SLBC ప్రమాదం.. రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్
x

SLBC ప్రమాదం.. రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్

అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ముందుకు ఎలా కొనసాగాలని అనే నిర్ణయం తీసుకోగలమని చెప్పారు ర్యాట్ హోల్ మైనర్స్.


శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(SLBC) టన్నెల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇందులో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజనీర్లు చిక్కుకుపోయారు. వారి పరిస్థితిపై 48 గంటలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎటువంటి అప్‌డేట్ రాలేదు. వారిని రక్షించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఎట్టిపరిస్థితుల్లో వారిని కాపాడి తీరాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మురం చేసింది. టాస్క్‌ఫోర్స్‌ సైతం ఇప్పటికే రంగంలోకి దిగగా. ఇప్పుడు తాజాగా ర్యాట్ హోల్ మైనర్స్ కూడా బరిలోకి దిగారు. సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించడం కోసం ర్యాట్ హోల్ మైనర్స్‌ సహాయం తీసుకుంటుంది తెలంగాణ సర్కార్.


ఈ రక్షణ చర్యల్లో వందలాది మంది పాల్గొంటున్నారు. భారత సైన్యం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. వీటిలో భాగంగా ఆరుగురు ర్యాట్ హోల్ మైనర్లను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. హైదరాబాద్‌కు చేరకుంటూనే వారు ప్రమాద స్థలానికి పయనమయ్యారు. అక్కడ చిక్కుకున్నవారిని రక్షించడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయా? లేక ప్రతికూల పరిస్థితులు ఉన్నాయా? పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే ఏం చేయగలం? ఎలా చేయాలి? అన్న అంశాలపై దృష్టి పెడతామని ర్యాట్ హోల్ మైనర్లు తెలిపారు. రెస్క్యూ టీమ్స్‌తో కలిసి సమన్వయం చేసుకోవాలని చెప్పారు. బురద, నీరు ఎక్కువగా ఉందని అధికారులు చెప్తున్నారని, అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ముందుకు ఎలా కొనసాగాలని అనే నిర్ణయం తీసుకోగలమని చెప్పారు.

ర్యాట్ హోల్ మైనర్స్ అంటే ఎవరు?

ర్యాట్ హోల్ మైనర్స్ అంటే బొగ్గు నిక్షేపాలున్న ప్రాంతాల్లో ఎలుక బొరియల మాదిరిగా చిన్నచిన్న సైజు సొరంగాలను తవ్వుతారు. వాటి ద్వారా భూగర్భం నుంచి బొగ్గును వెలికి తీస్తారు. ఈ విధానాన్ని ర్యాట్ హోల్ మైనింగ్ అంటారు. దీనిని అత్యంత ప్రమాదకరమైన పద్దతిగా భావిస్తారు. కానీ అనే సందర్భాల్లో ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని రక్షించడంలో వీరు కీలక పాత్ర పోషిస్తారు. 2023లో ఉత్తరాఖండ్‌లోని సిల్కియారా సొరంగ ప్రమాదంలో కూడా వీరు కీలక పాత్ర పోషించారు. ఆ ప్రమాదంలో రెస్క్యూ టీమ్స్ దాదాపు 17 రోజులు ప్రయత్నించినా రక్షించలేకపోయాయి. కానీ ర్యాట్ హోల్ మైనర్స్ ఒక్కరోజులోనే లోపల చిక్కుకున్నవారిని సురక్షితంగా బయటకు తీశారు. ఈ క్రమంలో ఇప్పుడు ఎల్ఎల్‌బీసీ ప్రమాద ఘటన దగ్గర కూడా వీరి సహాయం తీసుకోవడం ద్వారా రక్షణ చర్యలను వేగవంతం చేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

సీఎం రేవంత్ ఆరా

కాగా ఎల్ఎల్‌బీసీ ప్రమాద ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ప్రతి గంటకు ఒకసారి అధికారులు, మంత్రులను సంప్రదిస్తూ అక్కడి పరిస్థితులపై సమాచారం అడిగి తెలుసుకుంటున్నారు. సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను కాపాడటానికి చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. అందుకోసం ప్రభుత్వం తరపున పూర్తి సహాకారం అందించాలని, వారిని రక్షించడం కోసం ఎటువంటి ప్రయత్నాలైనా చేయాలని చెప్పారు. కార్మికులను రక్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు కొనసాగించాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. మంత్రి జూపల్లి మరోసారి సొరంగంలోని పరిస్థితులను పరిశీలిస్తారని అన్నారు.

Read More
Next Story