
పీవీ స్వగ్రామం వంగర
పీవీ పేరు స్మరిస్తారు, వంగరను విస్మరించారు
పీవీ నరసింహారావును పేరును వాడుకుంటూ ఊరుని వదిలేసిన సొంతరాష్ట్రం తెలంగాణ
(పీవీ స్వగ్రామం వంగర నుంచి చెప్యాల ప్రవీణ్‌తో కలిసి సలీం షేక్)
చుట్టూ కొండలు...ఎటు చూసినా పచ్చని పొలాలు...నీటితో నిండుకుండలా మారి ఆహ్లాదాన్ని పంచుతున్న చెరువు...మధ్యలో వెలసిన వంగర గ్రామం (Vangara village) పూర్వ ప్రధానమంత్రి, భారతరత్న(Bharat Ratna) పాములపర్తి వెంకట నరసింహారావు (పీవీ)(P. V. Narasimha Rao) పుట్టిన ఊరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం నుంచి దేశ ప్రధానమంత్రి దాకా పలు కీలక పదవులు నిర్వర్తించిన పీవీ జన్మస్థలం వంగర అభివృద్ధికి నాడు పీవీతోపాటు పాలకులు ఇచ్చిన హామీలు నీటి మీద రాతలుగా మారాయి. దేశ ప్రధానమంత్రిగా పీవీ 1991 జూన్ 21 వతేదీన పదవీ బాధ్యతలు స్వీకరించగానే తన ఊరైన వంగర రూపురేఖలు మారుతాయని గ్రామస్థులు ఆశలు పెట్టుకున్నారు.800 ఇళ్లు, మూడు వేల జనాభా ఉన్న వంగర కుగ్రామంలో అభివృద్ధి పనులు అసంపూర్తిగానే ఉన్నాయి.
- కానీ వంగరలో అభివృద్ధి ఛాయలు అంతంతమాత్రమే.ఇతర ప్రధానమంత్రులు పుట్టిన ప్రాంతాలు అభివృద్ధి చేసినా పీవీ స్వగ్రామం వంగరలో మాత్రం ఆశించిన ప్రగతి కనిపించడం లేదు.వంగరకు ఇచ్చిన వరాలు నీటిమూటలుగా మారగా నేడు గ్రామం అభివృద్ధికి దూరంగా సమస్యలతో సహజీవనం చేస్తుంది. ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధుల బృందం వంగర గ్రామంలో పర్యటించగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఆ విశేషాల సమాహారమే ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రత్యేక కథనం...
ఎక్కడ వేసిన పనులు అక్కడే...అసంపూర్తిగానే...
హైదరాబాద్ నగరానికి 171 కిలోమీటర్ల దూరంలో ఉన్న హన్మకొండ జిల్లా భీందేవరపల్లి మండలం వంగర గ్రామం ఉంది. పీవీ శత జయంతి ఉత్సవం జరిగి నాలుగేళ్లు గడచినా నాడు పీవీ స్వగ్రామం వంగర అభివృద్ధికి ఇచ్చిన హామీలు నెరవేరలేదు. వంగరలో పీవీ స్మృతి వనం,పీవీ విజ్హానవేదిక నిర్మిస్తామని పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా 2022వ సంవత్సరంలో నాటి కేసీఆర్ సర్కారు ప్రకటించింది. వంగరకు తెలంగాణ సర్కారు రూ.11కోట్లు కేటాయించినా, పూర్తి నిధులు కేటాయించలేదు. దీంతో పీవీ స్మృతి వనం,పీవీ విజ్హానవేదిక నిర్మాణాలు నేటికి అసంపూర్తిగానే ఉన్నాయి. పీవీ ధ్యానమందిరం నిర్మాణం కేవలం ఐరన్ రాడ్లకే పరిమితమైంది.వంగరలో సోలార్ ప్లాంటు నిర్మించినా స్థానికులకు ఉద్యోగాలివ్వలేదు. గ్రామంలో ఫుడ్ పార్కు ఇంకా నిర్మాణంలోనే ఉంది.స్థానిక యువకులు ఉద్యోగాల్లేక నానా అవస్థలు పడుతున్నారని గ్రామస్థులు ఆవేదనగా చెప్పారు.
నాటి పర్యాటక శాఖ మంత్రి హామి ఏమైంది?
వరంగల్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలతోపాటు వంగర గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని 2020వ సంవత్సరంలో నాటి పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చాలా గొప్పగా ప్రకటించారు. ఆయన వంగరలో మ్యూజియాన్ని ఏర్పాటు చేసి, గ్రామాన్ని టూరిజం కేంద్రంగా మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తనని అదే పనిగా పంపించారని చెప్పారు.పీవీ స్వగృహంలో ఆయన వాడిన వస్తువులతోపాటు ఆయన జ్ఞాపకాలతో మ్యూజియాన్ని ఏర్పాటు చేసి..దాన్ని విద్యార్థులతోపాటు తెలంగాణలోని ప్రతి పౌరుడు సందర్శించే విధంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రికి నివేదిక సమర్పిస్తానని శ్రీనివాసగౌడ్ పేర్కొన్నారు.కానీ ఏమైంది ఆ తర్వాత ఏమీ జరగలేదు.
వంగర వాగుపై వంతెన ఏది?
ఇప్పటికీ భారీవర్షం వస్తే వంగర గ్రామానికి బయటి గ్రామాలతో సంబంధాలు తెగిపోతున్నాయి. వంగర వాగు పొంగి రాకపోకలు నిలిచిపోతుంటాయి. వంగర వాగుపై వంతెన నిర్మించాలనే గ్రామస్థుల చిరకాల డిమాండ్ నేటికీ నెరవేరలేదు. ఇదీ పీవీ గ్రామ దుస్థితి.
మోడల్ విలేజ్ ఎక్కడ?
పీవీ ప్రధాని కాగానే అప్పటి కేంద్రమంత్రి రామేశ్వర్ ఠాకూర్ తన ప్రతినిధి బృందంతో కలిసి వంగర గ్రామాన్ని సందర్శించారు. వంగరను మోడల్ విలేజ్ గా అభివృద్ధి చేస్తామని నాడు రామేశ్వర్ ఠాకూర్ ప్రకటించారు. కానీ ఎలాంటి పనులు చేయలేదని వంగర గ్రామ మాజీ సర్పంచ్ కండే రమేష్. ‘‘వంగరలో తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణమండపం నిర్మిస్తామని ప్రకటించినా అది నెరవేరలేదు. నిత్య కరవు పీడిత ప్రాంతమైన వంగర పొలాలను సస్యశ్యామలం చేయడానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాల్వను వంగర మీదుగా నిర్మిస్తామని చెప్పినా, ఆ కాల్వ హుజురాబాద్ మీదుగా డిజైన్ మారి దారి మళ్లింది.’’ అని రమేష్ వివరించారు.
వంగరలో ఏర్పాటు కాని పీవీ మ్యూజియం
పీవీ మరణించాక ఢిల్లీలో అతను వాడిన వస్తువులు ఢిల్లీ నుంచి తన స్వగ్రామమైన వంగరకు తరలించారు. పీవీ కూర్చున్న కుర్చీలు, మంచం,ఫర్నిచర్, వ్యక్తిగత కారు, పెన్నులు, పుస్తకాలను వంగరలోని దొర గడీకి తీసుకువచ్చారు. కానీ వంగరలో పీవీ మ్యూజియం మాత్రం ఏర్పాటు చేయలేదు. వంగరను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామనే సర్కారు హామీ నేటికి నెరవేరలేదని ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధుల బృందం పర్యటనలో తేలింది. 2004వ సంవత్సరం డిసెంబరు 23వతేదీన పీవీ పరమపదించారు.కాంగ్రెస్ పార్టీ పీవీని పట్టించుకోలేదు.పీవీ మరణానంతరం ఆయన ఇంటిని మ్యూజియంగా మారుస్తామని హామి ఇచ్చినా నెరవేర్చలేదు. గ్రామంలో కనీసం విగ్రహం ఏర్పాటు చేయకపోవడంతో గ్రామస్థులే చందాలు వేసుకొని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తమ గ్రామస్థులే చందాలు వేసుకొని గ్రామం నడిబొడ్డున పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని గ్రామ మాజీ సర్పంచ్ కండే రమేష్ చెప్పారు.
మోదీ టీ విక్రయించిన రైల్వేస్టేషన్ రూపురేఖలు మార్చారు...
ప్రస్థుత ప్రధానమంత్రి నరేంద్రమోదీ టీ విక్రయించిన వాద్ నగర్ రైల్వేస్టేషన్ ను 2021వ సంవత్సరంలో ఆధునీకరించారు. అధునాతన హంగులతో ఈ రైల్వేస్టేషన్ ను అభివృద్ధి చేశారు. మోదీ జన్మదినం సందర్భంగా ఐఆర్ సీటీసీ వాద్ నగర్ రైల్వేస్టేషనులో ఫుడ్ ప్లాజాను ప్రారంభించింది.వాద్ నగర్ రైల్వేస్టేషను ప్లాట్ ఫాంపై మోదీ టీ విక్రయించిన స్థలంలో ప్రస్థుతం ఆధునిక ఫుడ్ ప్లాజాను నిర్మించారు. 52 మంది ప్రయాణికులు కూర్చునేలా టీ థీమ్ తో దీన్ని నిర్మించారు. మోదీ గుర్తుగా కటింగ్ చాయ్ నుంచి జాస్మిన్, ఎర్ల్ గ్రే, గ్రీన్ టీ అందుబాటులో ఉంచారు. రైల్వేస్టేషన్ ప్రవేశద్వారం వద్ద వింటేజ్ టీ స్టాల్ సంప్రదాయ టీ కార్నర్ ఏర్పాటు చేశారు.
‘‘దేశానికి రాజైనా వంగరకు కన్నబిడ్డే...’’
నాడు 1994వ సంవత్సరంలో అప్పటి ప్రధానిగా ఉన్న పీవీ తన స్వగ్రామమైన వంగర పర్యటనకు హెలికాప్టరులో వచ్చారు. నాడు వంగర మైదానంలో హెలికాప్టరు దిగగానే రెడ్ కార్పెట్ వేసినా, దూరంగా వెళ్లి అక్కడి నేలను ముద్దాడి తాను దేశానికి రాజైనా వంగరకు కన్నబిడ్డేనని ప్రకటించారు. నాడు వంగర గ్రామంలోని తన చిన్ననాటి స్నేహితులైన చొల్లేటి భద్రయ్య, చిట్టి అదారెడ్డి, ఒదెలు, ఇతర గ్రామ పెద్దలను తన ఇంట్లో సమావేశమైన పీవీ వంగరకు పలు వరాలు ప్రకటించారు. నాటి ప్రధాని పర్యటనకు జాతీయ మీడియా వచ్చింది. నాడు పీవీ దొర ప్రకటించిన వరాలు ఆచరణలో నెరవేరలేదని చెబుతున్నారు వంగరవాసులు ముక్తకంఠంతో.
ఆది నుంచి పీవీకి గుర్తింపు ఏది?
దేశానికి ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి అభివృద్ధికి కొత్త బాటలు వేసిన మహా మేధావి పీవీకి కాంగ్రెస్ నేతలు ఆది నుంచి ఆశించిన గుర్తింపు ఇవ్వలేదు. ఇంతటిఘనత ఉన్నా పీవీని తెలంగాణ నేతలే గుర్తించడం లేదు. ఆయన స్మృతివనం వంగరలో ఇంకా అసంపూర్తిగానే ఉంది. నాడు పీవీ దేశ ప్రధానిగా పనిచేసినా ఢిల్లీలో కనీసం ఘాట్ నిర్మించలేదు. ఢిల్లీలో అతనికి స్మృతి వనమే లేదు. పీవీ అంత్యక్రియలకు ఢిల్లీలో స్థలం కేటాయించలేదు. దీంతో పీవీ పార్థివదేహాన్ని హైదరాబాద్ తీసుకువచ్చి నెక్లెస్ రోడ్డులో అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో చేసినా, అప్పట్లో శవం సరిగా కాల్చలేదని వార్తలు వచ్చాయి.హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్డుకు పీవీ మార్గ్ అని నామకరణం చేసి చేతులు దులుపుకున్న తెలంగాణ పాలకులు ఆయన స్వగ్రామమైన వంగరను మాత్రం విస్మరించారు.
సీఎం నుంచి పీఎం దాకా...
వంగర ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు 1991 జూన్ 21 వతేదీ నుంచి 1996 మే 16వతేదీ వరకు దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. అంతకుముందు పీవీ కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా, కేంద్ర హోంశాఖ మంత్రిగా కీలక శాఖలను పర్యవేక్షించారు. 1971 సెప్టెంబరు 30వతేదీ నుంచి 1973 జనవరి 10వతేదీ వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పీవీ పనిచేశారు.
మహారాష్ట్ర నుంచి పీవీ ప్రాతినిథ్యం
ఒడిశా రాష్ట్రంలోని బెర్హంపూర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల,హన్మకొండ, మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి లోక్ సభకు పీవీ ఎన్నికయ్యారు.హన్మకొండ నుంచి రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు. మూడోసారి ఓటమితో పీవీ మహారాష్ట్రలోని రాంటెక్ లోక్ సభ నియోజకవర్గానికి వలస వెళ్లారు. 1957 నుంచి 1977 వ సంవత్సరం వరకు మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు.
పొరుగు రాష్ట్రాల నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యం
సొంత రాష్ట్రమైన తెలంగాణలో పీవీని ప్రజలు ఆదరించక పోవడంతో ఆయన పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల లోక్ సభ నియోజకవర్గాలకు వలసవెళ్లి అక్కడి నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. ఆ కోపంతోనే అప్పట్లో పీవీ తన స్వగ్రామమైన వంగరను పట్టించుకోలేదంటారు ఆ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కండే రమేష్. ‘‘ప్రధాని అయ్యాక వంగర అభివృద్ధికి పీవీ దొర ఎన్నెన్నో వరాలు ప్రకటించారు, కానీ వాటిని నెరవేర్చలేదు, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మా గ్రామం అభివృద్ధిని విస్మరించింది’’అని కండే రమేష్ వ్యాఖ్యానించారు
భారతరత్న పీవీ
భారతరత్న పీవీ బహుభాషా కోవిదుడు. పీవీ ఉస్మానియా యూనివర్శిటీ నుంచి బీఏ, నాగపూర్ యూనివర్శిటీ నుంచి ఎల్ఎల్ ఎం చదివారు.పీవీకి 8 మంది పిల్లలు. పీవీ కుమార్తె సురభి వాణిదేవి ప్రస్థుతం పీవీ వారసురాలిగా తెలంగాణలో ఎమ్మెల్సీగా పనిచేస్తున్నా, తన జన్మస్థలమైన వంగర అభివృద్ధిని మాత్రం విస్మరించారు.
నాడు పీవీ ఇల్లు కళకళ...నేడు వెలవెల
అప్పట్లో నక్సలైట్ల ప్రాబల్యం ఉన్న వంగర గ్రామంలో ప్రధానిగా ఉన్న పీవీ సొంత ఇంటికి కాపలాగా 60 మంది సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్ తో పహరా ఏర్పాటు చేశారు. నాడు ప్రధాని ఇల్లు పర్యాటక కేంద్రంగా కళకళలాడేది. పీవీ ప్రధానమంత్రిగా ఉన్నపుడు వంగర గ్రామం ఓ వెలుగు వెలిగింది. పీవీ మరణానంతరం వంగరను నేతలు విస్మరించారు. కానీ నేడు వంగరలోని పీవీ ఇల్లు కళ కోల్పోయింది. పీవీకి 8మంది పిల్లలున్నా, వారు పట్టించుకోలేదు. వంగర చెరువును మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దలేదు.పీవీ జిల్లాను ఏర్పాటు చేయాలని, ఢిల్లీలో పీవీ స్మారకార్థం ఘాట్ ఏర్పాటు చేయాలని,పీవీకి భారతరత్న ఇవ్వాలని, అతని పేరిట యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ 48 గంటల పాటు వంగరవాసులంతా రిలే నిరాహార దీక్షలు చేశామని, దీంతో కేంద్రం పీవీకి భారతరత్న ప్రకటించిందని మాజీ సర్పంచ్ కందే రమేష్ చెప్పారు.
అభివృద్ధి అంతంత మాత్రంగానే...
వంగర గ్రామంలో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉందని పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో గ్రామ సర్పంచ్ గా పనిచేసిన రఘునాయకుల వెంకట్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.‘‘మా గ్రామంలో పీవీ పదెకరాల స్థలంలో 70 మంది ఎస్పీలు, బీసీలకు పక్కాఇళ్లు నిర్మించి ఇచ్చారు.సీసీ రోడ్లు, మురుగుకాల్వలు నిర్మించి ఆసుపత్రి, బాలికల పాఠశాల,పోలీస్ స్టేషన్ నిర్మించారు.కానీ గ్రామ పెద్ద సమస్యలు మాత్రం నెరవేరలేదు," అని ఆయన చెప్పారు.పీవీ ప్రధానిగా పనిచేసిన సమయంలో తమ గ్రామానికి ఇదీ కావాలని అడగలేదని వెంకట్ రెడ్డి చెప్పారు.
వంగర వైపు చూడని పీవీ కూతురు
పీవీ కుమార్తె సురభి వాణిదేవి తన స్వగ్రామమైన వంగర అభివృద్ధి వైపు చూడటం లేదు. పీవీ కుమార్తె సురభి వాణిదేవీ ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించారు. వాణిదేవి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండటంతో ఆమె కేవలం పీవీ జయంతి రోజు తప్ప వంగరకు రావడం లేదు. ఇక్కడి సమస్యలు పట్టించుకోవడం లేదు.
మర్చిపోలేని పుట్టిల్లు వంగర
పచ్చని పొలాలు...వరికోతలు...కల్లాలు...కొండలతో అందాల వంగరలో తాను చిన్నతనంలో గడిపానని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి గుర్తు చేసుకున్నారు. ‘‘పీవీ కుమార్తెగా పుట్టడం నా అదృష్టం. క్లాసులో పాఠాలు చెప్పిన అనుభవంతో నేడు రాజకీయాల్లోకి వచ్చాను’’అని వాణిదేవి చెప్పారు. నా తండ్రి పీవీ ఆలోచనలకూ, ఆశయాలకూ కృషి చేస్తానని ప్రకటించిన సురభి వాణీదేవి వంగర అభివృద్ధిని విస్మరించారని గ్రామస్థులు ఆరోపించారు.
వంగరను అభివృద్ధి చేస్తాం : పొన్నం ప్రభాకర్, తెలంగాణ మంత్రి
పీవీ పీఎంగా ఉన్న సమయంలో రాజకీయంగా కీలకంగా వ్యవహరించారని,105వ జయంతి వచ్చే ఏడాది జూన్ 28వతేదీ నాటికి వంగరలో అసంపూర్తి పనులు పూర్తి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. వంగర పర్యాటక కేంద్రంగా రూ.11కోట్లతో పీవీ విజ్హాన వేదిక ప్రవేశ ద్వారం,ఫుడ్ కోర్టు, ఫొటో గ్యాలరీ, ధ్యానమందిరం , సైన్స్ మ్యూజియం, అంపీ థియేటర్, వాటర్ ఫౌంటేషన్, చారిత్రక శిల్పాలు నిర్మించాలనే ప్రతిపాదనలను పరిశీలించి పనులు పూర్తి చేస్తామని చెప్పారు. పీవీ విజ్హానకేంద్రం పనులు వేగవంతం చేస్తామని ఆయన తెలిపారు. హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని వంగరలో పీవీ స్మారక వనం పనులను త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. వంగర గ్రామ వంతెన నిర్మాణానికి నిధులు ఇస్తానని నాడు ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన పీవీ గుర్తుగా వంగరలో టెక్నాలజీ, ఎడ్యుకేషన్, రూరల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇచ్చేలా చేస్తామన్నారు. హన్మకొండ జిల్లాకు కేటాయించే నవోదయ స్కూలును వంగరలో ఏర్పాటు చేస్తామని, దీనిపై కేంద్రానికి తాను లేఖ రాశానని పొన్నం వివరించారు.
వంగరలో వెలుగులేవి?
వంగర ముద్దుబిడ్డ పీవీకి భారతరత్న (Bharat Ratna)దక్కింది... కానీ ఆయన పుట్టిన ఊరు వంగర మాత్రం ఇంకా వెలిగే దీపం కోసం ఎదురు చూస్తోంది!దేశానికి ఆర్థిక సంస్కరణల రూపకర్తగా పేరు పొందిన పీవీ నరసింహారావు జన్మస్థలం వంగర మాత్రం అభివృద్ధి దూరంగా మిగిలింది.పీవీ ప్రధానిగా పనిచేసినప్పటికీ, పాలకులు ఇచ్చిన వంగరకు ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదు. ఇప్పటికీ అయినా పాలకులు మేలుకుని, వంగరను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మాటలు కాదు హామీలు కాదు, అభివృద్ధి కావాలని వంగర వాసులు కోరుకుంటున్నారు.
Next Story