేదనే చెప్పాలి. ఇలా నినాదాలతో , ఓటుబ్యాంకుతో గెలుస్తూ రావడం జరిగింది.
ఈ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునేందుకు కర్నాటకలో , తెలంగాణలో కాంగ్రెస్ చేసిన మేథో మదనం ఇంతా అంతా కాదు. అలా ఐదు గ్యారంటీలు , ఆరు గ్యారంటీలు వంటి కొత్త నినాదాలు , కొత్త కార్యక్రమాలు ముందుకు వచ్చాయి. గెలిచారు. గెలిచిన తర్వాత పై ఓటు బ్యాంకు లబ్దిదారులకు మరింత లబ్ది చేకూరుతుంది కనుక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆ ఓట్లు బదిలీ అవుతాయి.
దేశ వ్యాప్తంగా కూడా వారు చేసిన ప్రచారం మేరకు బిజెపి నుండి కాంగ్రెస్ అలయన్స్కు ఓట్లు బదిలీ అవ్వడం సహజం. అలా సీట్లు పెరగనున్నాయి. అయితే సామాజిక వర్గాల వారీగా టిఆర్ఎస్ పాలనలో బీసీలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.
టిఆర్ఎస్ సెక్రటరీ జనరల్ గా పనిచేసిన కురు వృద్ధుడు ఒకాయన కులాలవారీగా , కులవృత్తుల వారీగా స్కీమ్స్ పెట్టి కేసిఆర్ బీసీ అనే చైతన్యాన్ని నీరు గారుస్తున్నారని , బీసీ అనే పేరిట స్కీమ్ లను ఆపివేశారని , సన్నిహిత వర్గాలతో మొత్తుకున్నారు. పక్కనే ఉండి కేసిఆర్ కు ఆ మాట చెప్పలేకపోయారు. నా వంటివాళ్ళు చెప్పినా కేసిఆర్ వినిపించుకోలేదు. వీళ్ళంతా కాంగ్రెస్కు ఓట్లు వేసి గెలిపించారని మరిచిపోకూడదు.
బీసీలే తెలంగాణాలో బీసి ఎ , బి , సి , డి , ఇ గ్రూపులు కలిపి 63 శాతం జనాభా. ఇందులో బీసి ఎ గ్రూపువారు సంచార జాతులు , దళిత గిరిజన ప్రజల కన్నా వెనుకబడిన తెగలు , కులాలు. వారి జనాభా 15 శాతం. బీసీ బి గ్రూపు జనాభా 20 శాతం. బీసి సి గ్రూపు జనాభా 2 శాతం. బీసి డి గ్రూపు జనాభా 15 శాతం , బీసి ఇ గ్రూపు జనాభా 11 శాతం.
మొత్తం బీసీ , ఎస్సీ , ఎస్టీ , మైనారిటీలు కలిసి 89 శాతం జనాభా. 11 శాతమే అగ్రకులాలు , మార్వాడీలు , గుజరాతీలు , బెంగాళీలు మొదలైనవారు. రెడ్లు 16 లక్షలు మాత్రమే. వెలమలు 1 లక్ష 50 వేలు మాత్రమే. కమ్మలు 5 లక్షలు మాత్రమే. బ్రాహ్మణులు మూడున్నర లక్షలు , వైశ్యులు 5 లక్షలు మాత్రమే. అయినప్పటికీ అభివృద్ధిలో , సంపదలో , ఉద్యోగాల్లో , ప్రభుత్వ సబ్సిడీలలో , భూ సంపదలో , పరిశ్రమల్లో , అధికారాల్లో , అన్నిట్లో ఈ 11 శాతం జనాభాయే 60 శాతంకి పైగా జాతీయ అభివృద్ధిని , సంపదను కైవసం చేసుకుంటున్నారు. అనుభవిస్తున్నారు.
ఈ నిష్పత్తిని మార్చేదాక పేదరికం ఇలాగే ఉంటుంది. ఆసరా పథకాలు అనేక రూపాల్లో అవసరమవుతాయి. ఈ నిష్పత్తి మార్చడం కోసం ప్రజలు కోటేశ్వర్లు కావాలి అని రాహుల్ గాంధీ ఒక గొప్ప నినాదాన్ని ముందుకు తీసుకువచ్చారు. దానికి సరైన ప్రణాళికలు పగడ్బంధీగా అమలు జరపడం అవసరం.
బిసిల పై పగబట్టిన కెసిఆర్
గత పదేళ్ళలో టిఆర్ఎస్ ప్రభుత్వం బీసీ , ఎస్సీ , ఎస్టీల అభివృద్ధి ప్రణాళికలను అస్తవ్యస్తంగా మార్చింది. బీసీ కార్పొరేషన్ , ఎస్సీ , కార్పొరేషన్ ఆయా కులవృత్తి కార్పొరేషన్లను పడుకోబెట్టింది. కొత్త పేర్లతో ముందుకు వచ్చింది. కులం పేరిట కులవృత్తుల పేరిట చేసే స్కీములు విద్యావంతులకు ఉపయోగపడవు. బీసీ పేరిట చేపట్టే స్కీములు సాధారణంగా విద్యావంతులకు , నిరుద్యోగులకు స్వయం ఉ పాధికి ఉపయోగపడతాయి. ఆ స్కీములో ప్రైవేటు స్కూళ్ళు , కాలేజీలు కూడా పెట్టుకోవచ్చు. అనేక రకాల వ్యాపారాలు చేసుకోవచ్చు. సూపర్ మార్కెట్లు , సినిమా హాళ్ళు , కోల్డ్ స్టోరేజీలు , గోదాములు ఏర్పాటు చేసుకోవచ్చు. పరిశ్రమలు స్థాపించి , తాము ఉపాధి పొందుతూ మరో పది మందికి ఉపాధి కల్పించవచ్చు.
ఇది ఎంత సులభసాధ్యమో దళిత ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ఆఫ్ ఇండియా ( డిక్కీ ) అనే సంస్థ సాధిస్తున్న విజయాలు చూడవచ్చు. కేవలం పదేళ్ళలో మిలియనీర్లు బిలియనీర్లుగా దళిత మహిళలు , పురుషులు ఎదిగారు. పద్మశ్రీలు కూడా వారిని వరించాయి.
అలా ఆదర్శవంతంగా నిర్వహిస్తే బీసీ కార్పొరేషన్ ద్వారా పెట్టే పెట్టుబడులు సంపదను సృష్టిస్తాయి. ఉపాధిని కల్పిస్తాయి. దాంతో ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది. ఎందుకో గాని కేసిఆర్ పైకి ఏం చెప్పినా లోపల మాత్రం బీసీల పై పగ బట్టారు. బీసీల కోసం ఏ ఒక్క సీమన్ను బీసీల పేరిట గత ఎనిమిదేళ్ళుగా అమలు జరపకుండా నిలిపివేశారు.
బీసీల కోసం ఓవర్సీస్ ఉన్నత విద్య స్కీమ్ యేటా 300 మందిని ఇతర దేశాలకు పంపించే స్కీమ్ మాత్రం కొనసాగుతున్నది. అలాగే విద్యారంగంలో గురుకుల పాఠశాలలు మాత్రం కొనసాగుతున్నాయి. ఉపాధి కల్పనలో బీసీ విద్యావంతులకు చేసిందేమీ లేదు. బీసీలు ఓటు వేయకుండా ఎవరూ గెలవరు. అయినప్పటికీ బీసీల పట్ల ఇంత చిన్న చూపు కొనసాగించారు. బడ్జెట్లో జనాభా దామాషా ప్రకారం బీసీలకు మొత్తం సగం బడ్జెట్ కేటాయించి రకరకాల స్కీములను అమలు చేయడం అవసరం. మహిళలకు ఉచిత బస్సు ఎంత గొప్ప మలుపు తెచ్చిందో అలా బీసీల కోసం చేపట్టే పథకాలు బీసీల జీవితాల్లో అంత గొప్ప మలుపు తీసుకురావడం అవసరం.