బీఆర్ఎస్ ఐటీ సెల్ హెడ్ కొణతం దిలీప్ అరెస్ట్
x

బీఆర్ఎస్ ఐటీ సెల్ హెడ్ కొణతం దిలీప్ అరెస్ట్

తెలంగాణ పోలీసులు బీఆర్ఎస్ ఐటీ సెల్ హెడ్ కొణతం దిలీప్ ను అదుపులోకి తీసుకున్నారు.


తెలంగాణ పోలీసులు బీఆర్ఎస్ ఐటీ సెల్ హెడ్ కొణతం దిలీప్ ను అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వంపై ఫేక్ ప్రచారాలు చేస్తున్నాడన్న ఆరోపణలపై సీసీఎస్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ డిజిటల్ మీడియా హెడ్ గా పనిచేసిన ఆయన్ని రేవంత్ సర్కార్ కావాలనే ఇబ్బందులకు గురిచేస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కొణతం దిలీప్ అరెస్టును తీవ్రంగా తప్పుబడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజా మాధ్యమాల్లో ప్రశ్నిస్తున్నారన్న కారణంతోనే ఆయన్ని వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కొణతం దిలీప్ అరెస్టు ఖండిస్తూ ఓ ట్వీట్ చేశారు.

తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్, తెలంగాణ వాది కొణతం దిలీప్‌ను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. కొంతకాలంగా ప్రభుత్వ అసమర్థతను, చేతగానితనాన్ని దిలీప్ ప్రశ్నించడాన్ని రేవంత్ సర్కారు తట్టుకోలేకపోతోందన్నారు. కొన్ని రోజుల క్రితం కూడా తప్పుడు కేసులో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించగా హైకోర్టు చీవాట్లు పెట్టినా, బుద్ధి రాలేదన్నారు. ఎలాగైనా దిలీప్ గొంతు నొక్కాలన్న ఉద్దేశంతో మరోసారి అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా, ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో చెప్పకుండా అరెస్ట్ చేశారన్నారు.

ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కటమేనా ప్రజాపాలన అంటే? అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో పాలన కొనసాగించవచ్చని అనుకుంటే అది మీ భ్రమే అని కేటీఆర్ విమర్శించారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసిన ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్లు మరింత పుట్టుకొస్తారన్నారు. అక్రమంగా దిలీప్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంటనే ఆయనను విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 9 నెలలుగా తెలంగాణలో వాక్స్వాతంత్ర్యం లేదు, నిరంకుశ పాలన సాగుతోందని ఆరోపించారు. కొణతం దిలీప్ అరెస్టు తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇది తెలంగాణలో పెచ్చుమీరుతున్న నిరంకుశత్వానికి స్పష్టమైన సంకేతం అని ఆయన ఆరోపించారు.

Read More
Next Story