Food Poison | అధికారులు నిద్రపోతున్నారా?.. పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌పై హైకోర్టు సీరియస్
పిల్లల ఆరోగ్యాలంటే అధికారులకు, ప్రభుత్వానికి పట్టడం లేదా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఉన్నత న్యాయస్థానం.
పాఠశాలల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్(Food Poison) ఘటనపై తెలంగాణ హైకోర్టు(High Court) మండిపడింది. పిల్లల ఆరోగ్యాలంటే అధికారులకు, ప్రభుత్వానికి పట్టడం లేదా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఉన్నత న్యాయస్థానం. వరుసగా ఫుడ్ పాయిజన్‌కు విద్యార్థులు గురి కావడం ఏంటని, పిల్లలకు పెట్టే భోజనం నాణ్యతను అధికారులు గాలికొదిలేని మొద్దు నిద్ర పోతున్నారా అని శివాలెత్తింది న్యాయస్థానం. ఆసిఫాబాద్ వాంకిడి గిరిజన పాఠశాలలో ఫుడ్‌పాయిజన్‌కు శైలజ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయింది. ఇంతలోనే పలు చోట్ల ఫుడ్ పాయిజన్ ఘటనలకు వెలుగుచూడటం తీవ్ర ఆందోళనకరంగా మారింది. నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో గత వారం ఫుడ్ పాయిజన్ ఘనట కలకలం రేపింది. దాదాపు 50 మంది విద్యార్థులు దీని బారిన పడి చికిత్స పొందారు. ఆ ఘటన మరువక ముందే అదే పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ కావడం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దాదాపు 29 మంది విద్యార్థులు ఫుడ్‌పాయిజన్‌కు గురయ్యారు. మధ్యాహ్నం సమయంలో పాఠశాలలో భోజనం చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో వారికి ఒక్కసారిగా వాంతులు కావడం మొదలయ్యాయి.
వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది.. వారందరినీ హుటాహుటిన స్థానిక పీహెచ్‌సీకి తరలించింది. అక్కడ ప్రాథమిక చికిత్స అందించగా నలుగురు విద్యార్థులు కోలుకున్నారు. మిగిలిన 25 మందిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలియడంతో తెలంగాణ ప్రభుత్వం, అధికారులపై హైకోర్టు మండిపడింది. హైకోర్టు సీజే అలోక్ అరాధ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘వారంలో మూడుసార్లు భోజనం వికటిస్తే అధికారులు ఏం చేస్తున్నారు? పిల్లలు మరణిస్తే కానీ తప్పించుకోరా? నారాయణపేట జడ్పీ స్కూల్ ఘటన అధికారుల నిర్లక్ష్యానికి ప్రతీక. పిల్లలకు పెట్టే భోజనం నాణ్యతను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదు. కోర్టు ఆదేశాలు జారీ చేస్తేనే పనులు చేస్తారా? నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే 5 నిమిషాల్లో హాజరవుతారు. అధికారులకు కూడా పిల్లలు ఉన్నారు కదా. మరి ప్రభుత్వ పాఠశాలల్లో ఆహారం తినే పిల్లల విషయంలో ఇంతటి నిర్లక్ష్యం ఎందుకు? అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహారించాలి’’ అని సూచించింది న్యాయస్థానం దీనిపై స్పందించిన ప్రభుత్వ న్యాయమూర్తి.. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు.
ఇదిలా ఉంటే విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడానికి కారణం స్కూలలో పెట్టే భోజనం కాదని, విద్యార్థులు బయట తింటున్న చిరు తిండ్లని మాగనూరు అధికారులు అంటున్నారు. బాధిత విద్యార్థులు మాత్రం తమ పాఠశాలలో ఊడికీ ఉడకని అన్నం, వంకాయ ఆలుగడ్డ కూర పెట్టారని, తాగు నీరు కూడా సరిగా లేదని చెప్తున్నారు. అంతేకాకుండా ఫుడ్ పాయిజన్‌కు గురైన వారెవరూ కూడా చిరు తిండ్లు తిన్నది లేదని వివరిస్తున్నారు. పాఠశాల భోజనం తినడం వల్లే అస్వస్థకు గురయ్యామని వారు బాహాటంగా చెప్తున్నారు. ఈ క్రమంలోనే మాగనూరు ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ సిక్త పట్నాయక్ సందర్శించారు. వంట గది, కూరగాయలు, వంట సామాగ్రి, పరిసరాలను క్షేణ్ణంగా పరిశీలించారు. అనంతరం వంటి చేస్తున్న సిబ్బందిని పలు విషయాలు అడిగి వివరాలు సేకరించారు.