
‘అక్రమ నీటి వినియోగాన్ని ఆపాల్సిందే’.. కేఆర్ఎంబీకి తెలంగాణ సర్కార్ లేఖ
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని వినియోగించుకుంటున్న అంశాన్ని 2024 నవంబర్ నుండి ప్రతినెల కేఆర్ఎంబీకి ఈఎన్‌సీ లేఖల రూపంలో ఫిర్యాదు చేసిందని తెలిపారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వాటర్ వార్ నడూస్తూనే ఉంది. ఇందులో ఇరు రాష్ట్రాల వారు తమ తరపు వాదనలు వినిపిస్తున్నప్పటికీ ఈ నీటి వివాదం తెగడం లేదు, ముడిపడటం లేదు. కృష్ణజలాల విషయంలో ఈ రెండు రాష్ట్ర మధ్య వివాదం ఎప్పుడు రగులుతూనే ఉంది. దీంతో ఈ అంశానని ఎలాగైనా తెగ్గొట్టేయాలని, సమస్యను పరిష్కరించాలని కేంద్రం రంగంలోకి దిగింది. ఈ మేరకు శుక్రవారం కేఆర్ఎంబీ సమావేశం నిర్వహించినా.. అందుకు ఏపీ సర్కార్ హాజరుకాకపోవడంతో సమావేశం సోమవారానికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ పాల్పడుతున్న అక్రమ నీటి వినియోగానికి అడ్డుకట్ట వేయాలంటూ తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా.. కేఆర్ఎంబీకి లేఖ రాశారు. అక్రమంగా తరలిస్తున్న నీటిని కేఆర్ఎంబీ ఎట్టిపరిస్థితుల్లో అడ్డుకుని తీరాలని ఆయన తన లేఖలో కోరారు.
కృష్ణ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న అక్రమ ధోరణిని వివరిస్తూ కేఆర్ఎంబీ ఛైర్మన్ అతుల్ జైన్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందించారు రాహుల్ బొజ్జా. శ్రీశైలం తో పాటు నాగార్జున సాగర్ నుండి నిబంధనలను ఉల్లంఘించి తరలించుకు పోతున్న నీటిని తక్షణమే నిలిపివేయాలని ఆయన కోరారు. కేఆర్ఎంబీ రికార్డుల ప్రకారమే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తనకున్న హక్కులను మించి నీటిని వినియోగించుకుందన్నారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని వినియోగించుకుంటున్న అంశాన్ని 2024 నవంబర్ నుండి ప్రతినెల కేఆర్ఎంబీకి తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ లేఖల రూపంలో ఫిర్యాదు చేసిందని తెలిపారు.
అయినా కేఆర్ఎంబీ పట్టించుకోకుండా ఉపేక్షించడంతో ఇప్పుడు ఈ సమస్య జఠిలంగా మారిందన్నారు. ఉమ్మడి జలాశయాల నుండి ఏకపక్షంగా నీటిని తరలించుకుని పోయే హక్కు ఆంద్రప్రదేశ్‌కు ఎక్కడిది? అని ప్రశ్నించారు. ఈ ఏడాది మే చివరి నాటికి తెలంగాణకు తాగునీరు, సాగునీరు కలుపుకుని 107 టీఎంసీల నీరు అవసరం ఉందని వివరించారు. తద్వారా కృష్ణా పరివాహక ప్రాంతంలోని 13 లక్షల ఎకరాలలో వేసిన రబీ పంటలను కాపాడడంతో పాటు, కృష్ణా బేసిన్ పరిధిలోని రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన రెండుకోట్ల మంది ప్రజల దాహార్తిని తీర్చాలని కేఆర్ఎంబీని కోరారు.
ఇప్పటికే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం 650 టీఎంసీల నీటిని వినియోగించుకుందన్నారు. తెలంగాణా రాష్ట్రం 225 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకుంది. రాష్ట్ర విభజన తరువాత 2014-15 లో రెండు తెలుగు రాష్ట్రల మధ్యన కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 66:34 నిష్పత్తిలో కృష్ణాజలాల పంపకం జరగాల్సి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ప్రస్తుతం 75:25 నిష్పత్తిలో నీటిని వాడుకుందని ఆయన తెలిపారు. ఇప్పటికే తెలంగాణకు కావాల్సిన నీటి అవసరాలను, వివరాలను సమగ్రంగా అందించామని, దాని ప్రకారం తెలంగాణకు కావాల్సిన 116 టీఎంసీల నీటిని అందించాలని ఆయన కోరారు. వీటిలో ఎంజీకే, ఎల్ఐఎస్‌కు 24 టీఎంసీలు, ఎస్ఎస్ఎల్‌కి 58 టీఎంసీలు, ఏఎంఆర్‌పీకి 34 టీఎంసీలు జూన్ చివరినాటికి మాసంతానికి అవసరం ఉంటాయని ఆయన తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న 72 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి ఉత్తర్వులు తక్షణమే విడుదల చేయాలని కోరారు.