ఇంటింటి కుటుంబ సర్వే దేశంలోనే ప్రథమం
దేశంలోనే మొట్టమొదటిసారి ఇంటింటి కులగణన సర్వేను తెలంగాణలో చేపట్టారు. ముందుగా ఇళ్లకు స్టిక్కర్లు అతికించారు. ఈ కుటుంబ సర్వే తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.
దేశంలోనే ప్రప్రథమంగా చేపట్టిన ఈ ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.ఈ కులగణన కుటుంబ సర్వేలో ప్రతీ ఒక్క కుటుంబం పాల్గొనేలా ప్రతీ రోజూ ప్రజలను ఛైతన్య పర్చేలా విస్తృత ప్రచారం చేపట్టాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఏ ఇంటిని కూడా వదలకుండాపకడ్బందీగా సర్వే నిర్వహించాలని ఆమె కోరారు.
సీఎస్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు చిత్త శుద్దితో కృషిచేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణపై శుక్రవారం ఉదయం ప్రత్యేకాధికారులతో ఆమె టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఇళ్లకు స్టిక్కర్లు
తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా ఈ సర్వేను పర్యవేక్షిస్తున్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, ఈ సర్వే కు
సంబంధించి ఇంటింటి వివరాలను సేకరించి స్టిక్కరింగ్ చేసే ప్రక్రియ రేపటితో పూర్తవుతుందన్నారు. ఈ నెల 9వతేదీ నుంచి అసలు సర్వే మొదలవుతుందని ఆమె పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలకు నియమితులైన ప్రత్యేకాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి సర్వే జరుగుతున్న విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించాలని సీఎస్ సూచించారు.
సర్వే డేటా కంప్యూటరీకరణ
తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న కులగణన ఇంటింటి సర్వే వివరాలను కంప్యూటరీకరణ చేయాలని చీఫ్ సెక్రటరీ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, సర్వే నోడల్ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని ఆమె సూచించారు. ఇంటింటి సర్వేలో సేకరించిన వివరాలను కంప్యూటరైజ్ చేయడానికి సుశిక్షితులైన డాటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించేల చర్యలు చేపట్టాలని ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు.
Next Story