Telangana Industrial Projects | రూ.12,626 కోట్లతో 1901 పరిశ్రమలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది కాలంలో రూ.12,626 కోట్ల పెట్టుబడితో 1901 పరిశ్రమలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన డాక్యుమెంట్ లో పేర్కొంది.
తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది కాలంలో రూ.రూ.12,626 కోట్ల పెట్టుబడితో 1901 పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల 49,384 మందికి ఉపాధి లభించిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురువారం సచివాలయంలో వెల్లడించారు. ఏడాది ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా పరిశ్రమల శాఖ సాధించిన లక్ష్యాలు,విజయాలను మంత్రి వివరించారు.ఈ ఏడాది మొత్తం 409 యూనిట్లు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయని, మిగతావి వివిధ దశల్లో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.
- తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్టుల ఆమోదం కోసం టీజీ ఐపాస్ స్వీయ-ధృవీకరణ వ్యవస్థను ఏర్పాటు చేసి, ఎండ్ టు ఎండ్ ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారా పరిశ్రమలను ప్రారంభించడానికి అన్ని అనుమతులు అందిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. టీజీ ఐపాస్ లో 27 ప్రభుత్వశాఖలకు సంబంధించిన 103 క్లియరెన్స్,అప్రూవల్‌లు వచ్చాయన్నారు.రూ.9,646 కోట్ల పెట్టుబడితో 882 యూనిట్లు నెలకొల్పేందుకు దరఖాస్తులు వచ్చాయి.
ఏడాది కాలంలో అనుమతులు పొందిన ప్రధాన పరిశ్రమలు
- కేన్స్ సెమికాన్ ప్రైవేట్ లిమిటెడ్ (రూ. 2,700 కోట్ల పెట్టుబడి)
- మహారాష్ట్ర సీమ్‌లెస్ లిమిటెడ్ (రూ. 258.21 కోట్ల పెట్టుబడి)
- బాక్టోలాక్ న్యూట్రాస్యూటికల్స్ లిమిటెడ్ (రూ. 194 కోట్ల పెట్టుబడి)
- జీఎం నెక్సస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (రూ. 192 కోట్ల పెట్టుబడి)
-ఆర్ఎంజీ వెరిటబుల్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (రూ. 127.27 కోట్ల పెట్టుబడి).
పెట్టుబడులకు ప్రోత్సాహం
2023 డిసెంబరు నుంచి రూ.272.24 కోట్లను జనరల్ కేటగిరీ వ్యవస్థాపకులు ప్రమోట్ చేసిన యూనిట్లకు ప్రోత్సాహకంగా మంజూరు చేశారు.ఎస్సీ పారిశ్రామికవేత్తలు నెలకొల్పిన 2623 యూనిట్లకు రూ.159.63 కోట్లు,ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.350.87 కోట్లు,పీహెచ్‌సీ పారిశ్రామికవేత్తలకు రూ.14.00 కోట్లను ప్రోత్సాహకంగా ప్రభుత్వం మంజూరు చేసింది.
మెగా ప్రాజెక్ట్‌లు
రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు లేదా 1000 మంది కంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించే మెగా ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపింది. 16 మెగా ప్రాజెక్ట్‌ల కింద రూ.14,433 కోట్ల పెట్టుబడితో 8,894 మందికి ఉపాధి అవకాశాలను కల్పించారు.ములుగు జిల్లా కమలాపూర్(వి) వెనుకబడిన ప్రాంతంలో మూతపడిన బిల్ట్ ప్రాజెక్ట్ పునరుద్ధరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. రాష్ట్రంలో మైక్రో,స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ పాలసీ 2024ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అవుటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డుల మధ్య 10 కొత్త పారిశ్రామిక పార్కులు అభివృద్ధి చేయనున్నారు.రాష్ట్ర ప్రభుత్వం 119 నియోజకవర్గాల్లో మహిళల కోసం ఫ్లాట్ ఫ్యాక్టరీలను నిర్మిస్తుంది.
Next Story