Telangana Talli | వైరల్ అవుతున్న తెలంగాణ తల్లి విగ్రహ నమూనా..!
తెలంగాణ తల్లి విగ్రహంపై తెలంగాణలో మరోసారి రాజకీయ రగడ మొదలైంది. తెలంగాణ తల్లి కొత్త విగ్రహం నమూనాపై బీఆర్ఎస్ వర్గాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
తెలంగాణ తల్లి విగ్రహంపై తెలంగాణలో మరోసారి రాజకీయ రగడ మొదలైంది. బీఆర్ఎస్ హయాంలో రూపొందించిన విగ్రహం అచ్చం ఎమ్మెల్సీ కవితలా ఉందంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. కాగా తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహ నమూనా అంటూ ఒక ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిశ్చియించుకుంది. ఈ క్రమంలో ఈ ఫొటో సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. దీంతో ఇప్పుడు ఈ ఫొటో మరోసారి తెలంగాణ తల్లి వివాదానికి ఆజ్యం పోసింది. ఈ విగ్రహ నమూనాపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను మార్చడం ద్వారా రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు చెరిపివేయాలని కాంగ్రెస్ పన్నాగాలు పన్నుతోందని బీఆర్ఎస్ శ్రేణులు విమర్శిస్తున్నాయి. అయితే ఇది అధికారిక నమూనానా కాదా అనేది తెలియదు. ప్రభుత్వమే స్వయంగా ఈ నమూనాను విడుదల చేసిందని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది.
విగ్రహం ఎలా ఉందంటే..
ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న తెలంగాణ తల్లి విగ్రహం.. ఆకుపచ్చ రంగు చీర, ఎర్ర రంగు జాకెట్ ధరించి ఉంది. ఎడమ చేతిలో కంకులు పట్టుకుని ఉంది. అదే విధంగా మెడలో మూడు బంగారు ఆభరణాలతో కనిపిస్తోంది. కుడి చేత్తో దీవిస్తూ కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం.. తెలంగాణకు సంబంధించిన అన్ని విషయాలను మరుస్తోంది. తెలంగాణ గేయాన్ని కూడా ఇటీవల మార్చింది. ఇప్పుడు తెలంగాణ తల్లిని మారుస్తోంది.
వివాదం ఇదే..
బీఆర్ఎస్ హయాంలో రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం కవిత పోలికలను కలిగి ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. అంతేకాకుండా ఆ విగ్రహం దొరసానిలా ఉందని కూడా అప్పట్లో కాంగ్రెస్ విమర్శించింది. దీంతో ఇప్పుడు కొత్తగా వైరల్ అవుతున్న తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం ప్రారంభించారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపివేయాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని, తెలంగాణ తల్లి రూపు మార్పు కూడా అందులోని భాగమేనని బీఆర్ఎస్ ఆరోపించింది. ఓ సాధారణ మహిళ తరహాలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తున్నామని కాంగ్రెస్ చెప్తోందని, తెలంగాణ తల్లి విగ్రహం ఒక ధనిక మహిళగా ఉంటా వచ్చిన నష్టం ఏంటని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే తెలంగాణ తల్లికి రేవంత్ రెడ్డి కూతురు పోలికలు వచ్చాయని కూడా విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే గత విగ్రహానికి, ఈ నూతన విగ్రహానికి మధ్య చాలా తేడాలే ఉన్నాయి.
తెలంగాణ పాత, కొత్త తల్లుల మధ్య తేడాలివే..
పాత తెలంగాణ తల్లి విగ్రహంలో తెలంగాణ తల్లి జరీ అంచు పట్టు చీర ధరించగా.. కొత్త విగ్రహంలో పుసుపు పచ్చ అంచు ఉన్న ఆకుపచ్చ రంగు చీర ధరించి కనబడుతోంది. పాత విగ్రహంలో తలకు కిరీటం, చేతిలో బతుకమ్మ ఉండగా.. కొత్త విగ్రహంలో ఆ రెండూ లేవు. గత విగ్రహంలో తెలంగాణ తల్లి బంగారు గాజులు వేసుకుని ఉండగా నూతన విగ్రహంలో మట్టి గాజులు ధరించి ఉంది. గత విగ్రహం రాజమాతలా ఉందనే విమర్శలు రాగా.. కొత్త విగ్రహం సాధారణ మహిళ రూపాన్ని తలపిస్తోంది. పాత విగ్రహంలో వెండి మెట్టెలు, నగలు ధరించి ఉండగా.. కొత్త విగ్రహం కేవలం మెడలో కంటి ఆభరణం మాత్రమే కనిపిస్తోంది. పాత విగ్రహం కుడి చేతిలో కంకులు ఉండగా.. కొత్త విగ్రహం అభయహస్తం చూపుతోంది. పాత విగ్రహం ఎడమ చేతిలో బతుకమ్మ ఉండగా.. కొత్త విగ్రహం ఎడమ చేతిలో వరి, జొన్న, సజ్జ కంకులు ఉన్నాయి. రెండు విగ్రహాల రూపాల్లో కూడా స్పష్టమైన తెడా కనిపిస్తోంది. అయితే ఈ కొత్త విగ్రహం నమూనాపై ప్రొఫెసర్ దాసోజు శ్రావణ్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు.
పూర్వకాలంలో భారతదేశంపై
— Prof Dasoju Sravan Kumar (@sravandasoju) December 6, 2024
విదేశీయులు దండయాత్రలు చేసి, దేవతావిగ్రహాలను విధ్వసం చేసినట్లు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే పంథాలో పయనిస్తూ తెలంగాణ చరిత్రపై దాడి చేస్తుండు, ఉద్యమ చిహ్నాలపై దాడి చేస్తుండు... @TelanganaCMO @revanth_anumula
తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి… pic.twitter.com/IIrCgUj59D
దాసోజు శ్రావణ్ ఏమన్నారంటే..
‘‘పూర్వకాలంలో భారతదేశంపై విదేశీయులు దండయాత్రలు చేసి, దేవతావిగ్రహాలను విధ్వసం చేసినట్లు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే పంథాలో పయనిస్తూ తెలంగాణ చరిత్రపై దాడి చేస్తుండు, ఉద్యమ చిహ్నాలపై దాడి చేస్తుండు. తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి విధ్వంసం చేస్తుండు, కాకతీయ కళాతోరణంపై కుల వివక్ష చూపిస్తుండు. చార్మినార్ ఆనవాళ్లను చెరిపివేయాలనే కుట్రలు చేస్తుండు. బాబాసాహెబ్ విగ్రహాన్ని కేసీఆర్ నిర్మించాడనే కోపంతో అవమానిస్తునుండు.
తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
తిరిగి కుందేటి కొమ్మ్ము సాధింపవచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు’’ అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.