
పార్టీ పెద్దలను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు..
తెలంగాణలో కులగణన పూర్తి చేయడం, బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించిన అంశాలను వారు రాహుల్ గాంధీకి వివరించారు.
ఢిల్లీ జంతర్ మంతర్ కూడలిలో బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు మహా ధర్నా చేశాయి. ఈ ధర్నాలో కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొన్నారు. కాగా తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు ఈరోజు పార్లమెంటులో పార్టీ పెద్దలు సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో కులగణన పూర్తి చేయడం, బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించిన అంశాలను వారు రాహుల్ గాంధీకి వివరించారు. అదే సమయంలో జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాలు చేపట్టిన మహాధర్నా గురించి కూడా వివరించారు. ఈ సందర్బంగానే బీసీ రిజర్వేషన్లను 42శాతం చేసే అంశాలపై 9వ షెడ్యూల్‌లో పెట్టించి అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కోరినట్లు తెలుస్తోంది.
అదే విధంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో పార్లమెంటులో అధికార పార్టీ బీజేపీపై ఒత్తిడి పెంచాలని కూడా కోరినట్లు తెలుస్తోంది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బీసీ రిజర్వేషన్లను విజయవంతం చేయాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను కోరినట్లు సమాచారం. కాగా అందుకు వారు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. రేపు లేదా ఎల్లుండి పార్లమెంటు సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. తెలంగాణ బిసి మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, ఎంపీ అనిల్ యాదవ్, విప్ లు అది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నాయకులు పార్లమెంటులో పార్టీ పెద్దలను కలిశారు.