అంగన్వాడీలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని చెబుతోన్న కాంగ్రెస్ సర్కార్ మరో పథకానికి శ్రీకారం చుడుతున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని రహమత్ నగర్ లో జరిగిన "అమ్మ మాట - అంగన్వాడి బాట" కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ... పదవీ విరమణ పొందే అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. రిటైర్ అయ్యే అంగన్ వాడీ టీచర్లకు రూ. రెండు లక్షలు, హెల్పర్లకు రూ. లక్ష రిటైర్మెంట్ ప్యాకేజీని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక జీవో విడుదల చేస్తామని సీతక్క హామీ ఇచ్చారు. నామమాత్రపు వేతనంతో సేవలందిస్తున్న అంగన్వాడీ సిబ్బంది కష్టాలు ప్రభుత్వానికి తెలుసని మంత్రి అన్నారు. అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన హామీని తమ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందన్నారు. ప్రభుత్వ ప్రకటనపై అంగన్వాడీలు హర్షం వ్యక్తం చేశారు.
అంగన్వాడీల ధర్నాలు...
ఇటీవల ఎన్నికల సమయంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ సహా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఉద్యోగ విరమణ, పెన్షన్ సదుపాయం తదితర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఉద్యోగులను వంచించే విధంగా ఉందని అంగన్వాడీ టీచర్స్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వం జీవో నంబర్ 10ని వెనక్కు తీసుకుని కొత్త జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. వీరి ధర్నాల నేపథ్యంలోనే ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్ ని ప్రకటించినట్లు స్పష్టం అవుతోంది.
కాగా, తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల భవనాల్లో కొనసాగుతున్న సుమారు 15 వేల అంగన్వాడీ కేంద్రాలను తొలిదశలో ఉన్నతీకరిస్తున్నది. వాటిని ప్రీప్రైమరీ పాఠశాలలుగా తీర్చిదిద్దుతోంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే వాటిని అందుబాటలోకి తీసుకొచ్చింది.