
వర్సిటీ పేరు మార్పు పాలనా సౌలభ్యం కోసమే: రేవంత్
తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో అనేక వర్సిటీల పేర్లు మార్చుకున్నాం. పరిపాలనా సౌలభ్యం కోసమే ఈ ప్రక్రియ ప్రారంభించాం.
తెలుగు వర్సిటీ పేరు నుంచి పొట్టి శ్రీరాములు పేరు తొలగించడంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు వర్సిటీ పేరు మార్పు బిల్లులను ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరుతో యూనివర్సిటీలు, సంస్థలు ఉంటే పరిపాలనా పరమైన సమస్యలు వస్తాయన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అందుకే తెలంగాణలోని యూనివర్సిటీలు, సంస్థలకు తెలంగాణ సంబంధిత పేర్లే పెడుతున్నట్లు వివరించారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ, తెలుగు వర్సిటీ పేరు మార్పు తదితర బిల్లులను ప్రేశపెట్టారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగానే చర్లపల్లి రైల్వేస్టేషన్ టర్మినల్‌కు పొట్టిశ్రీరాములు పేరు పెట్టాలని ఆయన ప్రతిపాదించారు.
‘‘తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో అనేక వర్సిటీల పేర్లు మార్చుకున్నాం. పరిపాలనా సౌలభ్యం కోసమే ఈ ప్రక్రియ ప్రారంభించారు. ఈ క్రమంలోనే కొన్ని వర్సిటీలకు ప్రొఫెసర్ జైశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, పీవీ నరసింహరావు, కాళోజీ నారాయణరావు పేర్లు పెట్టుకున్నాం. అదే ఒరవడిలో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు పెట్టాలని ఆలోచించారు. తెలంగాణ సమాజానికి సురవరం ప్రతాప్‌రెడ్డి ఎంతో సేవ చేశారు. గోల్కొండ పత్రికను సురవరం నడిపారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్చడం ఎవరికీ వ్యతిరేకం కాదు’’ అని చెప్పారు.
‘‘బల్కంపేట్‌లో నేచర్ క్యూర్ ఆస్పత్రికి రోశయ్య పేరు పెడతాం. ఆయన సుదీర్ఘ అనుభవం గల నేత. గవర్నర్‌గా, సీఎంగా సేవలందించారు. నేచర్‌క్యూర్ ఆస్పత్రి సమీపంలో రోశయ్య విగ్రహం నె8లకొల్పి అధికారికంగా ఆయన జయంతి, వర్థంతి కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఆయనపై, ఆర్యవైశ్య సమాజంపై ప్రభుత్వానికి అపారమైన గౌరవం, నమ్మకం, విశ్వాసం ఉంది. కులం, మతం పేరుతో రాజకీయ ప్రయోజనాలు పొందానుకోవడం సరికాదు. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు లేఖ రాస్తా’’ అని సీఎం తెలిపారు.