రాజీనామా అంటే అంత ఉబలాటమెందుకో!
x

రాజీనామా అంటే అంత ఉబలాటమెందుకో!

తెలంగాణా రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. ప్రతిపక్షాల నేతల టార్గెట్ అంతా రేవంత్ రెడ్డిని ఇబ్బందిపెట్టడంపైనే ఎక్కువగా కేంద్రీకృతమైనట్లు అర్ధమవుతోంది


తెలంగాణా రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. ప్రతిపక్షాల నేతల టార్గెట్ అంతా రేవంత్ రెడ్డిని ఇబ్బందిపెట్టడంపైనే ఎక్కువగా కేంద్రీకృతమైనట్లు అర్ధమవుతోంది. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రత్యర్ధిగా కాంగ్రెస్ పార్టీకన్నా రేవంత్ నే ఎక్కువగా చూస్తున్నట్లున్నారు. అందుకనే మాటిమాటికి ‘మేము రాజీనామాలు చేస్తాం నువ్వు రాజీనామా చేస్తావా’ అంటు చాలెంజులు విసురుతున్నారు. ఈ రాజీనామా చాలెంజులు కూడా చాలా విచిత్రంగా ఉంటున్నాయి. తొందరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కు 14 సీట్లు వస్తాయని రేవంత్ రెడ్డి గట్టి విశ్వాసంతో ఉన్నారు. టార్గెట్ 15 సీట్లలో గెలుపు అనుకున్నా ఎందుకనో రేవంత్ మాత్రం పదేపదే 14 సీట్లలో గెలుపు గ్యారెంటీ అంటున్నారు.

దీనిపైన బీజేపీ ఎంఎల్ఏ, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వరరెడ్డి పార్టీ ఆపీసులో మాట్లాడుతు రేవంత్ ను చాలెంజ్ చేశారు. ‘రేవంత్ చెప్పినట్లు కాంగ్రెస్ కు 14 సీట్లు వస్తే తాను ఎంఎల్ఏగా రాజీనామాచేస్తాను’. ‘ఒకవేళ 14 సీట్లు రాకపోతే రేవంత్ రాజీనామా చేస్తారా’ అంటు చాలెంజ్ విసిరారు. కాంగ్రెస్ కు 14 సీట్లు రావటమే కాదట, ఆగష్టు 15 లోపు రైతులకు రుణమాఫీ కూడా చేయాలని ఏలేటి డిమాండ్ చేస్తున్నారు. ‘కాంగ్రెస్ కు 14 సీట్లు రావటమే కాకుండా, ఎన్నికల హామీలన్నీ నెరవేరిస్తే తాను స్పీకర్ ఫార్మాట్లో ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయటమే కాకుండా రాజకీయాల నుండి తప్పుకుంటా’నని ఏలేటి చాలెంజ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నిసీట్లలో గెలుస్తుందన్నది ఆ పార్టీ సమస్య మధ్యలో ఏలేటి అత్యుత్సాహం ఏమిటో అర్ధంకావటంలేదు. అలాగే కరీంనగర్ పార్టీ ఆఫీసులో ఎంపీ అభ్యర్ధి బండి సంజయ్ మాట్లాడుతు ‘ఆరు గ్యారెంటీలను అమలుచేసినట్లు నిరూపిస్తే తాను పోటీలో నుండి తప్పుకుంటా’నని రేవంత్ రెడ్డికి చాలెంజ్ విసిరారు.

బండి చాలెంజే విచిత్రంగా ఉంది. కాంగ్రెస్ పార్టీయే ఆరుగ్యారెంటీల్లో నాలుగింటినే అమలుచేశామని చెబుతోంది. అసెంబ్లీ ఎన్నికలసమయంలో ఇచ్చిన ఆరుగ్యారెంటీల్లో నాలుగింటిని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. రైతుబంధు, రైతులకు రు. 2 లక్షల రుణమాఫీ హామీలు మాత్రం పెండింగులో ఉన్నట్లు రేవంత్ తో పాటు మంత్రులు పదేపదే చెబుతున్నారు. వీటి అమలుకు ఆగష్టు 15వ తేదీని డెడ్ లైనుగా రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వమే ఆరుహామీల్లో నాలుగింటిని అమలుచేసినట్లు చెబుతుంటే బండి సంజయ్ మాత్రం ఆరుహామీలను అమలుచేసినట్లు నిరూపిస్తే పోటీనుండి తప్పుకుంటానని చాలెంజ్ చేయటమేమిటో అర్ధంకావటంలేదు. ‘ఆరుగ్యారెంటీలను అమలుచేయలేదని తాము నిరూపిస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులందరు ఎన్నికల నుండి తప్పుకుంటారా’ అని బండి ప్రశ్నించారు.

వీళ్ళగోల ఇలాగంటే బీఆర్ఎస్ నేత హరీష్ రావుది మరో గోల. రైతు రుణమాఫీని ఆగష్టు 15వ తేదీకి అమలుచేస్తామని రేవంత్ బహిరంగంగానే ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందికాబట్టి ఎన్నికల ప్రక్రియ పూర్తవ్వగానే ఆగష్టు 15వ తేదీని డెడ్ లైనుగా పెట్టుకున్నట్లు రేవంత్ చెప్పారు. వెంటనే హరీష్ రాజీనామా చాలెంజితో గొడవ మొదలుపెట్టేశారు. ‘ఆగష్టు 15కి రుణమాపీ చేయకపోతే రేవంత్ రాజీనామా చేస్తారా’ అంటు నానా రచ్చ చేస్తున్నారు. అంతటితో హరీష్ ఆగకుండా రుణమాఫీ చాలెంజ్ పై ముందుగానే రాజీనామాలు చేయాలంటు నానా గోలచేస్తున్నారు. అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి రేవంత్ ముందస్తు రాజీనామా లేఖను మేథావులకు అందించాలని డిమాండ్ చేయటమే హైలైట్. ఇచ్చిన హామీని అమలుచేయలేకపోతే రాజీనామా చేసే ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారా ? ఈ విషయం హరీష్ కు తెలీదా ? నిజంగానే ఇచ్చిన మాటతప్పినందుకు రాజీనామా చేయాలంటే కేసీయార్ ఎన్నిసార్లు రాజీనామాలు చేయాల్సొచ్చేదో పదేళ్ళ పాలనలో.

ఆ విషయాన్ని మరచిపోయిన హరీష్ పదేపదే రేవంత్ ను రాజీనామా లేఖ పేరుతో రెచ్చగొడుతున్న విషయం అర్ధమైపోతోంది. తాను శుక్రవారం సాయంత్రం అమరవీరులస్తూపం దగ్గరకు వచ్చి రాజీనామా లేఖపేరుతో చేసిన హడావుడి అందరు చూసిందే. హరీష్ కు రేవంత్ కౌంటరిస్తు ‘ఆగష్టు 15కి రుణమాఫీ చేయటం ఖాయమని, సిద్దిపేటకు ఆ రోజుకు ఒక దరిద్రం వదిలిపోతుంద’ని సెటైర్లు వేశారు. రేవంత్ ఆగష్టు 15వ తేదీన రుణమాఫీ అమలుచేస్తామని చెప్పినపుడు అప్పటివరకు ప్రతిపక్షాలు వెయిట్ చేయాలి. నిజంగానే రేవంత్ గనుక రుణమాఫి చేస్తే ప్రతిపక్షాలకు మాట్లాడటానికి ఏమీ ఉండదు. ఒకవేళ రుణమాఫీ జరగకపోతే అప్పుడు ప్రతిపక్షాలు ఏమి మాట్లాడినా చెల్లుతుంది. హామీల అమలుపై పదేపదే రేవంత్ ను రెచ్చగొట్టి మాట తూలితే దాన్నిపట్టుకుని నానా యాగీచేయాలన్నదే బీఆర్ఎస్, బీజేపీ నేతల ప్లానుగా అర్ధమవుతోంది. మరి రేవంత్ అంత తేలిగ్గా దొరుకుతారా ? చూడాలి ఏమి జరుగుతుందో.

Read More
Next Story