రేవంత్ కంచుకోట కాదు.. కేసీఆర్ కంచుకోట అని రుజువైంది
x

'రేవంత్ కంచుకోట కాదు.. కేసీఆర్ కంచుకోట అని రుజువైంది'

బీఆర్‌ఎస్‌ నుంచి కొత్తగా ఎన్నికైన మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్‌ రెడ్డి, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్‌ కుమార్ (తీన్మార్ మల్లన్న) గురువారం ప్రమాణస్వీకారం చేశారు.


బీఆర్‌ఎస్‌ నుంచి కొత్తగా ఎన్నికైన మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్‌ రెడ్డి, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్‌ కుమార్ (తీన్మార్ మల్లన్న) గురువారం ప్రమాణస్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఇద్దరు అభ్యర్థుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌తో పాటు ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జి దీపాదాస్ మున్షీ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ నవీన్‌ రెడ్డి మాట్లాడుతూ... ఎన్నికల్లో తన గెలుపునకు కృషి చేసిన బీఆర్‌ఎస్‌ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నాను అన్నారు. ఈ గెలుపుతో పాలమూరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంచుకోట కాదని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట అని రుజువైందన్నారు.

కాగా, మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో 109 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. మార్చి 28న పోలింగ్ జరగగా, జూన్ రెండున ఫలితాలు వెల్లడయ్యాయి. 1439 ఓటర్లకు గానూ 1437 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. నవీన్ కుమార్ రెడ్డి 762 ఓట్లు సాధించి విజయాన్ని కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్రెడ్డికి 653 ఓట్లు వచ్చాయి. కోటా ఓట్లు 709 ఉండగా.. కోటా కంటే ఎక్కువ ఓట్లు రావడంతో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతోనే నవీన్ రెడ్డిని విజేతగా ప్రకటించారు.

తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ... తాను ఇప్పటి వరకు ఏ పదవి చేయలేదని తనను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిపించిన ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో ఓట్లు వేసిన గ్రాడ్యుయేట్లందరికి కృతజ్ఞతలు చెప్పిన ఆయన... బాధ్యత గలిగిన వ్యక్తిగా ఉంటానని చెప్పారు.

వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ స్థానానికి 2021లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే ఆయన గతేడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో పల్లా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా... ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి ఎన్నికల బరిలో నిలుచున్నారు.

మెుదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ద్వారా ఫలితం తేలకపోవంటతో.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత‌ అధికారులు మల్లన్న విజయాన్ని ధ్రువీకరించారు. మరో వైపు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ అనంతరం తీన్మార్ మల్లన్నకు 1,50,524 ఓట్లు, రాకేశ్ రెడ్డికి 1,35,802 ఓట్లు వచ్చాయి. అప్పటికీ గెలుపు కోటా అయిన 1,55,095 ఓట్లు ఎవరికీ రాలేదు. అయితే పోటీలో ఇద్దరే మిగలడం, అప్పటికే తీన్మార్ మల్లన్న, రాకేశ్ రెడ్డి కంటే 14,722 ఓట్ల ఆధిక్యంతో ఉండటంతో ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం రిటర్నింగ్ అధికారి మల్లన్నను విజేతగా ప్రకటించారు.

Read More
Next Story